ఆయనో మంత్రి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా సొంత పార్టీవర్గాలే చెవులు కొరుక్కుంటాయి. ఏదో ఒక అంశంలో మంత్రి పేరు వినిపించడం కామన్. ఈసారి తమ్ముడు చేసిన పనివల్ల చిక్కుల్లో పడ్డారు. విపక్షాలకు మళ్లీ దొరికిపోయారు. దాంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారట అమాత్యుల వారు.
మళ్లీ చర్చల్లోకి వచ్చిన మంత్రి మల్లారెడ్డి
మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ పేరు చెప్పగానే రాజకీయవర్గాల్లో అనుకోకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఆయన కామెడీ టైమింగ్ అలా ఉంటుంది మరి. కేవలం కామెడీనే కాదు.. వివాదాల్లో ఇరుక్కోవడంలోనూ మల్లారెడ్డి టాప్‌లో ఉంటారు. లేటెస్ట్ ఎపిసోడ్‌లోనూ అదే జరిగింది. మళ్లీ చర్చల్లోకి వచ్చేశారు.
పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన మంత్రి తమ్ముడు
స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారట!
తెలంగాణలో పేకాట క్లబ్‌లపై నిషేధం ఉంది. ఎవరైనా పేకాడితే పోలీసులు రఫ్ఫాడిస్తున్నారు. అయినప్పటికీ కొందరు పేకాటరాయుళ్లు పోలీసులకు కొరుకుడుపడటం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేయడంతో.. స్పాట్‌లో పెద్ద షాటే చిక్కింది. ఆ వ్యక్తి ఎవరో కాదు. మంత్రి మల్లారెడ్డి తమ్ముడు చామకూర నరసింహారెడ్డి. పేకాట ఆడుతున్న ప్లేస్ ఎక్కడో కాదు.. సికింద్రాబాద్ బోయినపల్లి మాల్లారెడ్డి గార్డెన్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో. మొత్తం 13 మందిని పోలీసులు పట్టుకోగా.. వారిలో ఏ-వన్ మంత్రి తమ్ముడే. విషయం కాస్తా బయటకు పొక్కడంతో.. ఖాకీలపై ఒత్తిళ్లు వచ్చాయో ఏమో నరసింహారెడ్డిని మీడియా కంటపడకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు.
మల్లారెడ్డిని కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ ధర్నా
ఈ వివాదంలో తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని మంత్రి అనుకోలేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. అలాగే విపక్ష పార్టీలకు మల్లారెడ్డి కార్నర్ అయ్యారు. ఆయన్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ధర్నా చేశారు బీజేపీ కార్యకర్తలు. విషయం కాస్తా రచ్చ రచ్చ కావడంతో ఈ వివాదం నుంచి ఎలా బయటపడాలా అని దారులువెతుక్కుంటున్నారట అమాత్యులవారు.
గతంలో భూ వివాదంలో మల్లారెడ్డికి క్లాస్ తీసుకున్న సీఎం!
వివాదాలు మల్లారెడ్డికి కొత్తకాదు. కరోనా లాక్‌డౌన్ ముందు భూ వివాదంలో ఆయన పేరు వచ్చింది. మేడ్చల్ జిల్లా దేవరాయాంజల్‌లోని 657 సర్వే నెంబర్‌లో మంత్రి మల్లారెడ్డి బావమరిది మర్రి రాజశేఖర్‌రెడ్డికి ఫామ్‌హౌస్ ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అక్కడ నుంచే మర్రి రాజకీయాలు చేస్తారట. ఆ భూముల విషయం తెలిసి… కేబినెట్ భేటీలో మంత్రి మల్లారెడ్డికి సీఎం క్లాస్ తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఆ తర్వాత సొంత నియోజకవర్గంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు మల్లారెడ్డి.
సర్పంచ్ భర్తకు ఫోన్ చేసి బెదిరించినట్టు ఆడియో వైరల్
50 ఎకరాల వెంచర్‌కు సంబంధించి ఓ సర్పంచ్ భర్తకు ఫోన్ చేసి మల్లారెడ్డి బెదిరించినట్టుగా చెబుతున్న ఆడియో ఓ హైలైట్. సర్పంచ్‌కు ఇస్తే సరిపోతుందా? పొట్టు పొట్టు చేస్తాం.. వాడిని బిచ్చం అడుగుతావా.. మంత్రిని కలువు అన్న మాటలు కొన్నిరోజులు కలకలం రేపాయి. మంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. అసలు ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని మల్లారెడ్డి ఖండించారు. ఇప్పుడు పేకాట గొడవ దుమారం రేపుతోంది. సొంత పార్టీలోనూ చర్చకు కారణం అవుతున్నారాయన. మరి.. ఈ లొల్లి మల్లారెడ్డి ఎంత దూరం తీసుకెళ్తుందో చూడాలి.