Yanamala Rama Krishnudu ఆయన ఆ పార్టీలో నెంబర్ టూగా ఉన్నారు. ఇరవై ఆరేళ్లు ఎమ్మెల్యేగా పని చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినపుడు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఓ సారి ఓడిపోవటంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని భీష్మించుకు కూర్చున్నారు. సోదరుడిని రంగంలోకి దింపినా..ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మరో ప్రయోగం చేయబోతున్నారు?అసలు..ఎవరా నేత?ఏం ప్రయోగం చేయబోతున్నారు?
యనమల రామకృష్ణుడు టీడీపీలో సీనియర్ నేత. తుని నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 2004 వరకు 26 ఏళ్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్‌గా పని చేశారు. 2009 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో తమ్ముడు కృష్ణుడు ను బరిలోకి దింపినా ఫలితం మాత్రం మారలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి..మంత్రిని చేసింది పార్టీ. ప్రస్తుతం యనమల శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో వరుస ఓటమిలతో డీలా పడిపోయారట. తమ్ముడు కృష్ణుడిని బరిలోకి దింపినా ప్రయోజనం లేకపోవడంతో కొత్త ఎత్తులు వేస్తున్నారని టాక్. ఈసారి ఓడిపోతే నియోజకవర్గంలో కనీసం ఎవరు పట్టించుకోరని తెగ బాధ పడిపోతున్నారట యనమల.
యనమలకు ఇద్దరు కూతుళ్లే. పెద్ద అమ్మాయి దివ్యకు రాజకీయాలంటే ఆసక్తి లేదట. అల్లుడు ఐఆర్ఎస్ అధికారి. వచ్చే ఎన్నికల్లో దివ్యను తుని నుంచి ఎన్నికల బరిలో దింపడానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారట యనమల. యనమల మొదటి నుంచి నియోజకవర్గంలో క్యాడర్‌కు టచ్‌లో ఉండరని చెబుతుంటారు. అతి కొద్ది మందితోనే తన ఆలోచనలను షేర్ చేసుకుంటారట. ఐతే ఈ మధ్య మాత్రం ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చిందనే టాక్ నడుస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం ఫోన్‌లు చేసి ఏంటి పరిస్థితి… రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటూ ఆరాలు తీస్తున్నారట. ఎప్పుడు లేనిది పార్టీలో ఆ స్థాయిలో ఉన్న నాయకుడు తమను కాంటాక్ట్ చేయడం ఏంటనే ఆలోచనలో పడిపోయారట క్యాడర్.
ఈసారి ఎన్నికల్లో ఏం చేద్దాం…తునిలో మన బలం ఏంటో చూపించాలని పెద్దమ్మాయిని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నారట యనమల. తుని నుంచి వరుసగా రెండుసార్లు మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయనకు గట్టి అభ్యర్థి కావాలంటే కొత్త జనరేషన్‌కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందంటూ ఆరా తీస్తున్నారని టాక్. కిందిస్థాయి నేతలు మాత్రం నిర్ణయం తీసుకోవాలంటే ఆయనే తీసుకుంటారని…తమకు సమాచారం ఇస్తున్నారని అనుకుంటున్నారట. తమ్ముడు కృష్ణుడు అభ్యర్థిత్వాన్ని కేడర్, జనం యాక్సెప్ట్ చేయట్లేదని…దానికి తగ్గట్టుగానే మనమూ నిర్ణయాలు తీసుకోవాలి కదా అని నొక్కి వక్కాణిస్తున్నారట యనమల.
మొత్తానికి…తుని రాజకీయాల్లో కొత్తదనం కోసం రామకృష్ణుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మళ్లీ ఓడిపోతే ఓటమిలోనూ తమ ఫ్యామిలీకి డబుల్ హ్యాట్రిక్ అవుతుందనుకొని ఈసారి లెక్కలు మార్చారు. తమ్ముడిని పక్కన పెట్టి కూతురును ఎన్నికల్లో దింపడానికి రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి యనమల ఆలోచనలకు పార్టీ అధిష్ఠానం, లోకల్ తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
