మునుగోడు కమలంలో కొత్త, పాత కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరిగిందా? ఎవరికి వారుగా సమావేశాలకు హాజరవుతున్నారా? కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారా? ఉపఎన్నిక వేళ బీజేపీలో కొత్త సంకటం కలవర పెడుతోందా?
కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో తిరిగి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. కానీ.. లోకల్ బీజేపీ నేతల నుంచే ఆయనకు సహాయ నిరాకరణ ఎదురవుతోందట. అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాక.. నియోజకవర్గానికి చెందిన నేతలను బీజేపీలో చేరుస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి తన అనుచరులకు కాషాయ కండువా కప్పేస్తున్నారు. ఆ చేరికలే లోకల్ బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారాయట.
రాజగోపాల్ రెడ్డితోపాటు వచ్చిన వాళ్లకే బీజేపీలో ప్రాధాన్యం ఇస్తున్నారని పాత నేతలు ఆందోళన చెందుతున్నారట. అనేక ఏళ్లుగా బీజేపీలో ఉంటున్నవారికి ఆ పరిణామాలు రుచించడం లేదట. పైగా కొత్తగా చేరేవారి సమాచారం ఇవ్వడం లేదని.. సభలు.. సమావేశాలకు పిలవడం లేదని మండిపడుతున్నారట. పాత నేతలను కలుపుకోవడం లేదనేది పార్టీలో వినిపిస్తున్న మాట. ఎక్కడ సమావేశాలు పెట్టినా అక్కడికి పాత, కొత్త నేతలు వేర్వేరుగా వస్తున్నారట. ఆహ్వానాలు కూడా వేర్వేరుగానే ఉంటున్నాయట. ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తరుణంలో ఈ ఘటనలు కమలనాథులు కలవరపెడుతున్నట్టు సమాచారం.
ఆర్థిక లావాదేవీలతో ఉపఎన్నిక ముడిపడి ఉండటంతో… కొత్త పాత నేతల మధ్య డబ్బు బాగా గ్యాప్ తీసుకొస్తోందట. ఎన్నికలవేళ బాధ్యత మరిచి కార్యకర్తలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా నేతలు వ్యవహరిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారట. నియోజకవర్గానికి సంబందంలేని వ్యక్తులు కీలక భాధ్యతలు నిర్వహిస్తుండటం, ప్రచార కార్యక్రమాలు చేపట్టడం.. చేరికల వద్ద హాడావిడి చేయడం.. కొందరు జీర్ణించుకోలేకపోతున్నారట. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ స్వయంగా హాజరైన బూత్ స్దాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలోనూ గ్రూపులుగా విడిపోయిన నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారట.
మునుగోడు బీజేపీలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని సునీల్ బన్సల్‌తోపాటు.. రాష్ట్ర స్థాయి నాయకులు ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. అసలు సమస్య పరిష్కరించకుండా.. ఇంకేదేదో చేస్తే ఉపయోగం లేదని అనుకుంటున్నారట. స్థానిక నేతలు.. కార్యకర్తలను సమన్వయం చేయడం.. వారికి అన్ని చోట్లా ప్రాధాన్యం కల్పించడం ఎలా అనేదానిపై చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డికి ఇక్కడ కొంత పట్టు ఉంది. ఆయనతో ఇన్నాళ్లూ పార్టీలో ప్రయాణం చేసిన వారికి.. ప్రస్తుతం సరైన గుర్తింపు లేదనే వాదన ఉందట. మరి.. వీటన్నింటికీ పరిష్కారం చూపిస్తూ.. కమలనాథులు ఎలాంటి ముందుకెళ్తారో చూడాలి.