Site icon NTV Telugu

Off The Record: మంత్రి లోకేష్ పరువు తీస్తున్న టీడీపీ లీడర్స్..! ఎలివేషన్ ఇవ్వబోయి కామెడీ చేశారు..!

Off The Record Nara Lokesh

Off The Record Nara Lokesh

Off The Record: గాల్లో ఎగరాల్సిన ఇండిగో విమానం…ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయి…చివరకు ఏపీ మంత్రి లోకేష్ గాలి తీసేసే వరకు వచ్చిందా అంటే… ఎస్‌ అన్నదే ఈ పరిణామాలను గమనిస్తున్నవారి సమాధానం. తన ప్రమేయం లేకుండానే ఈ ఎపిసోడ్‌లోకి లాగి… అనవసరంగా ట్రోల్‌ చేయిస్తున్న పార్టీ నాయకుల్ని చూసి చివరికి లోకేష్‌ కూడా…. అరె ఎవుర్రా మీరంతా… అన్న సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటున్నారట. టీడీపీ అభిమానులు కూడా… ఎక్కడ తయారయ్యార్రా వీళ్ళంతా….. అనవసరమైన ఇష్యూలోకి ఆయన్ని లాగి ఇరికించేశారంటూ తలబాదుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన పాటికి ఆయనేదో… పెట్టుబడుల పర్యటన కోసం అమెరికా వెళితే… అనవసరమైన ఎలివేషన్స్‌ ఇవ్వబోయి పార్టీ నాయకులు కామెడీ చేసేశారంటూ కేడర్‌ కూడా ఫీలవుతున్నట్టు సమాచారం. వాస్తవానికి ఒక రాష్ట్ర మంత్రికి, పౌర విమానయాన శాఖలోని వ్యవహారాలకు ఎలాంటి సంబంధం ఉండదు. అదంతా సెంట్రల్‌ సబ్జెక్ట్‌. ఆ సంగతి తెలియదో… లేక తెలిసి కూడా మన నాయకుడిని బాగా ఎత్తుదాం… పనిలో పనిగా ఆయన దగ్గర మనం కూడా మార్కులు కొట్టేద్దామనుకున్నారోగానీ ఇండిగో సంక్షోభానికి సంబంధించిన టీవీ డిబేట్స్‌లో లోకేష్‌ ప్రస్తావన తీసుకొచ్చి అడ్డంగా ఇరికించేశారు పార్టీ నాయకులు. దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంక్షోభ పరిష్కారానికి లోకేష్‌ ప్రయత్నిస్తున్నారని, సిచ్యుయేషన్‌ని మానిటర్‌ చేస్తున్నారని, అందుకోసం వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారంటూ.. నేషనల్ మీడియా టీవీ డిబేట్‌లో ఎక్స్‌ట్రా బిల్డప్‌ ఇవ్వబోయారు టీడీపీ నేత ఒకరు.

కానీ… అక్కడే బొమ్మ బోర్లా పడింది. పౌర విమానయానానికి, లోకేష్‌కు సంబంధం ఏంటని రివర్స్‌లో ప్రశ్నిస్తే…. నో ఆన్సర్‌. అంతా బెబ్బే…మెమ్మే. పార్టీ నాయకుడు చేసిన ఆ ఓవర్‌ యాక్షన్‌తో తనకు సంబంధం లేకుండానే… విపరీతమైన ట్రోలింగ్‌లోకి వచ్చేశారు లోకేష్‌. ఇలాంటి అవకాశం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని కాచుక్కూర్చున్న రాజకీయ ప్రత్యర్థులు ఓ ఆటాడేసుకుంటున్నారు. దీంతో… టీడీపీలో కూడా తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయట. ఆయన పాటికి ఆయనేదో అమెరికా టూర్‌లో ఉంటే… అనవసరంగా లోకేష్ పేరు చెప్పి ఇరికించారు. యాడ దొరికార్రా బాబూ వీళ్ళంతా. ఎలివేషన్స్‌ ఇవ్వడానికి ఈ సబ్జెక్టే దొరికిందా? ఇండిగో సంక్షోభంలో అసలే మన పార్టీకే చెందిన కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరవుతుంటే… ఉన్న గోల చాలదన్నట్టు ఈ రొంపిలోకి లోకేష్‌ను లాగి ఆయన పరువును కూడా రోడ్డు మీదికి తెచ్చారని టీడీపీ కేడర్‌ తల కొట్టుకుంటోందట. సంబంధంలేని సబ్జెక్టులో తలదూర్చి లోకేష్ లాంటి స్ట్రేచర్ ఉన్న వ్యక్తి ని ఇరికించారన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి పార్టీ సర్కిల్స్‌లో. అసలే.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో సంబంధం లేని లోకేష్‌ను ఇరికించి మొత్తంగా దేశ వ్యాప్తంగా టీడీపీ పరువు తీశారు మనోళ్ళు అంటూ కేడర్‌ గుసగుసలాడుకుంటోంది. అయితే… లోకేష్‌ విషయంలో స్వామి భక్తి చాటుకోబోయి ఆయన్ని అభాసుపాలు చేయడం ఇదే మొదటిసారి కాదు.

గతంలో కూడా కొన్ని మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలని ఇలాగే డిమాండ్ చేసి ఇరికించేశారు. సీఎం చంద్రబాబు సభలో ఉండగానే కడప మీటింగ్‌లో ఇలా లోకేష్ డిప్యూటీ సీఎం నినాదాలు చేయడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో వేదిక మీద కూడా చంద్రబాబు ఉండగానే కేబినెట్‌ మంత్రి ఒకరు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్నారు. అప్పుడు కూడా అదో పెద్ద ఇష్యూ అయింది. ఈ విధంగా పార్టీ నాయకులు కొందరు తమ యువనేతకు ఎలివేషన్స్‌ ఇవ్వబోయి చివరికి ఆయన్నే ఇరికిస్తున్నారన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. తమ నేతను పైకెత్తాలన్నా… అలా చేసి ఆయన దృష్టిలో పడాలన్నా… అందుకు మార్గాలు చాలానే ఉన్నాయని, ఈ రకంగా అడ్డంగా బుక్‌ చేసి పరువు తీయడం సరికాదని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఎవరో జ్వాలను రగిలిస్తారు… దానికి వేరెవరో బలి అవుతారన్నట్టు….ఇండిగో వ్యవహారం చివరికి దేశ వ్యాప్తంగా తిరిగి తిరిగి లోకేష్‌ ట్రోల్‌ అవడానికి కారణమైందన్నది పార్టీ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. ఈ దెబ్బతో… అయ్యా… బాబూ… టీవీ డిబేట్స్‌కు వెళ్ళే సార్లూ…. ఇకనుంచైనా కాస్త వెనకా ముందూ అలోచించి మాట్లాడండయ్యా…. మీరు అనవసరపు ఎలివేషన్స్‌ ఇవ్వకున్నా ఫర్లేదు గానీ…. ఆభాసుపాలు మాత్రం చేయొద్దని మొత్తుకుంటోంది టీడీపీ కేడర్‌.

Exit mobile version