Site icon NTV Telugu

Nandikotkur Politics : నందికొట్కూరు వైసీపీలో మూడేళ్ళుగా ఒకటే పంచాయితీ.. అంశమేదైనా భగ్గుమనాల్సిందే..!

Nandi Kotkuru

Nandi Kotkuru

Nandikotkur Politics  : మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకన్నట్టుగా ఉంది నందికొట్కూరులో వైసీపీ నేతల పోరు. మూడేళ్లుగా ఒక్కటే పంచాయితీ. అంశం ఏదైనా భగ్గు మనాల్సిందే. అసలే ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్దరి మధ్య కొత్త విషయం మరింత అగ్గిరాజేసింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఆర్థర్‌.. నందికొట్కూరు ఎమ్మెల్యే. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నందికొట్కూరు వైసీపీ ఇంఛార్జ్‌. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఇద్దరి నేతల మధ్య జరిగిన వర్గపోరు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. పార్టీ పరంగా ఒకే గూటిలో ఉన్నా.. ఆధిపత్య పోరుకు వచ్చే సరికి ఎవరికి వారే. తగ్గేదే లేదన్నట్టుగా ఉంటోంది వైరం. ఎదురుపడితే ఏమౌతుందో కూడా పార్టీ కేడర్‌కు అర్థం కాని పరిస్థితి. రచ్చ రచ్చ అయిన సందర్భాలు అనేకం. పరస్పరం పోలీసు కేసులు పెట్టుకున్న ఉదంతాలు కోకొల్లలు. వీరి మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు అనేకసార్లు విఫలయత్నం చేశారు. ఈ మూడేళ్ల కాలంలో విభేదాలు పీక్స్‌కు చేరుకున్నాయే తప్ప.. ఇసుమంత మాత్రం బ్రేక్‌ లేదనే చెప్పాలి. తాజాగా ఆర్థర్‌, బైరెడ్డి మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. అది గట్టిగానే రాజుకుంటోందట.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుచరులకు టికెట్‌ ఇచ్చే విషయంలో ఆర్థర్‌, బైరెడ్డి వర్గాలు రోడ్డెక్కి నానా రభస చేశాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇద్దరినీ కలిసి తిరగాలని సూచించారు పార్టీ పెద్దలు. ఆ హితోక్తులను ఒక చెవితో విని ఒంకో చెవితో బయటకు వదిలేశారని కామెంట్స్‌ చేస్తుంటాయి నందికొట్కూరు వైసీపీ శ్రేణులు. తాజాగా బ్రాహ్మణకొట్కూరు సింగిల్ విండో చైర్మన్ నియామకం చిచ్చు రేపుతోంది. సింగిల్ విండో చైర్మన్‌గా సతీష్‌రెడ్డి ఉండేవారు. జులై 13నే ఆయన పదవికాలం ముగిసింది. ఆ పదవిలో మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డి బంధువు మద్దూరు హరి సర్వోత్తమ రెడ్డిని నియమించాలని ఎమ్మెల్యే ఆర్థర్ ప్రతిపాదించారట. అయితే ఓంకార్‌రెడ్డి అనే నేతకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి సూచించారట. దీనిపై ఆర్థర్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌ బాషాల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ సమయంలోనూ ఆర్థర్‌.. బైరెడ్డి వర్గాలు తీవ్రస్థాయిలో తిట్టేసుకున్నాయట.

ఇంతలో బ్రాహ్మణకొట్కూరు సింగిల్ విండో అధ్యక్షునిగా మద్దూరు హరిసర్వోత్తమ్ రెడ్డిని నియమిస్తూ జీవో విడుదలైంది. ఆయన బాధ్యతలు చేపట్టి మినిట్‌ బుక్‌లో సంతకాలు కూడా చేశారట. సహకార శాఖ అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చి సింగిల్ విండో చైర్మన్‌గా హరి సర్వోత్తమ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలి. దానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం మోకాలడ్డినట్టు తెలుస్తోంది.
అంతేకాదు.. సింగిల్ విండో చైర్మన్ గా హరిసర్వోత్తమ్ రెడ్డి పేరు నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వు ఇప్పించారనే ప్రచారం కూడా ఉంది.

ఈ ఆధిపత్య రగడ కారణంగా బ్రాహ్మణకొట్కూరు సహకార సొసైటీకి పాలకవర్గం లేకుండా కొనసాగుతోంది. వివాదం కారణంగా సొసైటీ ద్వారా రైతులకు అందాల్సిన రుణాలు కూడా అందడం లేదట. మొత్తమ్మీద నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీలో విబేధాల వల్ల ప్రతిదీ వివాదమే అవుతోంది. మరి.. ఈ వర్గపోరుకు పార్టీ పెద్దలు ఎప్పుడు చెక్‌ పెడతారో చూడాలి.

Exit mobile version