Site icon NTV Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరేనా..!

తెలంగాణలో ఒకేసారి ఏడుగురు పెద్దల సభకు వెళ్లనున్నారు. ఎవరా ఏడుగురనేదే ఇప్పుడు నడుస్తున్న చర్చ. అయితే, హుజురాబాద్ ఫలితం తర్వాత టియ్యారెస్‌ ఎమ్మెల్సీ లెక్కలు మారుతున్నాయనే టాక్‌ ఉంది. దీంతో, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యేదెవరు ? సిట్టింగ్‌ల్లో మళ్లీ ఎవరు? కారు పార్టీలో ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఒకేసారి ఖాళీ అయ్యాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి , కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత పదవీకాలం ముగిసింది.జూన్‌లోనే పదవీకాలం ముగిసినా కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
ఈ ఆరుగురిలో ఒక గుత్తా, కడియంకు మాత్రమే మళ్లీ అవకాశం ఉందనే టాక్‌ నడుస్తోంది.

అయితే, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికే మండలి చైర్మన్‌గా చేశారు. ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లోకి తీసుకుంటారని అయన కోరుకుంటే చివరికిమండలి చైర్మన్‌గా రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు కౌశిక్‌ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పెండింగ్ ఉండటంతో ఆ స్థానంలో గుత్తా పేరు పంపుతారని సమాచారం. కౌశిక్‌ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని క్లీయర్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఎస్సీ కోటాలో ఈసారి ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కడియం శ్రీహరి పేర్లను కేసియార్ పరిశీలిస్తున్నారు. కడియం తెలంగాణ వచ్చాక ఎంపీగా, డిప్యూటీ సియంగా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడంతో మరోసారి ఛాన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. టిఆర్ఎస్‌వీ ప్రెసిడెంట్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉద్యమంలో ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి తనకు ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్. మొత్తం ఏడింటిలో ఇద్దరు ఎస్సీలకు అవకాశం వస్తుందనే టాక్‌ ఉంది. ఒకవేళ ఇద్దరికి కుదురకపోతే వీరిలో ఒకరికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ వచ్చే ఛాన్సుంది.

నాగార్జుసాగర్ ఉప ఎన్నిక సమయంలో టికెట్ కోసం పోటీపడ్డ కోటిరెడ్డికి ఈసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఉందనే టాక్‌ ఉంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న తక్కళ్లపల్లి రవీందర్ రావుకు పెద్దల సభలో అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. బీసీ కోటాలో అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి, టిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్లను పరిశీలిస్తున్నారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన ఒకరికి అవకాశం ఇస్తామని సియం హామీ ఇవ్వడంతో
కర్నాటి విద్యాసాగర్‌ తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ పెద్దల సభలో అడుగుపెట్టడానికి ఎదురుచూస్తున్నారు. కౌశిక్‌ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలోకి మార్చితే దేశపతి తనకు గవర్నర్ కోటాలో ఛాన్స్ వస్తుందని చూస్తున్నారు.

నామినేషన్లకు మరో రెండు రోజలు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ పెరుగుతోంది. సామాజిక సమీకరణాలు, హుజురాబాద్ ఫలితాన్ని అంచనావేస్తున్న కేసియార్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Exit mobile version