మునుగోడులో కాసుల వర్షం కురుస్తోంది. సర్పంచ్‌లకు.. వార్డు మెంబర్లకు వారి స్థాయిని బట్టి రేటు కట్టేస్తున్నారు. లక్షలు గుమ్మరించడానికి వెనకాడటం లేదు. కాస్త పలుకుబడి ఉందనుకుంటే కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌గా ఇస్తున్నారట. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఉపఎన్నిక ఓ లెక్క.. ఇక్కడ జరగబోయే బైఎలక్షన్ మరో లెక్క అన్నట్టుగా తాయిలాల వల విసురుతున్నాయి ప్రధాన పార్టీలు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.
మునుగోడు నేతలను చూసి.. తెలంగాణలోని ఇతర ప్రాంతాల నాయకులు ఈర్ష్య పడే పరిస్థితి వచ్చిందా? మునుగోడులో ఓటరై ఉంటే బాగుండేదని బాధ పడుతున్నారా? నియోజకవర్గంలో పంచాయతీ వార్డు మెంబరైనా చాలు లైఫ్ సెటిల్ అయిపోయేదని విచారం వ్యక్తం చేస్తున్నారా? 20 రోజుల ముందు మునుగోడు.. ఇప్పటి మునుగోడు పొలిటికల్ చిత్రానికి చాలా మార్పు వచ్చేసిందా? ఇప్పుడీ ప్రశ్నలు ఎందుకూ అనుకోకండి. అక్కడ జరుగుతున్న యవ్వారాలు.. స్థానిక ప్రజాప్రతినిధులకు ఇస్తున్న తాయిలాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక.. మునుగోడులో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపఎన్నిక తేదీ ఇంకా ఖారారు కాకపోయినా.. ప్రధాన పార్టీలు చతురంగ బలగాలతో మోహరించాయి. లోకల్ లీడర్స్‌కు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు.. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధిగా ఉంటే చాలు.. క్షణాల్లో లక్ష్మీదేవి కటాక్షిస్తోంది. ఖరీదైన కారు వాకిట్లో వాలిపోతోంది. టూ వీలర్‌కే ఎక్కువ అనుకున్న కొందరు నేతల ఇళ్ల దగ్గర ప్రస్తుత ఖరీదైన కార్లు కనిపిస్తున్నాయని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.
అసంతృప్తితో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, MPTCలు, MPPలు, ZPTCలను బుజ్జగించేందుకు కార్లు ఆఫర్ చేశారని కొందరు.. కార్లు ఇచ్చేశారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరికి లక్షల్లో నగదు ముట్టజెప్పారట. విడతల వారీగా మరికొంత రొఖ్ఖం ఇస్తామని హామీలు ఇస్తున్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తన శిబిరంలో బలాన్ని పెంచుకోవడానికి కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కార్లు ఇచ్చారని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం ఆ కార్లలోనే కొందరు లీడర్స్ మునుగోడులో చక్కర్లు కొడుతున్నారట. రండి.. మీకో కారు ఇప్పిస్తాం.. మాది భరోసా అని ఇతర నేతలకు ఆశ పెడుతున్నారట.
తాయిలాలు అందుకోవడంలో కొందరు ప్రజాప్రతినిధులు బాగా తెలివి మీరిపోయారట. టీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు.. రాజగోపాల్‌రెడ్డి శిబిరం నుంచి ఇస్తోన్న నగదు.. ఖరీదైన గిఫ్ట్‌లను తీసుకుంటున్నారట. పార్టీ మారితే ఓకే.. మరింత బాగా చూసుకుంటాం. మారకపోయినా ఇబ్బంది లేదు. మీరు ఉన్నచోటే కామ్‌గా ఉండండి. ఎవరు ఏం ఇచ్చినా తీసుకోండి.. ఓట్లు మాత్రం మాకే వేయించాలి అని మాట తీసుకుంటున్నారట. ఇదేదో బాగుందని .. చాలా మంది ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు టాక్.
మునుగోడు ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. ఛాన్స్ తీసుకోవడానికి ఎవరూ ఇష్ట పడటం లేదు. డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నాయి పార్టీలు. నవంబర్‌లో ఉపఎన్నిక ఉండొచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దాంతో నగదు రూపంలో తాయిలాలు ఆశిస్తున్న వారికి ఎన్ని విడతల్లో పచ్చనోట్లు సమర్పించాలో అర్థం కావడం లేదట. కాకపోతే పోలింగ్ శుభముహూర్తం నిర్ణయం అయ్యే వరకు ప్రజాప్రతినిధులు ఏది అడిగితే అది ఇవ్వడానికి సంకోచించడం లేదు పార్టీలు.
తాయిలాలే కాదు.. మునుగోడులో హోటళ్ల రూమ్స్‌కు.. అద్దె ఇళ్లు యమ డిమాండ్ నెలకొంది. రాజగోపాల్‌రెడ్డి ప్రధాన మున్సిపాలిటీలలోని లాడ్జీ రూములను డిసెంబర్ వరకు బుక్ చేసేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక వేలు పోసినా అద్దె ఇల్లు దొరకడం లేదట. అద్దె ఇళ్ల విషయంలో స్థానిక నేతలపై చాలా ఒత్తిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఓనర్లు ఆశిస్తున్న దానికి రెండు మూడు రెట్లు ఇద్దాం.. కోరినంత అడ్వాన్స్ ఇద్దాం.. అద్దె ఇల్లు మాత్రం తమకే ఉండాలని డిమాండ్ చేస్తున్నారట. మొత్తానికి మునుగోడు ఉపఎన్నికలో మునిగేది ఎవరో.. తేలేది ఎవరో కానీ.. డబ్బు మాత్రం చేతికి వెన్నముకే లేదన్నట్టుగా ఖర్చు అయిపోతోంది.