Site icon NTV Telugu

Off The Record: బీఆర్ఎస్ సిట్టింగ్ లకు ఫిట్టింగేనా?

Sddefault (3)

Sddefault (3)

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సరికొత్త తలనొప్పులు వస్తున్నాయా? ఎన్నికల టైం దగ్గరపడేకొద్దీ అసలు పని చేసుకోవాలా వద్దా అన్న అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రస్తుతం ఇద్దరితో మొదలైన ఇబ్బందుల పర్వం ఇంకా పెరగబోతోందా? సిట్టింగ్‌లు ఉన్న చోట ఆశావహుల దూకుడుకు కారణాలేంటి? కేవలం మహిళలే ఎందుకు టార్గెట్‌ అవుతున్నారు?

ఉక్కిరి బిక్కిరి అవుతున్న కొందరు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్స్‌
అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ ఎంత సీరియస్‌గా సిద్ధం అవుతోందో… పార్టీలో ఆశావహులు కూడా అంతే సీరియస్‌గా టిక్కెట్‌ కోసం పావులు కదుపుతున్నారు. సిట్టింగ్‌ గిట్టింగ్‌ జాన్తానై… అంటూ… ఎవరికి వారు తలో గాడ్‌ఫాదర్‌ని పట్టుకుని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి గ్రీన్‌ సిగ్నల్‌ రాకున్నా.. పోటీ కోసం గ్రౌండ్‌వర్క్‌ కూడా చేసేసుకుంటున్నారట.
హ్యాట్రిక్‌ కొట్టి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్‌…ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో నేతలకు దిశా నిర్దేశం చేశారు. అక్టోబర్ డెడ్ లైన్ గా పెట్టుకొని పనులు చేసుకోవాలని నేతలకు స్పష్టం చేశారు. పలు నియోజకవర్గాల్లో ఆశావాహుల హడావుడి ఒక్కసారిగా పెరిగిపోవడంతో…సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట.

ఖానాపూర్‌ నుంచి మూడోసారి పోటీ చేయాలనుకుంటున్న రేఖా నాయక్‌
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేఖ నాయక్ 2014, 2018లో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మరో సారి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఖానాపూర్‌ మీద నజర్ వేశారట జాన్సన్ భూక్యా నాయక్. ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారట. సిట్టింగ్‌లకే తిరిగి సీట్లన్న మాటను కూడా లైట్‌ తీసుకుంటున్నారట ఆయన. కేటీఆర్‌ తనకు స్నేహితుడని, ఆయన ఖాతాలో సీటు ఖాయమని చెబుతూ నియోజకవర్గమంతా కలియ తిరిగేస్తున్నారట భూక్యా నాయక్‌. దీంతో ఇప్పుడు రేఖా నాయక్‌ వర్గంలో టెన్షన్‌ మొదలైందట.

ఇలాంటివి ఇంకా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి?
మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. ఈసారి కూడా అక్కడ నుంచే బరిలోకి దిగాలని అనుకుంటున్నారామె. కానీ..మరో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ పై నజర్ పెట్టారట. ఇప్పటికే అక్కడ రాజకీయ పర్యటనలు మొదలు పెట్టారట మైనంపల్లి రోహిత్.ఈ సారి చాలా మంది సిట్టింగ్ లను మార్చే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్న రోహిత్ తనకు కేసీఅర్ అవకాశం ఇస్తానని చెబుతున్నారట. దీంతో నియోజకవర్గంలోని పరిణామాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారట పద్మా దేవేందర్ రెడ్డి. అట్నుంచి ఇంకా పూర్తి క్లారిటీ రాకపోవడంతో…మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో అధికార పార్టీ పోటా పోటీ కార్యక్రమాలతో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. పైకి ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కనిపిస్తున్నా…రాను రాను ఇలాంటి వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. ఈ కొత్త రాజకీయ సమీకరణలు భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనన్న ఆందోళన కూడా స్థానిక కేడర్‌లో పెరుగుతోందట. ప్రత్యేకించి మహిళా శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాలే టార్గెట్‌ అవడం ఏంటన్న చర్చ కూడా జరుగుతోందట. ఆశావహుల దూకుడుకు అధిష్టానం కళ్ళెం వేస్తుందా? లేదా అన్నది చూడాలి.

Exit mobile version