NTV Telugu Site icon

Korukanti Chander : ఆ ఎమ్మెల్యేకు టెన్షన్ పెరిగిపోయిందా.? హెచ్చరికలు నిద్రలేకుండా చేస్తున్నాయా.?

Mla Korukanti Chander

Mla Korukanti Chander

Korukanti Chander

ఆ ఎమ్మెల్యేకు సీన్‌ సితార్‌ అవుతోందా? వరస వివాదాలు.. ఆరోపణల మధ్య టెన్షన్‌ పడుతున్నారా? హెచ్చరికలు నిద్ర లేకుండా చేస్తున్నాయా? చర్చల్లో ఎమ్మెల్యే హాట్‌ టాపిక్‌గా మారారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది ఎవరు?

పెద్దపల్లి జిల్లా రామగుండం. ఇక్కడి ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక పెద్దగా చర్చల్లో లేకపోయినా.. ఇటీవల కాలంలో వివాదాల చుట్టూ ఆయన పేరు బలంగానే తిరుగుతోంది. ఆయనే చేస్తున్నారో లేక ఎమ్మెల్యే పేరు చెప్పి అనుచరులు చేస్తున్నారో కానీ.. వరస ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతలో ఎమ్మెల్యేకు మావోయిస్టు పార్టీ వార్నింగ్‌ ఇవ్వడంతో సమస్య మరో మలుపు తీసుకుంది. చందర్‌ను మావోయిస్టులు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ఇంతకీ చందర్‌ చేసిన యవ్వారాలేంటి? అని ఆరా తీస్తున్నారట.

ప్రస్తుతం ఎమ్మెల్యే చందర్‌ చుట్టూ అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి రామగుండంలోని RFCL కర్మాగారం. అందులో ఉద్యోగాల పేరు చెప్పి.. ఎమ్మెల్యే అనుచరులు.. దళారులు దాదాపు 45 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారనేది ఆరోపణ. ఆ మొత్తాన్ని నిరుద్యోగులకు తిరిగి చెల్లించాలని మావోయిస్టుపార్టీ లేఖ విడుదల చేసింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే శిబిరం ఉలిక్కి పడుతోందట.

RFCL ఫ్యాక్టరీ 2017లో తిరిగి ప్రారంభం కావడంతో లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ విభాగాల కాంట్రాక్టును బెంగాల్‌కు చెందిన ప్రైవేట్‌ కంపెనీ దక్కించుకుంది. 900 మంది కార్మికులు అవసరం కావడంతో ఆ సంస్థ స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను సంప్రదించిందట. ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుని ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి.. బంధువులు, అనుచరులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వలేదని కొందరు రోడ్డెక్కడంతో సమస్య భగ్గుమంది. మోసపోయామని కొందరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంతో అలజడి రేగింది. ఆ సంఘటలను మావోయిస్టుపార్టీ తమ లేఖలో ప్రస్తావించడం.. అందుకు ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలని చెప్పడంతో రామగుండం ఉలిక్కి పడింది.

RFCLలో ఉద్యోగాల పేరుతో తాను ఎవరినీ మోసం చేయాలేదన్నది ఎమ్మెల్యే చందర్‌ వాదన. ఈ ఆరోపణలపై చర్చకు సిద్ధమని కూడా పలుమార్లు చెప్పారు. అయితే తన చుట్టూ ఉన్న వారిపై ఈ అంశంలో ఆరోపణలు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైరిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ స్కామ్‌లో ఎమ్మెల్యేతోపాటు మరికొందరు ప్రజాప్రతినిధుల పాత్ర ఉందనేది విపక్షాల ఆరోపణ. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిరసనలు చేపట్టాయి. ఇప్పుడు ఏకంగా మావోయిస్టు పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో అందరి చర్చా ఈ అంశంపై పడింది. సమస్య తీవ్రత పెరిగిందనే ఆందోళన ఎమ్మెల్యే శిబిరంలో ఉందట.

మావోయిస్టు పార్టీ నుంచి వార్నింగ్‌ అంటే ప్రజాప్రతినిధులు ఉలిక్కి పడతారు. ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ఇటీవల కాలంలో ఎలాంటి హెచ్చరికలు లేవు. అందుకే చందర్‌ విషయం హాట్ టాపిక్‌ మారింది. మరి..ఈ సమస్యను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఎలా అధిగమిస్తారో చూడాలి.