కోర్టుల్లో తేలాల్సిన వివాదాల్ని కోనేట్లోకి లాగుతున్నారా? ఆధారాలు చూపాల్సిన చోట ఆ పని చేయకుండా గుడి మెట్ల బాట పడుతున్నారా? రాజకీయ ఆరోపణల మీద ప్రమాణాల పర్వం కొత్త కాకున్నా…. ఇప్పుడది శృతి మించుతోందా? ఈ ట్రెండ్ ముదరడం అంత మంచిది కాదన్న మాటలు ఎక్కడ వినిపిస్తున్నాయి? ఏ నాయకుడు ప్రమాణాల పాలిటిక్స్‌తో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దేవుడి సాక్షిగా రాజకీయం అన్నది కొత్తేమీ కాదు. మరీ ముఖ్యంగా…. కాణిపాకం స్వయంభూ వరసిద్ది వినాయకుడి సాక్షిగా ప్రమాణం అన్నది పాతమాటే. కానీ… ఈ మధ్య కాలంలో అది మరీ… శృతి మించుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఆ విషయంలో వాళ్ళు, వీళ్ళు అని తేడా లేకుండా… అధికార, ప్రతిపక్షాల నాయకులు చేస్తున్న హడావిడితో స్వామివారి ఆలయం రాజకీయ సవాళ్లకు కేరాఫ్‌గా మారిపోతోందంటున్నారు. నేతలు తమ తమ నియోజకవర్గాల్లో పట్టు కోసం, ప్రజల్లో సానుభూతి కోసం సవాళ్ళు విసురుకుంటూ ప్రమాణాల పేరుతో సులువుగా గుడి మెట్లెక్కుతున్నారు. చిత్తూరు నుంచి చంద్రగిరి వరకు ఎటు చూసినా ప్రస్తుతం జిల్లాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ప్రత్యర్థిని డిఫెన్స్‌లో పడేయాలనుకున్న ప్రతి నాయకుడు మాటకు ముందు రా…కాణిపాకం పోదాం అంటున్నారు. దీంతో… మీ రొచ్చులోకి మా దేవుణ్ణి ఎందుకయ్యా లాగుతారు…? భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోందట.
గతం సంగతి ఎలా ఉన్నా.. చిత్తూరోళ్ళు బెంగుళూరును ఏలుతున్నారన్న ఎమ్మెల్యే గురజాల జగన్ మాటలతో మొదలైన వివాదం రకరకాల మలుపులు తిరుగుతోంది. కాణిపాకం సవాళ్ళు ఇప్పటికీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్నాయట. తాజాగా చిత్తూరు అసెంబ్లీ పరిధిలో క్వారీల వ్యవహారం కాస్తా… స్వామి వారి కోనేట్లో మునకల దాకా వెళ్లింది. దొడ్డిపల్లె ప్రాంతంలోఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అక్రమంగా క్వారీ నడిపిస్తున్నారని, ఆ గ్రానైట్‌ను సొంత భవన నిర్మాణానికి కూడా వాడుకుంటున్నారని వైసీపీ ఇన్‌చార్జి విజయానందరెడ్డి ఆరోపించారు. అలాగే.. మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు పెరిగాయని, వందల కోట్లు దోచేశారని అన్నారాయన. తాను అవినీతి చేయలేదని ఎమ్మెల్యే జగన్ కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తారా అంటూ విజయనంద రెడ్డి సవాల్ విసిరారు. అందుకు ఎమ్మెల్యే కూడా తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు.
తాను, తన పీఏ మీద చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే… పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారాయన. అదే ఊపులో.. గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు, గంగాధర నెల్లూరు ప్రాంతాల్లో జరిగిన అక్రమ క్వారీయింగ్, ఇసుక రవాణాపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్, ఎస్పీలను కోరారు గురజాల. గతంలో వచ్చిన, తాజా ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమంటూ ముందుకొచ్చారాయన. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు డిమాండ్ చేయడం, పత్రాలు బయటపెట్టడం మామూలు పద్ధతి. కానీ… అందుకు విరుద్ధంగా ప్రత్యర్థుల మీదికి పరస్పరం భక్తి అస్త్రాన్ని ప్రయోగించడం గురించి జిల్లాలో గట్టి చర్చే జరుగుతోంది. వాళ్ళు అక్రమాలు చేశారని వీళ్ళు, వీళ్ళు అడ్డగోలు పనులు చేశారని వాళ్ళు నిజంగా నమ్మితే…. ఆధారాలు బయటపెట్టాలి, చట్టబద్దమైన పోరాటం చేయాలిగానీ… ఇలా కోర్టుల్లో తేలాల్సిన వ్యవహారాల్ని కోనేట్లోకి లాగి… రెండు పక్షాలు చౌకబారు రాజకీయం చేస్తున్నాయన్న అభిప్రాయం వివిధ వర్గాల్లో పెరుగుతోంది.
అసలు చేయాల్సిన పని మానేసి.. దేవుడిపై భారం వేయడం వెనుక సొంత కేడర్‌ను ఆకట్టుకునే వ్యూహమే తప్ప నిజాలు తేల్చే ఉద్దేశం కనిపించడం లేదన్న గుసగుసలు సైతం ఉన్నాయి. ఒక్క చిత్తూరు నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి జిల్లా మొత్తంలో ఇదే ట్రెండ్ నడుస్తోందంటూ గుర్తు చేస్తున్నారు కొందరు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మధ్య నడిచిన పోరు కాణిపాకం వేదికగానే తారస్థాయికి చేరింది. చెవిరెడ్డి కుటుంబ అవినీతిపై తన వద్ద ఆధారాలున్నాయని, దమ్ముంటే కాణిపాకం వచ్చి స్వామివారి ఎదుట ప్రమాణం చేయాలంటూ నాని సవాల్ విసిరారు. నగరి పాలిటిక్స్‌లోనూ సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అయింది. మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్‌రెడ్డి ఛలో కాణిపాకం అన్నారు.
రోజాపై ఆరోపణలు గుప్పిస్తూ ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసరగా…. రోజా కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తూ కాక రేపారు. ఇలా అధికార,ప్రతిపక్ష నేతలు వరుసగా కాణిపాకం వైపు చూడటం వెనుక పక్కా రాజకీయ వ్యూహం దాగి ఉందంటున్నారు పరిశీలకులు. ఆరోపణలే తప్ప ఆధారాలు దొరకనప్పుడు నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా?” అంటే చాలు.. ప్రజల్లో సెంటిమెంట్ రగులుతుంది. దాంతో… ప్రత్యర్థి మానసికంగా డిఫెన్స్‌లో పడతారన్న లెక్కలు ఉన్నాయట. అందుకే… ఆధారాలతో నిరూపించాల్సిన అవినీతి ఆరోపణలను దేవుడి ఖాతాలో వేసి చేతులు దులుపుకోవడం నాయకులకు అలవాటుగా మారిందని అంటున్నారు. అయితే… ఈ ప్రమాణాల పర్వం తాత్కాలికంగా పొలిటికల్ మైలేజ్ ఇస్తే ఇవ్వొచ్చేమోగానీ…. అంతిమంగా జనం ముందు అందరూ నవ్వుల పాలవుతారన్న సంగతి మర్చిపోకూడదని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. నేతలు గుడిమెట్ల రాజకీయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే…కీలకమైన సమయంలో బూమరాంగ్ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

