Site icon NTV Telugu

YCP : అక్కడ అధికార పార్టీ పరిస్థితి నాలుగు స్తంభాలాటగా మారిందా..?

Kurnool Ycp Politics

Kurnool Ycp Politics

కర్నూలు జిల్లాలో అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగించినట్టే కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్‌లోను సత్తా చాటింది. మున్సిపల్ కార్పొరేషన్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు, మేయర్, 52 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఉన్నారు. అంతమంది ఉన్నారు కదా.. పార్టీ బలంగా ఉంటుందని భావించిన కేడర్‌కు చుక్కలు కనిపిస్తున్నాయట. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో నాలుగు స్తంభాలాట సాగుతోంది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, మేయర్ బి వై రామయ్య ఎవరికి వారు కుంపటి రాజేస్తున్నారు.

ఆ మధ్య జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ మీటింగ్‌కు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ వర్గానికి చెందిన 20 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టేశారు. వాళ్లంతా ఎమ్మెల్యే ఆఫీసులో సమావేశమై కౌన్సిల్‌ మీటింగ్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న హఫీజ్‌ఖాన్‌ ఆ సమయంలో అక్కడి నుంచే కథ నడిపించారట. కర్నూలు అసెంబ్లీ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదని మేయర్‌ రామయ్యపై అసంతృప్తితో ఉన్నారట ఎమ్మెల్యే. పాణ్యం నియోజకవర్గానికే ఎక్కువ నిధులు కేటాయించి.. పనులు చేయిస్తున్నారని హఫీజ్‌ఖాన్‌ గుర్రుగా ఉన్నారట. అందుకే ఆయన వర్గానికి చెందిన కార్పొరేటర్లు మీటింగ్‌కు వెళ్లలేదని తెలుస్తోంది. గట్టిగానే నిరసన తెలియజేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

కర్నూలు కార్పొరేషన్‌లో 52 డివిజన్లు ఉండగా.. 8 టీడీపీ, రెండుచోట్ల స్వతంత్రులు గెలిచారు. మిగిలిన చోట వైసీపీ అభ్యర్థులే గెలిచారు. వారిలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ వర్గం 20 మంది కాగా.. ఎమ్మెల్యే కాటసాని వర్గం 16, ఎమ్మెల్యే సుధాకర్‌ వర్గం ముగ్గురు ఉన్నారు. మిగతావాళ్లు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డివర్గంగా కొనసాగుతున్నారు. అంతా అధికారపక్షమే అయినప్పటికీ.. ఒకరంటే ఒకరికి పడక సొంతపార్టీ కార్పొరేటర్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు సైతం కార్పొరేషన్‌పై ప్రభావం చూపిస్తోంది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన మేయర్‌పై ఇలా ఎమ్మెల్యేలే ఆగ్రహం వ్యక్తం చేయడంతో కర్నూలు వైసీపీలో ఆధిపత్యపోరు పీక్స్‌కు చేరుకుంటోంది.

కర్నూలు అభివృద్ధిలో అందరినీ కలుపుకొని వెళ్లడం మేయర్‌ రామయ్యకు కూడా సవాల్‌గా మారిందనేది కేడర్‌ మాట. అంతా మనవాళ్లే ఉంటే.. బలంగా ఉంటుందని.. డెవలప్‌మెంట్‌ వర్క్స్‌ పరుగులు పెడతాయని భావించిన పార్టీ శ్రేణులకు ఈ వర్గపోరు మింగుడు పడటం లేదట. పరిస్థితి ఇలాగే ఉంటే.. రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారట కార్యకర్తలు. ఎమ్మెల్యేలు మాత్రం లెక్క తేడా వస్తే.. తమతో యవ్వారం తేడాగానే ఉంటుందని చెబుతున్నారట. మరి.. సమస్య ముదురు పాకాన పడకుండా ఈ కుంపట్లను పార్టీ పెద్దలు ఎలా చల్లారుస్తారో చూడాలి.

Exit mobile version