Site icon NTV Telugu

Off The Record: ఎమ్మెల్యే గుమ్మనూరు తీరుపై తీవ్ర చర్చలు.. నేను చెప్పినట్టే అంతా జరగాలని శాసిస్తున్నారా?

Otr Mla Gummanur Jayaram

Otr Mla Gummanur Jayaram

Off The Record: కొందరు అనుకోకుండా వివాదాల్లో ఇరుక్కుంటారు. మరికొందరు ఏం చేసినా కాంట్రవర్శీనే అవుతుంది. ఇంకొందరైతే… ఎవడేమనుకుంటే నాకేంటి, చెయ్యాలనుకున్నది చేసేస్తా… వివాదమా కాదా అన్నది డోంట్‌ కేర్‌ అంటారు. ఈ మూడో కేటగిరీకి చెందిన వ్యక్తే … గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన జయరాం.. అప్పట్లోనే చాలా వివాదాలలో ఇరుక్కున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేకు బదులు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పడంతో.. నాకు ఆ టికెట్ వద్దూ.. మీ పార్టీ వద్దు అంటూ… టీడీపీలోకి జంప్ అయిపోయారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన గుమ్మనూరుకు అనంతపురం జిల్లాలోని గుంతకల్లు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీనిపై లోకల్‌గా వ్యతిరేకత వ్యక్తమైనా పట్టించుకోలేదు. ఇక గెలిచాక ఆయన లాంగ్వేజ్‌, బాడీ లాంగ్వేజ్‌ పూర్తిగా మారిపోయానని చెబుతారు గుంతకల్లు టీడీపీ నాయకులు. పక్క జిల్లా నుంచి వచ్చి 30రోజుల్లో గెలిచాను. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యమని ఓపెన్‌గా చెప్పేస్తున్నారట.

వైసీపీలో ఉన్నప్పుడే కేరాఫ్‌ కాంట్రవర్సీగా ఉండే జయరామ్‌ ఇప్పుడు అంతకు మించి అన్నట్టు మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు. రేపు స్థానిక ఎన్నికల్లో ఎవరైనా తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే మీకథ చూస్తానంటూ ఇటీవల వార్నింగ్‌ ఇచ్చి కొత్త వివాదం రేపారాయన. అదొక్కటే కాకుండా… ఈ మధ్య కాలంలో ఆయన గుంతకల్లులో వన్‌మేన్‌ షో చేస్తున్నారన్నది లోకల్‌ వాయిస్‌. ఇక్కడ ప్రోటోకాల్స్ పాటించరు.. రూల్స్ అస్సలే ఉండవు.. నేనేం చెబితే అది జరగాల్సిందేనంటున్నారట. ప్రోటోకాల్ పాటించాలి, వేరే వాళ్ళకి మర్యాద ఇవ్వాలంటే మనతో కాదని అంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు, ఎమ్మెల్యేకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం. పైగా గతంలో ఎలాంటి గొడవలు లేవు. కానీ ఇప్పుడు వీరి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. ఆ మాటకొస్తే.. గుమ్మనూరు జయరాంకు కూడా ఇదే క్యాస్ట్ ఈక్వేషన్ కలిసొచ్చిందని చెప్పాలి. ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కాదని కర్నూలు జిల్లాకు చెందిన జయరాంకి టికెట్ ఇచ్చారు. నాన్ లోకల్ అయినప్పటికీ క్యాస్ట్ అండ్‌ క్యాష్ బలం కలిసి రావడం, టీడీపీ వేవ్‌ ఆయనకు ప్లస్‌ అయ్యాయన్న విశ్లేషణలున్నాయి. ఇదే ఫార్ములాను తాను కూడా ఇక్కడే అప్లయ్‌ చేయాలని ఎంపీ భావిస్తుండటంతో… ఇద్దరి మధ్య అగాధం పెరిగిందని చెప్పుకుంటున్నారు. ఎంపీ లక్ష్మీనారాయణ గుంతకల్లుపై ఫోకస్ చేయడానికి మరో బలమైన కారణం కూడా ఉందన్న చర్చ నడుస్తోంది. ఎంపీ సమీప బంధువు ఒకరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 7 కోట్ల విలువైన పైపులైన్ పనుల్ని టెండరు ద్వారా దక్కించుకున్నారు. కానీ… ఎమ్మెల్యే గుమ్మనూరు ఆ కాంట్రాక్టర్‌కు ఫోన్‌చేసి నా నియోజకవర్గంలో పనుల్ని నాకే అప్పగించాలి, లేదంటే… 10 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ప్రచారం జరిగి…. అదో పెద్ద సంచలనమైంది. ఇలా ఉండగా… ధర్మవరం రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ దగ్గర అండర్ బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

ఆయనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ భవాని, ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, తహసీల్దార్ రమాదేవి హాజరయ్యారు. కానీ…. దాదాపు 10 కోట్ల విలువైన ఈ రైల్వే పనుల భూమి పూజకు ఏ ఒక్క రైల్వే ఆఫీసర్‌ అటెండ్‌ కాలేదు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం గనుక ప్రొటోకాల్ ప్రకారం అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణను ఆహ్వానించాలి. కానీ ఆయనకు ఇన్విటేషన్‌ లేదట. ఆ లెక్క ప్రకారమే రైల్వే ఆఫీసర్స్‌ కూడా వెళ్ళి ఉండకపోవచ్చని అంటున్నారు. వాస్తవానికి ధర్మవరం అండర్ బ్రిడ్జి పనులకు 2024 మార్చి 16న అప్పటి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, రైల్వే అధికారులు కలిసి భూమి పూజ చేశారు. పనులు ప్రారంభించే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఆర్‌యూబీ పనులకు తాత్కాలిక బ్రేక్ పడింది. దీంతో… ఎప్పుడో నిధులు మంజూరై, టెండర్ల ప్రక్రియ పూర్తయి, భూమి పూజ కూడా జరిగిన పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మళ్లీ భూమి పూజ చేశారని అటు వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ రకంగా…. ఏదో ఒక వివాదంతో… ఎమ్మెల్యే గుమ్మనూరు తరచూ వివాదాస్పదం అవుతున్నారు. టీడీపీ పెద్దలు జోక్యం చేసుకోకపోతే… పార్టీకే ఎక్కువ డ్యామేజ్‌ జరుగుతుందని పార్టీ కేడర్‌ గుసగుసలాడుకుంటోంది.

Exit mobile version