Site icon NTV Telugu

Off The Record: ఆ ఎంపీ.. ఎమ్మెల్యే పదవి కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేని హడలెత్తిస్తున్నారా..?

Guntakal

Guntakal

Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గ రాజకీయం మిగతా వాటితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. వేరే ఏ సెగ్మెంట్‌తో చూసుకున్నా… ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటుంది. కేవలం ఒకే మండలం, రెండు మున్సిపాలిటీలు ఉన్నందున పెద్దగా పొలిటికల్‌ హడావిడి ఉండదు. గతంలోని ఎమ్మెల్యేలు కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున జితేంద్ర గౌడ్, 2019లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచినా… ఇద్దరూ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు. వాళ్ళ మీద పెద్దగా ఆరోపణలు కూడా ఏం లేవు. కానీ…. గత 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున గుమ్మనూరు జయరాం గెలిచారు. అంతకు ముందు వైసీపీలో తీవ్ర వివాదాస్పదమైన మాజీ మంత్రిని పార్టీలోకి తీసుకుని బరిలో నిలిపింది తెలుగుదేశం. కూటమి హవాకు బీసీ ఈక్వేషన్‌ తోడై గుంతకల్‌లో పాగా వేశారు గుమ్మనూరు. అయితే… ఇప్పుడు ఆయనకు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు మధ్య కోల్డ్‌వార్‌ తీవ్రంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో అంబికా తన నియోజకవర్గంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారన్నది గుమ్మనూరు అభియోగం. అందుకే…. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7నియోజకవర్గాలుంటే.. నా దగ్గరే ఎందుకు వేలు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే గుమ్మనూరు ఫైరై పోతున్నట్టు తెలుస్తోంది. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఎంపీ చెక్‌పెట్టే ప్లాన్స్‌లో సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఇటు రాజకీయవర్గాల్లో కూడా ఉన్నట్టుండి అంబికా లక్ష్మీనారాయణ గుంతకల్లు వైపు ఎందుకు చూస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. ఎంపీ ఇటీవల ఎక్కువగా ఇక్కడ పర్యటిస్తూ…. అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు పర్సనల్‌ టూర్స్‌ కూడా వేసేస్తున్నారట. గుంతకల్ , గుత్తి , పామిడి ప్రాంతాల్లో తెగ తిరిగేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే…గుంతకల్లు మీద ఆయన మనసుపడటానికి ప్రత్యేక కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగాలనుకుంటున్న ఎంపీ… అందుకు గుంతకల్ నియోజకవర్గం అయితే బెటర్ అని ఫీలవుతున్నారట. గుంతకల్, గుత్తి ప్రాంతాల్లో తన సామాజిక వర్గం అధికంగా ఉండడం, ఇక్కడే బంధుగణం కూడా ఉండటం కలిసొస్తాయని లెక్కలేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

చాలామంది ఎమ్మెల్యేలకు ఉన్నట్టు తనకు కూడా ఒక కంచుకోట ఉండాలని భావిస్తున్న లక్ష్మీనారాయణ అది గుంతకల్ అయితే మరింత బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. తన సొంత ప్రాంతం హిందూపురం అయినా…. అక్కడ నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండటంతో పాగా వేయడం సాధ్యపడదు కాబట్టి… ఫోకస్‌ మొత్తం గుంతకల్‌ మీదికి షిఫ్ట్‌ చేసినట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్కెచ్ ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది? సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ ఎలా కౌంటర్‌ చేసుకుంటారన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్‌ పాయింట్‌.

Exit mobile version