Site icon NTV Telugu

TCongress : వాళ్ళిద్దరికీ అస్సలు పడటంలేదా..? కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు రోడ్డున పడిందా..?

Congress

Congress

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రచ్చబండ.. పార్టీ అంతర్గతపోరును బయటపెడుతోంది. ఆ జాబితాలో జనగామ కూడా ఎక్కేసింది. ఇక్కడ పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య అస్సలు పడటం లేదు. ఇద్దరూ వేర్వేరుగా రచ్చబండ నిర్వహిస్తున్నారు. కేడర్‌లో కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తున్నట్టు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. జనగామ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ అనుమతి లేకుండా ప్రతాప్‌రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమాలపై భగ్గుమంటున్న పొన్నాల వర్గం.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ఛేస్తూ పీసీసీ చీఫ్‌తోపాటు.. పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసింది.

ఈ రగడంతా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై ఎవరు పోటీ చేయాలనే అంశంపైనే అన్నది ఓపెన్‌ టాక్‌. ఇక్కడ పొన్నాల, కొమ్మూరి ఇద్దరూ టికెట్ ఆశిస్తున్నారు. జనగామ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా పొన్నాల కొనసాగుతున్నారు. ఇక్కడ కొమ్మూరి నీడను కూడా పొన్నాల వర్గం అంగీకరించడం లేదు. ఇప్పటికే నియోజకవర్గంలో రెండు కాంగ్రెస్‌ ఆఫీసులు ఉన్నాయి. పొన్నాలకు ఒక ఆఫీస్‌ ఉంటే.. జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మరో పార్టీ ఆఫీస్‌ నడుస్తోంది. ఇప్పుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి గేర్‌ మార్చారు. రాహుల్‌గాంధీ సభ తర్వాత కాంగ్రెస్‌కు జిల్లాలో ఊపు వచ్చిందని.. దానిని క్యాష్ చేసుకుంటే ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయనే లెక్కల్లో ఉన్నారు నాయకులు.

కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి 2018 ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడే జనగామ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరిక్షణంలో పార్టీ టికెట్‌ ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో పొన్నాలకు కూడా ఇబ్బందులు తప్పలేదు. ఆ సమయంలో జరిగిన నాటకీయ పరిణామాలు పొన్నాలకు షాక్‌ ఇచ్చాయనే చెప్పాలి. పైగా 2018 ఎన్నికలే పొన్నాలకు చివరి ఎన్నికలనే ప్రచారం సాగింది. ఆ అంశాలను తవ్వి తీస్తున్నారు. మళ్లీ ప్రచారంలో పెట్టి.. వచ్చే ఎన్నికల్లో పొన్నాలకు టికెట్‌ రాదని ప్రతాప్‌రెడ్డి వర్గం చర్చల్లో పెడుతోందట. పనిలో పనిగా వరంగల్‌ వెస్ట్‌పై కన్నేసిన డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సైతం.. అక్కడ టికెట్‌ రాకపోతే.. జనగామలో అయినా పోటీ చేద్దామని పావులు కదుపుతున్నారట. ఈ క్రమంలోనే జనాల్లోకి వెళ్లేందుకు నాయకులు చేపడుతున్న కార్యక్రమాల్లో చర్చ కన్నా.. రచ్చ రచ్చగా మారుతున్నాయి. నియోజకవర్గంలోని చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, దూల్మిట్ట మండలాల్లో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రచ్చబండ నిర్వహించారు. నర్మెట్ల, తరిగొప్పుల, జనగామ మండలాల్లో పొన్నాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు హోదాలో రాఘవరెడ్డి సైతం రేసులో నేనున్నాను అంటూ గుబులు రేపుతున్నారు. మరి.. వచ్చే ఎన్నికల నాటికి జనగామ జంగ్‌ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version