Site icon NTV Telugu

T Congress : దసరా వేడుకల్లో కీలక ప్రకటన చేస్తారట.. అప్పటివరకు ఆయన కాంగ్రెస్ కి దూరమే

Jaggareddy

Jaggareddy

తూర్పు జయ ప్రకాష్‌రెడ్డి. ఈ పేరుకంటే జగ్గారెడ్డిగానే అందరికీ పరిచయం ఈ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌. కొద్దిరోజులుగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అంటే కయ్‌ మంటున్నారు. ఇటీవల పార్టీలో క్రమశిక్షణ తప్పిన ఎవరినైనా.. గోడకేసి కొడతానని రేవంత్‌ అనడంతో.. అంతే స్థాయిలో భగ్గుమన్నారు జగ్గారెడ్డి. గోడకేసి కొట్టడానికి నువ్వెవడివి అని నేరుగానే రేవంత్‌కు గురిపెట్టారు. ఆ వివాదం కాంగ్రెస్‌ పొలిటికల్‌ టెంపరేచర్‌ను అమాంతం పెంచేసింది. చివరకు వివాదం అటు తిరిగి.. ఇటు తిరిగి సంచలనం నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి ప్రకటన చేసే వరకు వెళ్లింది. కానీ తూర్పు జగ్గారెడ్డి తుస్‌ మనిపించారు. మీడియాలో స్పేస్‌ కోసమే ఆ విధంగా కామెంట్స్‌ చేసినట్టు చెప్పుకొచ్చారు. కానీ.. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి మధ్య రగడ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? అనేది పెద్ద ప్రశ్న. పైకి నవ్వుతూ కనిపించినా.. ఇద్దరు నాయకులు తెర వెనక ఏదో చేస్తున్నట్టు పార్టీ వర్గాల అనుమానం. ఆ ఎపిసోడ్‌లో అయితే జగ్గారెడ్డిపై చర్యల కోసం రేవంత్‌ పట్టుబట్టినట్టు ప్రచారం జరిగింది.

తాజా ఎపిసోడ్‌ తర్వాత కాంగ్రెస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు జగ్గారెడ్డి. పార్టీ నిర్వహించిన ధరణి రచ్చబండకు.. పీసీసీ కార్యవర్గ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ కార్యక్రమాలకు.. గాంధీభవన్‌కు కూడా దూరంగా ఉండాలని జగ్గారెడ్డి నిర్ణయించారట. దసరా వరకు ఆయన గాంధీభవన్‌ మెట్లు ఎక్కరట. పార్టీ అంతర్గత అంశాలపైనే కాదు.. బీజేపీ, టీఆర్ఎస్‌లపై కూడా మాట్లాడకూదని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. దసరా వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్న సంగారెడ్డిలోనే వరసగా బోనాలు, ఇతర పండగల్లో బిజీ కావాలని షెడ్యూల్‌ వేసేసుకున్నారట. అయితే ఇది జగ్గారెడ్డితో అయ్యే పేనేనా అనేది గాంధీభవన్‌ వర్గాల ప్రశ్న.

వాస్తవానికి జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఏటా దసరా వేడుకలు నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో కీలకమైన నిర్ణయం ప్రకటిస్తారని తాజా చర్చ. ఇటీవల సంగారెడ్డిలో పర్యటించిన సందర్భంగా పార్టీ నాయకులు..అనుచరులకు అదే చెప్పారట. దసరా వేడుకల సమయంలోనే రాజకీయపరమైన కీలక ప్రకటన చేస్తారట. అందుకే దసరా వరకు కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. అయితే దసరా వేడుకల్లో జగ్గారెడ్డి ఏం చెబుతారు? కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతారా? లేక వచ్చే ఎన్నికల్లో పోటీపై ఇంకేదైనా ప్రకటన చేస్తారా? లేక ఎప్పటిలాగే అబ్బే.. అదేం లేదు.. అంతా తూచ్‌ అంటారో అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. జగ్గారెడ్డి ప్రతి అంశంలోనూ ట్విస్ట్‌లు ఉంటాయి. గతంలోనూ ఇలాంటి కామెంట్స్‌ చేయడంతో అటు సస్పెన్స్‌.. ఇటు కామెడీ రెండు మిక్స్‌ అయిపోతున్నాయి. కాకపోతే దసరా డెడ్‌లైన్‌ పెట్టి మరో చర్చకు తెర తీశారు జగ్గారెడ్డి.

Exit mobile version