Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన టీడీపీ నేతలకు నిరాశే ఎదురైంది. ఐతే…పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామని అధిష్టానం కొందరికి హామీలు ఇచ్చిందట. ఆ హామీలు నెరవేరకపోవటంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవుల మాటమోగానీ ఉన్న పార్టీ పదవులు కూడా ఉడిపోతున్నాయని భయపడుతున్నారట. ఉమ్మడి కర్నూలు జిల్లా…రెండు దశాబ్దాలకుపైగా ఎన్నికల్లో టీడీపీకి ఎప్పుడూ నిరాశే ఎదురైంది. అత్యధిక స్థానాలను ఆ పార్టీ కోల్పోయింది. 2019ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఇలా అన్ని ఎన్నికల్లోనూ ఘోర పరాజయమే టీడీపీకి ఎదురైంది. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్వితీయ విజయం సాధించింది. 11 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు దక్కించుకుంది. కొంతమంది నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఎలాగూ రాలేదు. ఐతే…పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతృప్తి మిగిలింది. తమకు ఏవో పదవులు వస్తాయని ఆశించారట ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు. పార్టీ అధికారంలో ఉన్నా తమకు మంచి రోజులు వచ్చాయని సంతోషపడే పరిస్థితి కూడా లేదట.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని అసెంబ్లీ సీటును ఆయా నియోజకవర్గ ఇంఛార్జీలు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, నంద్యాల సీటు భూమా బ్రహ్మానంద రెడ్డి, మంత్రాలయం సీటు తిక్కారెడ్డి, ఆదోని సీటు కోట్ల సుజాత ఆశించారు. నంద్యాల పార్లమెంటు సీటును శివానంద రెడ్డి ఆశించారు. సామాజిక సమీకరణాలు, ఇతర కారణాలతో వారికి సీటు దక్కలేదు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో కోట్ల సుజాతకు అవకాశం లేకుండా పోయింది. మీనాక్షినాయుడు, బ్రహ్మానంద రెడ్డి, తిక్కారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. తిక్కారెడ్డికి అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతోంది. అయితే ఎంపీ, ఎమ్మెల్యే ఆశావహులకు పదవులు ఏవీ దక్కలేదు. పార్టీలోనూ సరైన స్థానం దక్కలేదని తెగ ఫీలవుతున్నారట.
ఎమ్మెల్యే టికెట్లు ఆశించి అవీ దక్కక, పార్టీ అధికారంలోకి వచ్చినా అధికార పదవులు దక్కక ఉమ్మడి కర్నూలు జిల్లాలో కీలక నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే టాక్ నడుస్తోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి అసంతృప్తితో టీడీపీలో అంటి ముట్టనట్టు ఉంటున్నారట. ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు టీడీపీ ఇంఛార్జిగా వున్నా తన మాట చెల్లుబాటు కావడం లేదని మథనపడుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక దశలో మీనాక్షి నాయుడు ఇంట్లోనే ఆయన వర్గీయులు టీడీపీ పరిశీలకున్ని నిలదీశారట. తిక్కారెడ్డి మంత్రాలయం టికెట్ ఆశిస్తే టికెట్ ఇవ్వలేకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. రెండేళ్లలోపే ఆ పదవి కూడా ఊడిపోయింది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, జిల్లా అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించారనేది తిక్కారెడ్డి వర్గీయుల మాట. ఉన్న పదవి ఊడిపోయి కొత్తపదవీ రాకపోవడంపై తిక్కారెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. గతంలో నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జిగా పనిచేసిన మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డి కూడా పదవి ఆశించినా…ఇప్పటి వరకు దక్కలేదు. ఇప్పటికే పదవుల్లో ఉన్న నేతలు సరే….మా సంగతేంటి అంటూ అడగలేక, అలాగని తమ వర్గీయులకు సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారట ఇంకొందరు కీలకనేతలు.
