తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికలతో ఊపు తెద్దాం అనేది స్ట్రాటజీ. అదే చేరికల అంశంలో సీఎల్పీ నేత భట్టి పంచాయితీ ముగిసిందో లేదో మరో కొత్త రగడ బయకొచ్చింది. గాంధీభవన్‌లో మాజీ మేయర్ ఎర్ర శేఖర్ చేరిక పూర్తి కాకముందే.. స్టార్ క్యంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎర్ర శేఖర్ చేరికను తప్పు పట్టారు. అధిష్ఠానానికి లేఖ రాయబోతున్నారు కూడా. నేర చరిత్ర ఉన్న వాళ్లను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ఏంటనే లొల్లి మొదలైంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వెనక వ్యూహం ఉందంటోంది పీసీసీ చీఫ్ రేవంత్ వర్గం. ఎర్ర శేఖర్ వచ్చే ఎన్నికల్లో జడ్చర్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. అదే సీటును కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితుడు అనిరుద్ రెడ్డి ఆశిస్తున్నారు. ఎర్ర శేఖర్ రాకవల్ల అనిరుద్‌కి రాజకీయంగా ఇబ్బంది అనే లెక్కల్లోనే కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం.
ఎర్ర శేఖర్ పై సోదరుడిని హత్య చేశారు అనే కేసు నడిచింది. ఇటీవల కోర్టులో క్లియరెన్స్ వచ్చిందని రేవంత్ వర్గం చెబుతోంది. కోర్టు నిర్దోషి అని తేల్చిన తర్వాత… అభ్యంతరం ఏంటన్న ప్రశ్న లేవనెత్తింది పాలమూరు జిల్లా నాయకుల బృందం. ఇక్కడ ఇంకో చర్చ జరుగుతోంది. ఆ మధ్య నల్గొండకి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రానక్కర్లేదని కోమటిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. నల్గొండ జిల్లా నాయకుడిగా అభ్యంతరం చెప్పిన కోమటిరెడ్డి… పాలమూరు జిల్లా విషయంలో ఎలా జోక్యం చేసుకుంటారని రేవంత్ వర్గం ప్రశ్నిస్తోంది. పైగా జిల్లాకు చెందిన నాయకులు ఎవరూ ఎర్ర శేఖర్ చేరికపై అభ్యంతరం చెప్పనప్పుడు కోమటిరెడ్డి ఎలా మాట్లాడతారని ఏకంగా ప్రకటనే రిలీజ్ చేశారు. పాలమూరు జిల్లాలో ఏఐసీసీ కార్యదర్శులు ఆ చేరికకు ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
జడ్చర్లలో ఎర్ర శేఖర్ పోటీ చేస్తే.. మొదట అభ్యంతరం… ప్రస్తుత ఇంఛార్జి మల్లు రవికే ఉండాలి. మల్లు రవి కూడా ఆయన చేరిక అందరి నిర్ణయం మేరకే జరిగిందని చెప్పారు. కాకపోతే ఈ అంశాన్ని అడ్డు పెట్టుకుని నల్గొండపై ఉన్న పాత పంచాయితీ తెర మీదకు వచ్చింది. అలాగే.. కోమటిరెడ్డి ప్రకటన వెనక… మరో సీనియర్ కాంగ్రెస్ నేత కూడా ఉన్నట్టు రేవంత్ వర్గం అనుమానిస్తోందట.
తెలంగాణ కాంగ్రెస్ లో ఒక సమస్య కొలిక్కి రాగానే ఇంకో సమస్య తెర మీదకు వస్తోంది. రేవంత్, కోమటిరెడ్డి రగడను ఆ కోణంలోనే చూస్తున్నారు. జడ్చర్ల కోసమే ఇద్దరి మధ్య జగడం వచ్చిందని భావిస్తున్నారు. మరి.. ఈ విషయంలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో.. అధిష్ఠానం ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.
