NTV Telugu Site icon

Narasapuram Politics: ఎవరికీ చెప్పు కోలేక…

తనకు తాను చెప్పుతో కొట్టుకుని ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. అక్కడితో ఆగకుండా సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై తీవ్ర కామెంట్స్‌ చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత లేదని కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్నా.. అది బయటపడిన సందర్భాలు లేవు. కానీ.. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలన్న ఉద్యమం.. ఆ విభేదాలను బయటపెట్టేసింది. ఇంతకీ సుబ్బారాయుడికి, ప్రసాదరాజుకు ఎక్కడ చెడింది?

గుర్తింపు లేదన్న ఆవేదనలో ‘చెప్పు’తో కొట్టేసుకున్నారా?
కొత్తపల్లి సుబ్బారాయుడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పొలిటికల్‌ అడ్డా. గతంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. మొత్తంగా ఐదుసార్లు శాసనసభ్యుడిగా అసెంబ్లీకి లోకి అడుగుపెట్టినా.. నిలకడలేని ఆయన రాజకీయ నిర్ణయాలే ఇమేజ్‌ను.. రాజకీయ భవిష్యత్‌ను దెబ్బతీశాయంటారు అనుచరులు. మంత్రిగా పనిచేసినప్పుడు జిల్లాను శాసించిన సుబ్బారాయుడికి ప్రస్తుతం సొంత ఇలాకా నరసాపురంలోనే ఎదురుగాలి వీస్తోంది. అధికారపార్టీ ఉన్నా.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో అస్సలు పడటం లేదు. ఆ ఆధిపత్యపోరు.. వైసీపీలో గుర్తించడం లేదన్న ఆవేదనే ఇప్పుడు చెప్పుతో కొట్టుకునే రూపంలో బయటపడిందనే చర్చ జరుగుతోంది.

వైసీపీలోనే ఉన్నా ఇద్దరూ దూరం
ఎమ్మెల్యే ప్రసాదరాజు.. కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నా.. గతంలో రాజకీయంగా ప్రత్యర్థులు. ఒకరిపై ఒకరు పోటీచేసి గెలిచిన వాళ్లే. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రసాదరాజు పోటీ చేస్తే.. ఆయనపై కొత్తపల్లి గెలిచారు. 2009కి వచ్చే సరికి సీన్‌ రివర్స్‌. కొత్తపల్లిపై ప్రసాదరాజు గెలిచారు. 2012 ఉపఎన్నికలో మాత్రం మళ్లీ కొత్తపల్లి పైచెయ్యి సాధించారు. ఇలా ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు సాగేది. ఆ పాత గొడవలు మర్చిపోలేదో ఏమో.. ఇప్పుడు వైసీపీలో ఇద్దరూ దూరం పాటిస్తున్నారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.

వైసీపీలో ఉన్నా పదవి, గుర్తింపు లేదని కొత్తపల్లి ఆవేదన?
టీడీపీలో ఓ వెలుగు వెలిగిన సుబ్బారాయుడు ఆ పార్టీని వీడి పీఆర్పీలోకి వెళ్లడం.. తర్వాత కాంగ్రెస్‌.. ఆపై వైసీపీ.. మళ్లీ టీడీపీలోకి జంప్‌ చేసి.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. 2014లో ఇదే నరసాపురం నుంచి సుబ్బారాయుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వెంటనే పాత వాసనలు గుర్తొచ్చి సైకిల్‌ ఎక్కేశారు. 2019కి వచ్చేసరికి మళ్లీ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోయారు సుబ్బారాయుడు. వైసీపీ నుంచి టికెట్‌ ఆశించినా.. అధిష్ఠానం ప్రసాదరాజుకే మొగ్గు చూపింది. ఆ ఎన్నికల్లో ప్రసాదరాజును గెలిపిస్తే.. అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తామని వైసీపీ పెద్దలు సుబ్బారాయుడుకు హామీ ఇచ్చినట్టుగా అనుచరులు చెబుతున్నారు. చూస్తుండగానే మూడేళ్లు గడిచిపోయింది కానీ.. పదవీ లేదు గుర్తింపు లేదని కొత్తపల్లి రగలిపోతున్నట్టు సమాచారం.

ఎమ్మెల్యేపై వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ‘చెప్పు’ తీశారా?
ఇదే సమయంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు తనను చిన్న చూపు చూస్తున్నారనే అభిప్రాయంలో ఉన్నారట సుబ్బారాయుడు. ఆ మధ్య నరసాపురం మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునే టైమ్‌లో తన అనుచరుడి పేరును కొత్తపల్లి ప్రతిపాదించారట. దానికి ఎమ్మెల్యే ససేమిరా అన్నట్టు సమాచారం. దాంతో ఇద్దరి మధ్యా విభేదాలు పీక్స్‌కు చేరుకున్నాయని అనుకుంటున్నారు. ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో ఏర్పాటు కానున్న పశ్చిమగోదావరి జిల్లాకు భీమవరాన్ని కేంద్రంగా ప్రతిపాదించింది ప్రభుత్వం. దీనిపై నరసాపురంలో నిరసనలు జరుగుతున్నాయి. కొత్తపల్లితోపాటు అన్ని పార్టీల నేతలు నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకత వ్యక్తం చేయడానికి ఆ వేదిక సరైందని అనుకున్నారో ఏమో.. జనం ముందే ఏకంగా చెప్పుతో కొట్టేసుకున్నారు కొత్తపల్లి. ఎమ్మెల్యేగా ప్రసాదరాజును గెలిపించిన తనను క్షమించాలని చెప్పు తీశారు.

కొత్తపల్లిని వైసీపీ పెద్దలు వివరణ కోరారా?
ఈ అంశంపై ఎమ్మెల్యే ప్రసాదరాజు కూడా భగ్గుమన్నారు. సుబ్బారాయుడిపై ఫైర్‌ అయ్యారు. గతంలో సుబ్బారాయుడిపై పోటీ చేసినప్పుడు తనకు 17 వేల మెజారిటీ వస్తే.. గత ఎన్నికల్లో ఆయన మద్దతు వల్ల ఓట్ల ఆధిక్యం 6 వేలకు పడిపోయిందని సెటైర్లు వేశారు ప్రసాదరాజు. సీఎం జగన్‌ను నరసాపురానికి తీసుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధికి ఏం చేశానో ముఖ్యమంత్రితోనే చెప్పిస్తానని ప్రకటించారు కూడా. రెండు శిబిరాలు ప్రస్తుతం ఓపెన్‌ కావడంతో వైసీపీ అధిష్ఠానం నరసాపురంపై ఫోకస్‌ పెట్టింది. సుబ్బారాయుడిని వివరణ కోరినట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక చెప్పు తీశారో.. లేక సింపతీ కోసం సుబ్బారాయుడు చెప్పును నమ్ముకున్నారో చూడాలి.