Site icon NTV Telugu

Vishaka Group Politics YCP : అక్కడ అధికార పార్టీలో సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవడం అంత వీజీ కాదా..?

Vishaka Ycp

Vishaka Ycp

Vishaka Group Politics YCP  : అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యేల హార్ట్‌ బీట్‌ రెట్టింపు అయ్యిందా? సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవడం అంత “వీజీ”కాదని అర్థమైనట్టేనా? హైకమాండ్ ప్రక్షాళన చేపడితే షాక్ ఎవరికి తగులుతుంది? సీఎం పర్యటనకు ముందు తర్వాత నేతల్లో వచ్చిన స్పష్టత ఏంటి? లెట్స్‌ వాచ్‌..!

ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త గుబులు పట్టుకుంది. ఎన్నికల ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని చెబుతూ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఫోకస్ పెంచింది అధిష్ఠానం. సర్వేలు, వివిధ మార్గాల ద్వారా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను సమీక్షిస్తోంది కూడా. ఎమ్మెల్యేలు ఉన్నచోట ప్రభుత్వానికి మార్కులు పడుతున్నా.. లీడర్లు, కేడర్ మధ్య గ్యాప్ కనిపిస్తోంది. అంతర్గత విభేదాలతో కొన్నిచోట్ల ముఖ్య నేతలు స్తబ్దత పాటిస్తున్నారు. ఇంకొన్నిచోట్ల వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇదే ధోరణి కొనసాగితే కీలకమైన స్థానాల్లో ఇబ్బందులు తప్పవనే ఫీడ్ బ్యాక్ పార్టీ హైకమాండ్ దగ్గర ఉందట. అందుకే సమస్యల పరిష్కారం దిశగా కీలక చర్యలకు శ్రీకారం చుడుతోంది. తాడికొండ తరహాలోనే ఇక్కడ కూడా అదనపు సమన్వయకర్తల నియామకం చేస్తారని సమాచారం. అప్పట్లో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు నాయకులు సమన్వయకర్తలుగా పని చేశారు. పార్టీ పవర్‌లోకి వచ్చాక.. ఎమ్మెల్యేలకు.. ఓడిన నేతలకు ఇంఛార్జులుగా అవకాశం కల్పించింది అధిష్ఠానం. ఓడిన వాళ్లకు నామినేటెడ్ పోస్టులు దక్కాయి.

మూడేళ్ల కాలంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రక్షాళన తప్పదనే సంకేతాలు పంపుతోంది పార్టీ. ఇటీవల సీఎం జగన్‌ విశాఖ పర్యటనలో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. గతంలో సీఎం జగన్ పర్యటన అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకే పరిమితం అయ్యేది. తాజా పర్యటనలో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు సీఎంతో మాట్లాడేందుకు అవకాశం లభించింది. వాళ్లంతా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నవాళ్లే. గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ ఏకపక్ష విజయం నమోదు చేసింది. విశాఖ నగరంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ వైసీపీకి జై కొట్టారు. ఈ మూడేళ్లకాలంలో ఆశించిన స్థాయిలో పుంజుకోలేదనేది అంతర్గతంగా చర్చ సాగుతోందట. కారణాల అన్వేషణలో భాగంగా ఉమ్మడి జిల్లాల వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బా రెడ్డి నియోజకవర్గాల వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల మరమ్మతులు అవసరమని ఆయన అభిప్రాయ పడినట్టు తెలుస్తోంది.

ఆ మధ్య వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తను మార్చేశారు. విశాఖ తూర్పులోను మార్పు అనివార్యంగానే కనిపిస్తోందట. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లిపై వెల్లడైన వ్యతిరేకత హైకమాండ్‌ జోక్యంతో సద్దుమణిగినా.. ఎక్కడో తేడా కొడుతోందట. పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు తలనొప్పులు పెరిగాయి. యాలమంచిలిలో అంతర్గత కుమ్ములాటలు చల్లారడం అంత ఈజీ కాదని చెబుతున్నారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు ఉండగా నియోజకవర్గంలో అక్రమాలపై విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు మండలస్థాయి నాయకత్వం మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్‌కు సానుకూలంగా ఉన్నప్పటికీ పార్టీ బలోపేతం విషయంలో వెనుకపడ్డారనే చర్చ జరుగుతోంది. పాడేరు, అరకు వ్యాలీల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గ్రూప్ రాజకీయాల సెగ తప్పడం లేదు. అందుకే రిపేర్లు చేయడం తప్పదని భావిస్తున్నారట. కనీసం 8 చోట్ల అదనపు సమన్వయకర్తలు వస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో సిట్టింగ్‌లకు చెమటలు పడుతుంటే.. అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరి.. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో ప్రక్షాళన ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

 

Exit mobile version