Off The Record: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడింది మొదలు నీళ్ళలో నిప్పులు అంటుకున్నాయి. అడ్వాంటేజ్ కోసం రెండు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలు ప్రయత్నించడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. రేవంత్ స్టేట్‌మెంట్‌ని బేస్ చేసుకుని వైసీపీ అన్ని వైపుల నుంచి కార్నర్ చేయటంతో ఒక దశలో ఏపీ అధికార పక్షం టీడీపీ సైతం ఉలిక్కిపడింది. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపిన చరిత్ర తనదంటూ అసెంబ్లీ తెలంగాణ సీఎం అన్న మాటలు తమకు దొరికిన బ్రహ్మాస్త్రంగా భావించింది వైసీపీ. దీనిపై వరుస కౌంటర్స్ ఇస్తున్న టైంలో ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ అధ్యక్షుడు జగన్ దీనికి సంబంధించి గతంలో తమ హయాంలో జరిగిన పనుల్ని వివరించారు. మేటర్ అక్కడితో ఆగి ఉంటే అది వేరే సంగతి. కానీ… ప్రెస్ మీట్ తర్వాత పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో అమరావతి ప్రస్తావన తీసుకువచ్చారు జగన్. దాంతో… ఒక్కసారిగా టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. సరిగ్గా అక్కడే టీడీపీకి కూడా బ్రీత్ దొరికిందన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. జగన్ నోట అమరావతి మాట రాగానే పొలిటికల్ ఫోకస్ మొత్తం నీళ్ళ మీద నుంచి రాజధానికి మళ్ళింది.
అమరావతిలో జరుగుతున్న రెండవ విడత భూసేకరణ, నిర్మాణం జరుగుతున్న ప్రాంతం, అసలు రాజధాని పదానికి నిర్వచనం లాంటి అంశాల్ని జగన్ ప్రస్తావించడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ హాట్‌గా మారిపోయింది. అధికార విపక్షాల మధ్య అమరావతి కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదని, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడికే వ్యవస్థలన్నీ వస్తాయి కాబట్టి అదే రాజధాని అవుతుందని చెప్పారు వైసీపీ అధ్యక్షుడు. రివర్ బేసిన్‌లో ఒక భవనం నిర్మించడానికే అనుమతి ఉండదని,అలాంటిది ఏకంగా రాజధానిని ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారాయన. ఆ దెబ్బకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎపిసోడ్ ఎటోపోయి… రాజధానిని తమకు అనుకూల అస్త్రంగా మార్చుకుని రివర్స్ అటాక్ మొలుపెట్టారు టీడీపీ లీడర్స్. జగన్ తాజా వ్యాఖ్యలతో వైసీపీ అమరావతికి వ్యతిరేకమని మరోసారి స్పష్టమైందంటూ అందుకున్నారు అధికార పక్ష నేతలు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా…. అమరావతిని నిర్మించి తీరుతామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.సరిగ్గా ఇక్కడే రాజకీయవర్గాల్లో కూడా కొత్త చర్చ మొదలైంది. రాయలసీమ లిఫ్ట్‌పై అప్పటి వరకూ పైచేయిగా ఉన్న వైసీపీ…. జగన్ అమరావతి ప్రస్తావన తర్వాత డిఫెన్స్‌లో పడాల్సి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై ఇప్పటి వరకు టీడీపీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. దానికి సంబంధించి జగన్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం లేకపోగా… ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఎదురుదాడి మొదలైంది.
దీంతో వైసీపీ అధ్యక్షుడి రియాక్షన్‌పై సరికొత్త చర్చలు నడుస్తున్నాయి రాజకీయవర్గాల్లో. అమరావతి విషయంలో ఇప్పటికిప్పుడు వైసీపీ మాట్లాడాల్సిన అవసరం లేదని, రైతుల రియాక్షన్స్, ఇతరత్రా జరుగుతున్న పరిణామాలను కామ్‌గా కొన్నాళ్ళు పరిశీలించాక అవసరం అనుకున్నప్పుడు స్పందిస్తే పోయేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అనవసరంగా వేరే సీరియస్ టాపిక్ మాట్లాడుతూ కూడా రాజధాని ప్రస్తావన తీసుకురావడంతో అన్నీ లైట్ అయిపోయాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో జరిగిన డ్యామేజ్‌ను గమనించిన వైసీపీ… జగన్ మాట్లాడిన అంశాలపై సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటూ కొత్త రాగం అందుకుంది. మొదటి విడత రైతుల సంగతి తేల్చకుండా రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు వెళ్ళి రైతుల్ని భ్రమల్లో పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మీద సూటిగా సమాధానం చెప్పలేకే చంద్రబాబు టీమ్ టాపిక్ డైవర్ట్ చేస్తోందన్నది ఫ్యాన్ పార్టీ వెర్షన్. ఈ వివరణల వ్యవహారం ఎలాఉన్నా…రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అందివచ్చిన మంచి అవకాశాన్ని వైసీపీ ప్రస్తుతానికి చేజార్చుకుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.
