Site icon NTV Telugu

టీ కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ రచ్చ రాహుల్ టూర్‌ కేంద్రంగా కొత్త కయ్యం

A Bida Edi Ma Adda

A Bida Edi Ma Adda

చెప్పకుండా రేవంత్‌ రావడంపై నల్లగొండ జిల్లా నేతల అభ్యంతరం?కాంగ్రెస్ అంటేనే నేతల మధ్య కయ్యలా మారి పార్టీగా మారిపోయింది. అది జిల్లాస్థాయి సమావేశమైనా.. తాజాగా రాహుల్ గాంధీ సభ సన్నాహక సమావేశమైనా పంచాయితీ కామన్. మీడియా ముందే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్సే అందుకు అద్దం పడుతున్నాయి. సీఎల్పీలో మీడియా సమావేశం కంటే ముందే.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ ఇంట్లో భేటీలు జరిగాయి. కొందరు ముఖ్య నాయకులు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలపై చర్చ జరిగినట్టు సమాచారం. రాహుల్ గాంధీ సభ సన్నాహక సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఈ నెల 27న వెళ్లాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితం గాంధీభవన్‌లో అన్ని జిల్లాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తమ్ సమావేశానికి వచ్చి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి మీటింగ్‌కి రానే లేదు. తమతో చర్చించకుండా రేవంత్ జిల్లాకు రావడం ఏంటి? పీసీసీ చీఫ్ అవసరం లేదని చర్చ జరిగినట్టు సమాచారం. ఇదే అంశాన్ని పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి ఫోన్ చేసి చెప్పారట సమావేశంలో ఉన్న ఓ ఎంపీ. మీరు..మేము ఇద్దరం కలిసి జనాన్ని రాహుల్‌ సభకు తీసుకురాలేమా? పీసీసీ చీఫ్ జిల్లాకు రావాల్సిన అవసరం ఏముంది అని అడిగారట. అయితే తేదీ చెప్పకుండా వస్తున్నారు అంటే.. మీకు అనుకూలమైన తేదీ చెప్పండి… కానీ పీసీసీ చీఫ్‌ను రావద్దంటే ఎలా అని పెద్దలు సూచించారట.

ఇంతలో స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటనే చేశారు. నల్గొండకు ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డిని వేశారు. ఆమె వద్దని.. రావొద్దని చెప్పేశారు వెంకటరెడ్డి. తామే జనాన్ని రప్పిస్తామని ప్రకటించారు వెంకటరెడ్డి. ఇటీవల రాహుల్ గాంధీతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో నాయకులకు పరిధి లేదు.. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలి అని స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ చీఫ్‌నే జిల్లాకు రానివ్వం.. పార్టీ నిర్ణయించిన ఇంఛార్జ్‌ను రావద్దని చెప్పడం ఏంటనే అంశాన్ని రేవంత్ టీం ఢిల్లీకి చేరవేసిందట. గీతారెడ్డిని రావొద్దని కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ పార్టీలో చర్చగా మారాయి. స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా పర్యటిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అలాంటిది పీసీసీ చీఫ్‌నే జిల్లాకు రావొద్దని చెప్పడం రచ్చ అవుతోంది. జిల్లాల పర్యటనకు కోమటిరెడ్డిని రావొద్దని అక్కడి నేతలు చెబితే సమస్య ఎటు వెళ్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌ అండ్‌ టీమ్‌ ఈ విషయాన్నే గట్టిగా చర్చలో పెడుతోందట. ఉత్తమ్ ఇంట్లో భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలోనూ .. ఏ ఒక్కరివల్ల రాహుల్ సభ సక్సెస్ కాదని వెంకటరెడ్డి కామెంట్‌ చేయడం విభేదాల అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యిందని చెవులు కొరుక్కుంటున్నారు.

రాహుల్‌గాంధీ పర్యటన సన్నాహక సమావేశంపైనే ప్రత్యేకంగా భేటీలు నిర్వహించడం కాంగ్రెస్‌లో చర్చగా మారింది. సీఎల్పీలో నాయకులంతా కలిసి మీడియా సమావేశం పెట్టడం.. అంతకు ముందు ఉత్తమ్ నివాసంలో జరిగిన చర్చ వివాదానికి దారితీస్తోందట. ప్రత్యేకంగా భేటీ కావడంలో తప్పు లేకపోయినా.. తమ జిల్లాకు మరేనాయకుడు రావొద్దని చెప్పడంపైనే చర్చ నడుస్తోంది. వీటిపై రేవంత్‌ అండ్‌ టీమ్‌ ఓపెన్‌గా ఎలా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే హైకమాండ్‌ వరకు వివాదం చేరుకోవడంతో.. అక్కడ నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే రాహుల్‌ సభ ముగిసేలోగా ఇంకెన్ని పంచాయితీలు కాంగ్రెస్‌లో చూడాల్సి వస్తుందో చూడాలి.

Exit mobile version