Kothagudem TRS : ఆ మధ్య రాజకీయంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కష్టమనే చర్చ సాగింది. ఇంతలో మాజీ MLA కదలికలు పెరిగాయి. కొత్త సమీకరణాలు చర్చకు వస్తున్న తరుణంలో.. గేర్ మార్చేశారు సిట్టింగ్ MLA. ఎందుకలా? తాజా.. మాజీల మధ్య అసలేం జరుగుతోంది? ఎవరు వారు? లెట్స్‌వాచ్..!
వనమా వెంకటేశ్వరరావు. కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కిన ఎమ్మెల్యే. వయసు పైబడి.. ఆ మధ్య వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని డీలా పడిన ఆయనకు.. కుమారుడు రాఘవేంద్ర రూపంలో రాజకీయంగా పెద్ద ఝలక్ తగిలింది. రాజకీయంగా వనమా పరిస్థితి అయిపోయిందని అంతా భావించారు. ఎమ్మెల్యేగా కూడా ఎక్కడా పెద్దగా రియాక్ట్ కాకపోవడంతో.. పొలిటికల్ మూడ్‌ను అర్థం చేసుకున్నారని అనుకున్నారు టీఆర్ఎస్ నేతలు. కానీ.. వనమా గేర్ మార్చేశారు. గతంలో కంటే చలాకీగా కొత్తగూడెంలో పర్యటనలు చేస్తున్నారు. ఎక్కువగా జనంలో ఉండటానికే ఇష్ట పడుతున్నారు. అంతేనా.. వచ్చే ఎన్నికల్లో కొత్తూగూడెంలో టీఆర్ఎస్ నుంచే తానే పోటీ చేస్తానని కుండబద్దలు కొడుతున్నారు కూడా. కొత్తగూడెం బరాబర్ తనదే అన్నది వనమా వెంకటేశ్వరరావు మాట. అదే ఇప్పుడు నియోజకవర్గంలో చర్చగా మారింది.
2014లో ఇదే కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు జలగం వెంకట్రావు. 2018లో ఆయన వనమా చేతిలో ఓడిపోయారు. వనమా టీఆర్ఎస్‌లో చేరాక జలగం సైలెంట్ అయ్యారు. అయితే వనమాపై జలగం న్యాయ పోరాటం చేస్తున్నారు. 2014లో వనమా దాఖలు చేసిన అఫిడవిట్‌కు.. 2018లో సమర్పించిన అఫిడవిట్‌కు తేడా ఉందనేది జలగం ఆరోపణ. ఆస్తులను సరిగా వెల్లడించలేదని మండిపడుతున్నారు. దానిపైనే ఆయన కోర్టుకు వెళ్లారు. వనమాపై అనర్హత వేటు పడుతుందనే గట్టి ధీమాతో ఉంది జలగం వర్గం. దానికితోడు వనమా రాఘవ ఎపిసోడ్ తర్వాత జలగం వెంకట్రావు దూకుడు పెంచారు. అది ఎమ్మెల్యేకు రుచించడం లేదట. అందుకే ఈ ఐదేళ్లూ తానే ఎమ్మెల్యే.. వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని వనమా చెబుతున్నారని భావిస్తున్నారు. ఇది జలగంను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రకటనగా అభిప్రాయ పడుతున్నారట.
వచ్చే ఎన్నికల్లో వనమా పోటీ డౌట్ అని పార్టీ కేడర్ అనుకుంటున్న తరుణంలో.. ఇలా గంభీరమైన ప్రకటనలు చేస్తున్న ఎమ్మెల్యేను చూసి శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. అధిష్ఠానం ఆశీసులు ఉన్నాయనేది వనమా వాదన. కొత్తగూడెంలో రాజు, మంత్రి తానేనని చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే ప్రకటనలను.. టీఆర్‌ఎస్‌లో టికెట్ ఆశిస్తున్న జలగం తదితరులు వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదట. అందరి జాతకాలు పార్టీ పెద్దల దగ్గర ఉన్నాయని.. కొత్తగూడెంలో మార్పు అనివార్యమని భావిస్తున్నారట. దీంతో అధికార పార్టీలోని రెండు వర్గాలు వేస్తున్న ఎత్తుగడలు నియోజకవర్గంలో ఆసక్తి కలిగిస్తున్నాయి. మరి.. ఎవరి మాట చెల్లుబాటు అవుతుందో.. ఎవరు బరిలో ఉంటారో చూడాలి.
