Site icon NTV Telugu

తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో మట్టి మాఫియా..!

వడ్డించేవాడు మనవాడే అయితే.. ఎక్కడున్నా ఫర్వాలేదు.. ఎంత తవ్వుకున్నా అడిగేవారు లేరని అనుకున్నారా? ఏకంగా 60 కోట్ల గ్రావెల్‌ను అమ్మేసుకున్నారా? మాఫియా మాయాజాలం పేరుతో కొండను గుల్లచేసి.. జేబులు నింపేసుకున్నవారు ఎంపీ అనుచరులా? ఆ మట్టి బాగోతం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఎంపీ అనుచరులే మట్టిని తవ్వేశారా?

నేలను చదును చేయడం అంటే.. ఎక్కడైనా రోడ్డుతో సమానంగా లేదా రోడ్డుకంటే కాస్త ఎక్కువగా పని పూర్తి చేస్తారు. కానీ.. తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో మాత్రం డిఫరెంట్‌. కొండపై కన్నేసిన కొందరు చదును పేరుతో రోడ్డుకంటే 15-20 అడుగుల లోతు వరకు తవ్వేశారు. అలా తవ్విన మట్టిని ప్రజోపయోగానికి వినియోగిస్తున్నట్టు చెప్పి.. సొంత జేబులు నింపేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు… రెండు కాదు.. ఏకంగా 60 కోట్లు వెనకేసుకున్నారట. ఇదంతా అధికారులకు తెలిసినా.. మట్టిని తవ్వుకుపోతున్నవారంతా ఎంపీ భరత్‌ అనుచరులు కావడంతో కిక్కురు మనడం లేదట. ఈ సమస్య ఇప్పుడు రాజమండ్రిలో రాజకీయాలను వేడెక్కిస్తోంది.

రోడ్డుకు సమాంతరంగా కాకుండా 15-20 అడుగులు లోపలికి తవ్వేశారు..!

వేమగిరిలోని జిల్లా పరిషత్‌ కొండ ఎత్తు 60 అడుగులు. సర్వే నెంబర్‌ 214/1లో 23.54 ఎకరాల విస్తీర్ణంలోని కొండ భూమిని ఇళ్ల పథకంలో బాగంగా 850 మందికి పట్టాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ కొండను చదును చేసి.. ఆ మట్టిని పల్లం ఏరియాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చని భూమిని పూడ్చడానికి తీసుకెళ్లాలి. కానీ.. ఆ పేరు చెప్పి మట్టిని మింగేశారు కొందరు మాయగాళ్లు. చదును పేరుతో కొండను తవ్వేసి.. రోడ్డుకు సమాంతరంగా కాకుండా గునపం.. పారా పట్టుకుని ఇంకా 15-20 అడుగులు లోపలకే వెళ్లిపోయారు. ఇదంతా రెడ్‌ గ్రావెల్‌. లారీ ఎర్ర మట్టిని రెండున్నర వేల చొప్పున అమ్ముకుని సొమ్ము చేసుకున్నారట.

చెరువుగా మారిన ఇళ్ల పట్టాల ప్రాంతం..!

చదును పేరుతో కొండను తవ్వేసి.. ఆ ప్రాంతాన్ని పెద్ద చెరువుగా మార్చేశారు. దీంతో వర్షం పడితే ఇక్కడ ఇళ్ల పట్టాలు పొందిన వాళ్లు పడవలు వెసుకుని వెళ్లి.. తమ ప్లాట్‌ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. అయితే ఈ ఎపిసోడ్‌లో పైవాళ్ల ఆశీసులు లేకుండా అనుచరులు కోట్ల రూపాయల వ్యవహారాన్ని డీల్‌ చేయలేరని విపక్షాలు విమర్శిస్తున్నాయి. లోపాయికారీ ఒప్పందం ఇంకేదో ఉండే ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు. అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

తమకేం కాదని మాఫియా ధీమా?

మట్టి మాఫియా పేరుతో కోట్లు కొల్లగొట్టిన ఈ అంశాన్ని విపక్షాలు రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నాయి. దోపిడీదారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. రోజుల వ్యవధిలోనే కొండను పిండి చేసి సొంత ఖజానా నింపుకొన్నవాళ్లు మాత్రం తమకేం కాదని ధీమాగా ఉన్నారట. అధికారులు కిక్కురుమనకపోవడంతో మట్టి మాఫియా బయట పడుతుందా? సూత్రధారులు.. పాత్రధారులు చిక్కుతారా అన్నది అనుమానమే.

Exit mobile version