Site icon NTV Telugu

Munugode candidate : మునుగోడు అభ్యర్థి పై తర్జన భర్జన

Munugode

Munugode

మునుగోడు మొనగాడు ఎవరు? బీజేపీ అభ్యర్థిపై స్పష్టత వచ్చినా.. TRS, కాంగ్రెస్‌ ఎంతుకు తర్జన భర్జన పడుతున్నాయి? అంతర్గత పంచాయితీలు రెండు పార్టీలకు తలనొప్పిగా మారాయా? అభ్యర్థి పేరు ప్రతిపాదించడానికి కాంగ్రెస్‌లో సీనియర్లు ఎందుకు జంకుతున్నారు?

మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థి ప్రకటన అధికార TRS, కాంగ్రెస్‌ పార్టీలకు తలనొప్పిగా మారిపోయింది. సొంతపార్టీలో రేగిన కుంపటితో కొంత తటపటాయిస్తోంది టీఆర్‌ఎస్‌. మునుగోడులో సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించిన రోజే.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని క్యాండిడేట్‌గా డిక్లేర్‌ చేస్తారని భావించారు. కానీ, అభ్యర్థి ప్రకటన లేకుండానే సభ ముగిసింది. మునుగోడులో టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజా ప్రతినిధులు.. కూసుకుంట్లపై అసమ్మతి ప్రకటించారు. కొందరు ప్రత్యేక సమావేశాలు పెడితే.. ఇంకొందరు పార్టీ కూడా మారిపోయారు. సీఎం కేసీఆర్‌ దగ్గరకు ఈ అసంతృప్తుల గోల వెళ్లింది. పైకి కలిసి ఉన్నట్టుగానే చెబుతున్నా.. తెరవెనక ఏదో తేడా కొడుతోందట.

గతంలో సొంత పార్టీ నాయకుల మీదనే.. కూసుకుంట్ల కేసులు పెట్టించారనేది ప్రధాన ఆరోపణ. నారాయణపురం, చండూరు, మర్రిగుడెం, నాంపల్లి మండలాల్లో కీలకంగా పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలతో మాజీ ఎమ్మెల్యేకు గ్యాప్‌ వచ్చిందట. ఉపఎన్నికలో కూసుకుంట్లకి టికెట్ ఇస్తే.. వచ్చే సాధారణ ఎన్నికల వరకు వేధింపులు తప్పవనే ఆలోచనలో ఉన్నారు అసమ్మతి నేతలు. అభ్యర్ధి ప్రకటనకంటే ముందే తలనొప్పి రావడంతో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ వంటి బీసీ నేతలు తెరమీదకు వచ్చారు. మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువ కావడంతో ఆ వర్గానికి టికెట్‌ ఇవ్వాలనే ప్రచారం జోరందుకుంది. అందుకే క్యాండిడేట్‌ను ప్రకటించలేదని సమాచారం.

కాంగ్రెస్‌లో కూడా సేమ్ సీన్. మునుగోడులో అభ్యర్ధి ఎవరనే దానిపై కసరత్తు కొలిక్కి వచ్చింది. ఫైనల్‌గా రెండు పేర్లు చర్చకు వచ్చాయి. పాల్వాయి స్రవంతి.. చల్లమల కృష్ణారెడ్డి పేర్లను పార్టీ పరిశీలిస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేయాలనే దానిపై.. సీనియర్ల అభిప్రాయం తీసుకుంటున్నారట. అయితే సీనియర్‌ నాయకులు చేతులు ఎత్తేసినట్టు సమాచారం. ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వండి అని పక్కకు తప్పుకొంటున్నారట. ఫలానా వారికి టికెట్ ఇవ్వాలని చెప్పడానికి భయపడుతున్నారట. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కూడా… మీరే నిర్ణయం తీసుకోండి అని చేతులు దులిపేసుకుంటున్నారట.

మునుగోడులో ఫలితం తేడాగా వస్తే దానికి తమను బాధ్యులను చేస్తారని సీనియర్లు జంకుతున్నారట. అందుకే ముందుకు రావడం లేదని తెలుస్తోంది. స్రవంతికి టికెట్‌ ఇవ్వాలని చెబుతున్నా.. ఉపఎన్నికలో ధన ప్రభావానికి ఆమె తట్టుకోగలరా అనేది ప్రశ్న. కాంగ్రెస్‌ సీనియర్లకు మౌనానికి అది కూడా కారణమట. పీసీసీ చీఫ్‌కే ఆ నిర్ణయాన్ని వదిలేస్తే పోలా అన్నది వారి అభిప్రాయంగా తెలుస్తోంది. ఫలితాల తర్వాత..పిసిసిని తప్పు పట్టడానికి ఓ ఆప్షన్ ఉండాలని భావించేవారు లేకపోలేదు. జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత మాత్రం స్రవంతికి టికెట్‌ ఇస్తే గెలిపిస్తామని చెప్పారట. ప్రచారానికి వస్తారో రారో తెలియని సదరు నాయకుడి సలహాపై పార్టీ కూడా ఆలోచనలో పడిందట.

పిసిసి చీఫ్ రేవంత్ మాత్రం ప్రియాంక గాంధీ సూచన కోసం ఎదురు చూస్తున్నారట. మునుగోడు ఉప ఎన్నిక.. చావో రేవో లాంటి సమస్య. రేవంత్ నాయకత్వానికి కూడా ఇవి సవాల్. సొంత పార్టీ నాయకుల తలనొప్పులు కూడా తోడవడంతో రేవంత్ ఏం చేస్తారు అనేది ప్రశ్న. మొత్తానికి రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. మరి ఎప్పటికి క్లారిటీ ఇస్తాయో చూడాలి.

 

Exit mobile version