Site icon NTV Telugu

Off The Record: ఉమ్మడి ప్రకాశం పాలిటిక్స్ లోకి వైసీపీ సీనియర్ లీడర్ రీఎంట్రీ..?

Otr Yv Subba Reddy

Otr Yv Subba Reddy

Off The Record: ఉమ్మడి ప్రకాశం జిల్లా పాలిటిక్స్‌లో ఒకప్పుడు యాక్టివ్‌గా ఉండి తర్వాత కాస్త తగ్గిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రీ ఛార్జ్‌ అవుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు బాబాయ్‌ అయిన వైవీ… 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచారు. వెలిగొండ ప్రాజెక్టు సాధ‌న కోసం ఆయ‌న చేసిన పాద‌యాత్రకు మంచి మైలేజ్ వ‌చ్చినట్టు చెప్పుకుంటాయి వైసీపీ వర్గాలు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల రీజినల్ కో ఆర్డినేట‌ర్‌గా ఉన్నారాయన. గ‌తంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డితో విభేదాల కారణంగా… ప్రకాశం జిల్లా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు సుబ్బారెడ్డి. ఉమ్మడి జిల్లా వైసీపీలో బాలినేని అన్నీ తానై న‌డ‌ప‌టంతో వైవీ కూడా పెద్దగా జోక్యం చేసుకునేవారు కాదు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఉమ్మడి ప్రకాశంలో కేవ‌లం రెండు అసెంబ్లీ సీట్లకే పరిమితం అయింది వైసీపీ. ఇక అదే సమయంలో బాలినేని ఫ్యాన్ పార్టీని వీడి గ్లాస్ గూటికి చేర‌టంతో ప్రస్తుతం ప్రకాశం వైసీపీకి ఆ స్థాయి నేత కరవయ్యారు. మ‌రోవైపు 2024 ఎన్నిక‌ల్లో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కాం కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చినా తిరిగి ప్రకాశం జిల్లా వైపు చూస్తారా అన్న అనుమానాలున్నాయి. ఈ పరిస్థితుల్లో వైవీ సుబ్బారెడ్డిలాంటి కీల‌క నేత‌కు జిల్లాలో కీ రోల్ ఇస్తే… తిరిగి పార్టీ గాడిన పడుతుందని ఫ్యాన్‌ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.

గ‌త ఎన్నిక‌ల్లో… ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాలకుగాను 11 చోట్ల అభ్యర్ధులను మార్చిన వైసీపీ చివరికి రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ త‌ర్వాత అద్దంకి, ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్ఛార్జ్‌లను మార్చినా అక్కడ ఇంకా పార్టీ యాక్డివ్ మోడ్‌లోకి రాలేద‌ని టాక్. బాలినేని శ్రీనివాస‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి స్వయానా బావ, బావ‌మ‌రుదులు కావ‌టం.. జ‌గ‌న్‌తో బంధుత్వం కారణంగా అన్నీ తామై జిల్లా పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేవారు. ఆ త‌ర్వాత ఆ ఇద్దరి మ‌ధ్య ఏర్పడ్డ గ్యాప్‌తో పార్టీలో గ్రూపులు త‌యార‌వుతున్నాయ‌ని భావించిన జ‌గ‌న్… వైవీ సుబ్బారెడ్డికి కీల‌క భాద్యత‌లు అప్పగించారు. ఆ త‌ర్వాత టీటీడీ చైర్మన్‌గా, రాజ్యసభ ఎంపీగా అవ‌కాశం ఇచ్చారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి తర్వాత బాలినేని పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవ‌టం, చెవిరెడ్డి అరెస్టై ఇంకా జైల్లోనే ఉండ‌టం వంటి ప‌రిణామాలతో జిల్లా పార్టీ కేడర్‌ డీలా పడ్డట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గాల్లోని సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో కూడా ద్వితీయ శ్రేణి నేతలకు అర్ధం కావడం లేదట. అందుకే వైవీ సుబ్బారెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టు సమాచారం.

గ‌త ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గాలు మారిన కొంద‌రు తిరిగి త‌మ సొంత ప్రాంతాలకు వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఇప్పుడున్న చోట మౌనం పాటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో… జిల్లాను ఇప్పట్నుంచి సెట్‌ చేస్తేనే ఎన్నికల నాటికి ప్రయోజనం ఉంటుందని భావిస్తోందట అధిష్టానం. మ‌రోవైపు జిల్లా ప‌శ్చిమ ప్రాంతాన్ని విడ‌గొట్టి మార్కాపురం జిల్లాగా ప్రకటించడం, వెలిగొండ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టడం, అద్దంకి, కందుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌ను తిరిగి ప్రకాశం జిల్లాలోకి తీసుకువ‌చ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం ద్వారా పట్టు తగ్గకుండా టీడీపీ జాగ్రత్త పడుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇదే జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి అయితేనే పార్టీ సెట్ అవుతుంద‌ని నమ్ముతున్నారట పెద్దలు. అదే స‌మ‌యంలో పార్టీ అధినేత ఆదేశిస్తే ఏ భాద్యత‌ అయినా తీసుకునేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని వైవీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో త్వర‌లోనే జిల్లా పాలిటిక్స్‌లోకి ఆయన రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనిఅంటున్నారు.

Exit mobile version