Off The Record: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ ఇన్చార్జ్‌లు పార్టీలో కట్టప్పల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారట. తమతోనే ఉంటూ… వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి మారిన వాళ్ళకు కూడా టచ్‌లో ఉన్న వాళ్లని కట్టడి చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి మైలవరం, జగ్గయ్యపేట, పెనమలూరు నియోజకవర్గాల్లో ఈ ఆపరేషన్ నడుస్తోందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభాను, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, పెనమలూరు నుంచి పార్ధసారధి గెలిచారు. ఇక 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయాక ఉదయభాను జనసేన పార్టీలోకి వెళ్ళగా, వసంత కృష్ణ ప్రసాద్, పార్ధసారధి టీడీపీ కండువా కప్పు కున్నారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాలకు వైసీపీ అధిష్టానం కొత్త ఇన్చార్జ్‌లను నియమించింది. మైలవరానికి మాజీ మంత్రి జోగి రమేష్, జగ్గయ్యపేటకు తన్నీరు నాగేశ్వరరావు, పెనమలూరుకు దేవభక్తుని చక్రవర్తి ఇన్ఛార్జ్‌లుగా ఉన్నారు. ఈ మూడు చోట్ల ఇప్పుడు కట్టప్పల్ని బయటికి పంపే కార్యక్రమం మొదలైందట. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దూకుడుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడయ్యారు వైసీపీ అధ్యక్షుడు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్ని అందుకోసం సమాయత్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఎక్కడికక్కడ నియోజక వర్గాల్లో పార్టీ కమిటీల కూర్పు బాధ్యతను ఇన్ఛార్జ్‌లకు అప్పగించారాయన. నియోజకవర్గ స్థాయి నుంచి సోషల్ మీడియా టీమ్స్ వరకు అన్ని కమిటీల ఏర్పాటు బాధ్యతలు వాళ్ళవే. ఈ క్రమంలోనే… గ్రామాల వారీగా పార్టీ పదవులను భర్తీ చేస్తున్నారు. అలాంటి నియామకాల విషయమై ఈ మూడు నియోజకవర్గాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
జగ్గయ్యపేటను పరిశీలిస్తే ఇక్కడ నుంచి సామినేని ఉదయభాను ఐదుసార్లు పోటీ చేశారు. అందులోనూ… వైసీపీ తరపున మూడు సార్లు బరిలో దిగారు. దాంతో సహజంగానే…ఇక్కడ ఉన్న క్యాడర్‌లో ఎక్కువ మంది ఆయన వర్గమే. దీంతో సామినేనికి టచ్ లో ఉండి వైసీపీలో కొనసాగుతున్న వారికి పదవులు ఇవ్వకుండా దూరం పెడుతున్నారట. ఇక మైలవరం నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచిన వసంత కృష్ణప్రసాద్ 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పార్టీ మారినప్పుడు చాలా వరకు ఆ వర్గం పార్టీని వదిలి టీడీపీలో చేరింది. ఇంకా కొందరు మాత్రం వైసీపీలో ఉన్నారనే అనుమానాలు కొత్త ఇన్చార్జ్ జోగి రమేష్‌కు ఉన్నాయట. ఇటీవల లిక్కర్ స్కాంలో ఆయన అరెస్టు అయి జైల్లో ఉన్నా… అరెస్ట్‌కు ముందు వరకు వసంతతో లింకులు ఉన్న వారి గురించి గట్టి ఎంక్వైరీలే చేసినట్టు తెలిసింది. వాళ్ళతో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తూ వారికి పదవులు ఇవ్వ లేదట. ఇక పెనమలూరు నియోజకవర్గం నుంచి పార్థసారధి రెండు సార్లు పోటీ చేశారు. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నూజివీడు నుంచి గెలిచారాయన. ప్రస్తుతం పెనమలూరులో వైసీపీ దేవభక్తుని చక్రవర్తికి ఇన్చార్జి బాద్యతలు ఇచ్చింది. ఆయన కూడా పార్టీ పదవులను హార్డ్‌కోర్ వైసీపీ వారికి ఇవ్వటమే ప్రధమ ప్రాధాన్యతగా తీసుకున్నట్టు తెలిసింది. మావాళ్ళకే ఇవ్వాలంటూ సీనియర్స్ నుంచి రకరకాల ప్రతిపాదనలు వస్తున్నా… ఆ విషయంలో చక్రవర్తి ఆచితూచి వ్యవహరిస్తున్నారట. ప్రతిపాదనల్ని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. సొంత పార్టీలో ఉండి పక్క పార్టీ వారితో పొలిటికల్ రొమాన్స్ చేస్తున్న వారికి చెక్ పెట్టడం కోసమే ఇదంతా అని మాట్లాడుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. వచ్చే ఎన్నికల నాటికి సొంత టీములను సిద్దం చేసుకోవటం కూడా ఇప్పుడు కట్టప్పలను గుర్తించటానికి కారణమని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
