Site icon NTV Telugu

Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

Otr Parthasarathy

Otr Parthasarathy

Off The Record: కొలుసు పార్థసారథి…ఉమ్మడి కృష్ణాజిల్లాలో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున మొదటిసారి గెలిచిన ఆయన తొలి మంత్రివర్గంలోనే క్యాబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. టిడిపిలో ఎన్నో ఏళ్లుగా సీనియర్లుగా ఉన్న నేతలకు కూడా దక్కని మంత్రి పదవి బీసీ కోటాలో ఆయనకి తొలి దఫాలోనే దక్కటం, పార్టీలోనే కొందరు అసహనంతో రగిలిపోయారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరిగింది. అగ్నికి ఆజ్యంపోసినట్టుగా ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసిపి నేతలతో కలిసి విగ్రహాల ప్రారంభంలో పాల్గొనడం, పార్థసారథికి లేనిపోని కష్టాలు తెచ్చింది. దీంతో టిడిపి క్యాడర్ సోషల్ మీడియాలో సారథిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పి ఆ తలనొప్పి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత చింతమనేని చేసిన వ్యాఖ్యలపై కూడా సారధి గట్టి కౌంటర్ ఇవ్వడం కూడా అప్పట్లో హాట్‌ టాపికైంది. ఇవన్నీ ఒకెత్తయితే, మంత్రినీ సొంత నియోజకవర్గ నుంచే కొందరు నేతలు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ వాడివేడిగా సాగుతోంది.

సారధి గతంలో పెనమలూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు కాంగ్రెస్ తరపున మంత్రిగా కూడా పని చేశారు. అయితే టిడిపిలో మాత్రం ఇదే తొలిసారి గెలుపు. అది కూడా పెనమలూరు నియోజకవర్గం వదిలి, నూజివీడు నియోజకవర్గం వెళ్లి మరీ ఆయన గెలిచారు. బీసీ కోటాలో మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన రాకను మొదటి నుంచి అక్కడ రెండుసార్లు టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా ఆయన సారధి రాకను బహిరంగనే విమర్శలు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. అయితే అధిష్టానం మాట్లాడ్డంతో మెత్తబడిన ఆయన, ప్రస్తుతం టిడిపిలోనే కొనసాగుతున్నారు. కానీ నియోజకవర్గంలో సారథి అండ్ టీం ఆయన అనుచరుల వ్యవహారాలపై నిత్యం అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు అనేది లోకల్ టాక్. నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు ఆయన నేరుగా ఫిర్యాదులు కూడా చేశారు. ఇటీవల నియోజకవర్గంలో భారీగా పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యవహారంలో కూడా ఆయనే ఫిర్యాదు చేశాడన్న అనుమానాలు కూడా మంత్రి అనుచరులు చేస్తున్నారట. ఈ పేకాట వ్యవహారంలో మంత్రికి సంబంధం లేదని చెబుతున్నా…నియోజకవర్గంలో పట్టుబడటం వల్ల మంత్రికి అప్రతిష్ట తప్పలేదని నూజివీడులో మాట్లాడుకుంటున్నారన్న డిస్కషన్ సాగుతోంది.

మరోవైపు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంలో కొందరు పార్టీ నేతలకు, మంత్రి సారథి వర్గానికి పొసగటం లేదన్నది లోకల్‌గా సాగుతున్న మరో చర్చ. ఇటీవల నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో పెనమలూరు నేతలు చక్రం తిప్పుతున్న వ్యవహారంలో స్థానిక కమ్మ నేతలు అసంతృప్తిగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో కొందరు స్థానిక పార్టీ నేతలకు మంత్రి సారథి అనుచరులకు మధ్య గ్యాప్ వచ్చిందని, అదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ప్రయోజనం లేదని ఫీలవుతున్నారట. స్థలాల వివాదాల్లో మంత్రి అనుచరులు జోక్యం చేసుకుంటే, అధిష్టానం దగ్గరకి తీసుకెళ్లే పనిలో అసమ్మతి నేతలు బిజీగా ఉన్నారనేది ఇంకో టాక్. మరోవైపు స్థానికుడైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుతో కూడా కొందరు స్థానిక టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారనేది పొలిటికల్ వర్గాల మాట. దీంతో సొంత పార్టీలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేతలపై మంత్రి అనుచరులు ఆరా తీస్తున్నారని చర్చ జరుగుతోంది.

Exit mobile version