Off The Record: కావలిలో ఫ్యాన్-సైకిల్ దోస్తీ..? భూదందాల వెనుక అసలు కథ ఏంటి?

  • వైసీపీ హయాంలో కావలిలో ప్రభుత్వ భూముల్లో లేఔట్స్‌..
  • మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అనుచరుల మీద ఆరోపణలు..
  • విజిలెన్స్‌ దర్యాప్తునకు కూటమి ప్రభుత్వం ఆదేశం..
  • దర్యాప్తు అధికారుల మీద దాడులతో కలకలం..
  • కలెక్టర్‌ ఆదేశించేదాకా సహకరించని రెవెన్యూ అధికారులు..
  • 78 లేఔట్స్‌లో అక్రమాలు జరిగినట్టు ప్రాధమిక నిర్ధారణ..
  • ప్రభుత్వ భూములకు దొంగ పట్టాలు, విలువ రూ.100కోట్లకు పైనే..
  • దర్యాప్తును అడ్డుకోవాలంటూ టీడీపీ లీడర్స్‌తో చీకటి ఒప్పందాలు?..
  • వివరాలు చెప్పవద్దని డాక్యుమెంట్‌ రైటర్స్‌ని కూడా బెదిరిస్తున్నారా?..
  • టీడీపీ ద్వితీయ శ్రేణిని రెచ్చగొట్టి అధికారుల మీదికి పంపుతున్నారా?..
  • నియోజకవర్గ టీడీపీ పెద్దలు ఎందుకు నోరు తెరవడం లేదు?..
Otr Kavali Land Scam

Otr Kavali Land Scam

Off The Record: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావలి నియోజకవర్గంలో రకరకాల భూ దందాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఔట్స్‌ వేశారు. అప్పటి అధికారులను మేనేజ్ చేసుకుని మరికొందరు ప్రభుత్వ, కాలువ భూములను పట్టా భూములుగా చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దానికి సంబంధించి అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రధాన అనుచరుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి మీదే ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. ఆయనతో పాటు మరో నలుగురు వేసిన లేఔట్లపై కూడా ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది. అధికారులు లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేస్తుండటంతో అక్రమార్కులకు వణుకు పుడుతోందట. ఆ క్రమంలోనే… వాళ్ళు సరికొత్త ఆలోచనలకు పదునుపెట్టే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. గత ఎన్నికల్లో కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలిచాక వైసీపీ హయాంలో వేసిన అక్రమ లేఔట్లపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే ఇటీవల ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అది తుది దశకు చేరుకుందనుకుంటున్న సమయంలో దర్యాప్తు అధికారుల మీద దౌర్జన్యాలు జరగడం కలరలం రేపుతోంది. వీటి వెనక స్థానిక టిడిపి నేతలు ఉన్నారన్న మాటలతో ఇంకా షాకవుతున్నారట స్థానికులు. అసలు అక్రమ లేఔట్లపై దర్యాప్తు ప్రారంభించిన విజిలెన్స్ అధికారులకు మొదట రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ సహకరించలేదట. రికార్డులు ఇచ్చేందుకు కూడా కింది స్థాయి అధికారులు ఆసక్తి చూపలేదని తెలిసింది.

చివరికి కలెక్టర్ ఆదేశాలతో రికార్డులు తెప్పించుకున్న విజిలెన్స్ అధికారులు సుమారు 78 లేఅవుట్లను పరిశీలించారు. ఇందులో చాలావరకు అక్రమాలు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో బయటపడిందని అంటున్నారు. ముగ్గురు వ్యక్తులు అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుమారు 300 ఎకరాల్లో అక్రమ లేఔట్లు వేసినట్టు ప్రాథమిక అంచనాకి వచ్చారట. ప్రభుత్వ భూములకు దొంగ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు కూడా చేశారని.. వాటి విలువ ఇప్పుడు 100 కోట్లకు పైనే ఉంటుందని దర్యాప్తు అధికారులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో.. దీని నుంచి తప్పించుకునేందుకు అప్పట్లో అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళంతా ఇప్పుడు టిడిపి ద్వితీయ శ్రేణి నేతలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారన్న ప్రచారం కావలిలో కాక రేపుతోంది. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల బండారం విజిలెన్స్ ఎంక్వయిరీలో బయటపడుతూ ఉండడంతో …వాళ్ళంతా ఉలిక్కిపడుతున్నారట. ఎలాగైనా దర్యాప్తును అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ నేతలకు టచ్ లోకి వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. ఆ టచ్చింగ్స్ కారణంగానే…. కావలి ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ రామకృష్ణ… విజిలెన్స్ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని సొంత పార్టీలోనే మాట్లాడుకుంటున్నారు. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితంగా ఉన్న కీలక నేత ఒకరు.. ఇప్పుడు టిడిపి నేతలకు వెనకుండి గైడ్‌ చేస్తున్నారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే అక్రమ లేఔట్లకు సంబంధించిన సూత్రధారులను గుర్తించిన విజిలెన్స్ అధికారులు.. వారికి సహకరించిన రియలెస్టేట్‌ బ్రోకర్స్‌, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు సేకరిస్తున్నారట. దొరికిన వాళ్ళ నుంచి స్టేట్మెంట్స్‌ రికార్డు చేసే కార్యక్రమం కూడా నడుస్తోందని అంటున్నారు.

×
×
Ad

అయితే విజిలెన్స్ విచారణకు సహకరించొద్దంటూ బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్స్‌ను కూడా సదరు సదరు కీలక నేతే బెదిరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దర్యాప్తు పూర్తి చేసి నెలాఖరులోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులు గట్టిగా పనిచేస్తుంటే.. అది పూర్తయితే తమపై క్రిమినల్ కేసులు పెట్టే ప్రమాదం ఉందని అక్రమార్కులు భయపడుతున్నారట. అందుకే… ఎంక్వయిరీని ఆలస్యం చేసేందుకు.. స్థానిక ద్వితీయ శ్రేణి టిడిపి నేతలను రెచ్చగొట్టి అధికారుల మీదకు పంపుతున్నారన్నది లోకల్‌ టాక్‌. మా లేఔట్స్ మీద విచారణ చేసే అధికారం ఎవరిచ్చారంటూ విజిలెన్స్ అధికారులను బెదిరించడం కూడా టిడిపి ద్వితీయ శ్రేణి నేతల ప్లాన్‌లో భాగమేనని, అక్రమార్కులే తెరవెనుక ఉండి వాళ్లని పురమాయిస్తున్నారన్న ప్రచారం కావలిలో జరుగుతోంది. టీడీపీ నాయకులు దాడి చేసిన వ్యవహారాన్ని ఇప్పటికే విజిలెన్స్ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. సదరు నేతపై కేసు నమోదు చేసినప్పటికీ దీనికి సంబంధించి అటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గానీ.. జిల్లా అధ్యక్షులు, అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గాని నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని సొంత పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఇన్ని ఆటంకాల మధ్య అక్రమ లేఔట్స్‌పై విజిలెన్స్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా..? అక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెడతారా అనేది ఉత్కంఠ గా మారింది.