J. C. Diwakar Reddy : ఒకప్పుడు రాజకీయాలు శాసించినా.. కాలం కలిసి రాకో ఏమో ఆయన అస్త్రసన్యాసం చేశారు. దాంతో పెద్దాయన శకం ముగిసిందని అంతా భావించారు. సడెన్‌గా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోసారి తన మార్కు రాజకీయాలకు తెరలేపారనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఎందుకు యాక్టివ్ అయ్యారు?
జేసీ దివాకర్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు చేసిన నాయకుడు. ఒకప్పుడు కనుసైగతో రాజకీయాలను శాసించిన JC.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచారు. మంత్రిగానూ పని చేశారు. చుట్టూ ఎంత మంది ఉన్నా.. తన చేష్టలతో మాట తీరుతో.. అటెన్షన్ తీసుకొస్తారు. స్వపక్షమైనా విపక్షమైన.. ఎదురుగా ఎవరున్నా.. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడేస్తారు దివాకర్‌రెడ్డి. అలాంటి పెద్దాయనకు 2019 ఎన్నికలు షాక్ ఇచ్చాయి. ఆయన కుటుంబానికి ఓటమి మింగుడు పడలేదనే చెప్పాలి. మారిన రాజకీయ పరిణామాలతో పాలిటిక్స్‌కు JC గుడ్‌బై చెప్పేశారని భావించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కడం వల్లో ఏమో.. దివాకర్‌రెడ్డి కూడా మనసు మార్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఆయన యాక్టివ్ అయ్యారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జేసీ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. తమ్ముడు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి జైలుకెళ్లడం.. ఆర్థిక మూలాలపై వరస దెబ్బలు.. ఉక్కిరి బిక్కిరి చేశాయి. టైమ్ బ్యాడ్ అంటూనే రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. హైదరాబాద్ వస్తే కాంగ్రెస్ పాత మిత్రులతో మాటలు కలపడం.. అనుమతి లేకుండానే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడానికి ప్రగతిభవన్‌కు రావడం చేసేవారు. అంతకుమించి జిల్లాలోని టీడీపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. సొంత ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు JC.
ప్రస్తుతం దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే తాడిపత్రిలో చురుకుగా ఉన్నారు. ఏపీలో టీడీపీ గెలిచిన ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రే. అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో ప్రభాకర్‌రెడ్డికి ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. ఇప్పుడు సైలెంట్‌గా ఉన్న దివాకర్‌రెడ్డి సైతం సీన్‌లోకి వచ్చారు. ఆయనకు నియోజకవర్గంతోపాటు జిల్లాపై పట్టు ఉంది. ఎవరిని ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. అందువల్లే రంగంలోకి దిగారని చర్చ సాగుతోంది. ఓడినచోటే గెలవాలన్న కసితో ఉన్నట్టు తెలుస్తోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నవారిని.. ఇప్పటికే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న వారినీ కలిసి మాట్లాడుతున్నారు దివాకర్‌రెడ్డి. తమకు అండగా ఉన్నా వారి ఇళ్లకు వెళ్తున్నారు. వారి ఇంటో ఏ కార్యక్రమం జరిగినా.. హాజరవుతున్నారు జేసీ. పార్టీలతో సంబంధం లేకుండా అందరి ఇళ్లకు వెళ్లి పలుకరిస్తున్నారు.
ఇన్ని రోజులు దూరంగా ఉన్నప్పటికీ ఇక నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటానని గ్రామాల పర్యటనలో చెబుతున్నారట దివాకర్‌రెడ్డి. ముందుగా తమ సొంత మండలమైన పెద్దపప్పూరు నుంచి పెద్దాయన పర్యటన మొదలుపెట్టారు. జేసీ పర్యటనలు చూస్తున్న అనుచరులు, టీడీపీ నేతలు పెద్దాయన మళ్లీ వచ్చాడురోయ్.. ఇక మనల్ని ఎవరూ ఆపలేరంటూ సంబర పడుతున్నారట. అయితే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని కానీ.. ఎన్నికల్లో పోటీ చేస్తానని కానీ ఎక్కడా చెప్పడం లేదు. మరి పెద్దాయన మనసులో ఏముందో ఏమో కాలమే చెప్పాలి.
