Site icon NTV Telugu

Srikakulam Politics : ఆ జిల్లాలో ఆయన పదవికే ఎమ్మెల్యే కానీ…పెత్తనం మాత్రం ఎవరిదో..!

Srikakulam

Srikakulam

Srikakulam Politics : వారు సీనియర్ ఎమ్మెల్యేలు. పార్టీలో విధేయత కలిగిన నేతలుగా పేరు. కానీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియెజకవర్గాలలో వారికి ఏ విషయంలోనూ అధికారం ఉండదు. పదవికి ఎమ్మెల్యే అయినా పెత్తనం మాత్రం ఓ ఎమ్మెల్సీ కుటుంబానిదే. ఏదో ఒక నియోజకవర్గంలో ఇలా ఉందనుకొంటే పొరపాటు. 3చోట్ల ఇదే పరిస్థితి. కానీ.. జిల్లాల విభజనతో పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్సీ ఆధిపత్యానికి చెక్‌ పడిందట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలవలస కుటుంబానిది ప్రత్యేక స్థానం. పాలకొండ డివిజన్‌తోపాటు తూర్పుకాపు సామాజికవర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో వాళ్లదే శాసనం. ఆ ఇంటిలో ప్రతిఒక్కరూ ఏదో ఒక పదవి చేపడతారు. తాజాగా పాలవలస విక్రాంత్‌ ఎమ్మెల్సీ అయితే.. ఆయన సోదరి రెడ్డి శాంతి పాతపట్నం ఎమ్మెల్యే. రాజాం, పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో గట్టి పట్టు ఉంది. ఆమదాలవలస, ఎచ్చెర్లలో అనుచరగణం ఉంది. విక్రాంత్‌ తండ్రి రాజశేఖర్‌ వయోభారంతో రాజకీయాలకు దూరంగా ఉండటం.. వారసులు ఆ స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో సీన్‌ రివర్స్‌ అవుతోందట.

జిల్లాల పునర్విభజన తర్వాత పాలవలస కుటుంబ ఆధిపత్యానికి గండిపడినట్టు చెబుతున్నారు. ఒకప్పుడు పాలవలస కుటుంబం గీసిన గీత దాటని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు.. పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు ప్రస్తుతం.. వాళ్ల మాటను లెక్క చేయడం లేదట. పాతపట్నం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుండగా.. రాజాం విజయనగరం జిల్లాలోనూ.. పాలకొండ మన్యం జిల్లాలోనూ కలిసిపోయాయి. పట్టున్న ప్రాంతాలు మూడు జిల్లాల్లోకి వెళ్లిపోవడంతో అక్కడి ఎమ్మెల్యేలు కూడా టోన్‌ మార్చేశారట. కొత్త శిబిరాల పంచన చేరినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు కంబాల జోగులు, కళావతి ఇద్దరూ మంత్రి బొత్స సత్యనారాయణ కోటరీలో కలిసిపోయారట. విజయనగరం, మన్యం జిల్లాల్లో పూర్తి ఆధిపత్యం చెలయించే బొత్స ఎత్తుగడల ముందు ఎమ్మెల్సీ విక్రాంత్‌ వ్యూహాలు తేలిపోతున్నాయట. పాలవలస ఫ్యామిలీ ఆధిపత్యం తెలిసిన బొత్స జిల్లా విభజన జరగ్గానే రాజకీయంగా ఏం జరగాలో తేల్చి చెప్పేశారట. గ్రూపులు లేకుండా.. ఒకరి నియోజకవర్గంలో వేరొకరు వేలు, కాలు పెట్టకుండా ఉండాలని బొత్స సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో జోగులు, కళావతిలకు కొత్త రెక్కలు వచ్చినట్టు అయ్యిందట. గతం కంటే కాస్త భిన్నంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారట. గడప గడప కార్యక్రమంలో పాలవలస నీడ పడకుండా జాగ్రత్త పడుతున్నారట. దాంతో జిల్లా వైసీపీలో కొత్త ఈక్వేషన్లపై చర్చ జరుగుతోంది. సొంతంగా ఓ ఎమ్మెల్యే నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో వాళ్లు ఆస్వాదిస్తున్నారట. జిల్లాలో విభజనలో ఇంకేదో జరుగుతుంది అనుకుంటే తమకు స్వేచ్ఛ లభించిందన్న ఆనందం వారిలో కనిపిస్తోందట.

ఎమ్మెల్యేలు ఫ్లేట్‌ ఫిరాయించడంతో.. పాలవలస కుటుంబం తదుపరి స్టెప్‌ ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఒకప్పుడు పాలవలస రాజశేఖరంలా వారసులు రాజకీయాలు చేయలేకపోతున్నారని.. అందుకే వారి ఎత్తుగడలకు రీసౌండ్‌ ఎక్కువైందని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్సీతోపాటు ఎమ్మెల్యేలు బయట పడకపోయినా.. కలిసి ఉన్న నాయకులు వైరివర్గాలుగా మారిపోయినట్టు పరిస్థితులు.. పరిణామాల ద్వారా కేడర్‌ అర్థం చేసుకుంటోంది. ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నప్పటికీ.. పాలకొండ.. రాజాం నియోజకవర్గాల్లో పాలవలస అనుచరులు మనోగతం ఎలా ఉందన్నది అంతుచిక్కడం లేదట. కేడర్‌ ఇంకా విక్రాంత్‌తో టచ్‌లో ఉంటే.. ఎమ్మెల్యేలకు ఇబ్బందేనని కొందరి వాదన. అలా కాకుండా ఎమ్మెల్యేలతోనే కేడర్‌ ఉంటే ఆ రెండు చోట్ల పాలవలస కుటుంబానికి కనెక్షన్‌ కట్‌ అయినట్టేనని అభిప్రాయపడుతున్నారట. మరి.. కొత్త సౌండ్‌.. ఎలాంటి రీసౌండ్‌ ఇస్తుందో చూడాలి.

 

Exit mobile version