Off The Record: గన్నవరం టిడిపి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మధ్య వ్యవహారం టీడీపీకే తలనొప్పిగా మారుతోందట. వ్యవహారం చూస్తుంటే… వీళ్ళిద్దరూ అసలు ఒకే పార్టీలో ఉన్నారా అన్న అనుమానాలు వస్తున్నాయట. 2019 ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు విజయ డైరీ చైర్మన్‌గా పగ్గాలు తీసుకున్నారు చలసాని ఆంజనేయులు. అప్పుడు యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో ఉన్నారు. కానీ…నాడు టీడీపీ తరపున గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టడంతో యార్లగడ్డకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ పరిణామక్రమంలో…. 2024 ఎన్నికలకు ఏడాది ముందు వెంకటరావు వైసీపీని వీడి టిడిపిలో చేరి కూటమి అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించారు. గెలిచిన వెంటనే…. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వాళ్లపై ఫోకస్ పెట్టారు అనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట. అదే ఊపులో… విజయ డైరీ చైర్మన్‌ను కూడా టార్గెట్ చేయటం చర్చగా మారింది. చలసాని ఆంజనేయులు టిడిపిలో సీనియర్ లీడర్. అలాంటి సొంత పార్టీ నేత మీదికే ఎమ్మెల్యే అస్త్రాలు ఎక్కుపెట్టడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశం అయింది.
చలసాని ఆంజనేయులు విజయ డైరీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ తరపున పదవి పొందారని, కానీ…ఆ ఐదేళ్ళలో పార్టీ కోసం పనిచేయకుండా… తనది పాల పార్టీఅని చెప్పుకునేవారన్నది యార్లగడ్డ విమర్శ. అలా చెప్పుకుంటూ… ఐదేళ్ళు వైసీపీ వారికి అనుకూలంగా పనిచేశారని, కాబట్టే ఆయన పదవి కొనసాగిందన్నది ఎమ్మెల్యే వెంకట్రావు ప్రధాన ఆరోపణ. అలాగే అప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీకి తెరవెనుక సహకరించారని, వంశీ అనుచరులకు పెద్ద ఎత్తున మిల్క్‌బూత్‌లు కేటాయించారన్నది యార్లగడ్డ ఇంకో ఆరోపణ. ఈ క్రమంలోనే.. వీరవల్లి దగ్గర నిర్మించిన కొత్త విజయ డైరీ ఫ్యాక్టరీలో భారీ కుంభకోణం జరిగిందని, అక్రమాలపై విచారణ చేయాలని గెలిచిన వెంటనే ఫిర్యాదులు చేశారు యార్లగడ్డ. అలాగే…చలసాని ఆంజనేయులు టార్గెట్‌గా… ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో కనిపించలేదని, చంద్రబాబు పర్యటన సందర్భంగా కూడా రాలేదని విమర్శించారు. డైరీలో ముగ్గురు డైరెక్టర్లను ఇష్టా రీతిన నియమించారని, ఆ నియామకాలను రద్దు చేయాలన్నది యార్లగడ్డ ఇంకో డిమాండ్. విజయ డైరీ అక్రమాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించారాయన. దీంతో చలసానిని గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
టీడీపీ సీనియర్ లీడర్‌గా ఏళ్ళ తరబడి ఉన్నారు చలసాని. పార్టీలో అందరితో పరిచయాలున్నాయి. వివాదాస్పదుడనే రిమార్క్‌లు ఏవీ లేవు. యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణల కారణంగానే…. ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. ఈ పరిస్థితుల్లో…చలసాని రాజీనామాకు సిద్ధమవడంతో… అధిష్టానం నుంచి ఆగాలని సంకేతాలు వచ్చాయట. ఎమ్మెల్యే ఆరోపణలకు ఆంజనేయులు వర్గం కౌంటర్ ఇంకోలా ఉంది. ఐదేళ్ళ వైసిపి ప్రభుత్వం హయాంలో కూడా…ఏటా ముగ్గురు చొప్పున 15 మంది టిడిపికి చెందిన వారిని డైరెక్టర్స్‌గా ఎంపిక చేశామని, కావాలంటే చెక్ చేసుకోమని సవాల్ విసురుతున్నారు. 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫ్యాక్టరీ ప్రారంభానికి కూడా అప్పటి సీఎం జగన్‌ను గానీ, స్థానిక ఎమ్మెల్యే వంశీని గాని పిలవలేదని గుర్తు చేస్తోంది చలసాని వర్గం. జిల్లాలో ఎవరికీ లేని సమస్య యార్లగడ్డకే ఎందుకని, తనమీద చేస్తున్న ఆరోపణలకు డైరెక్ట్‌గా స్పందించాల్సిన అవసరం లేదని అంటున్నారు చలసాని. మొత్తంగా ఇద్దరు నేతల వివాదం గన్నవరం టీడీపీలో కలకలంరేపుతోంది.
