Site icon NTV Telugu

Gudivada Amarnath : ఆ మంత్రి సిట్టింగ్ సీట్ వదులుకొని సేఫ్ జోన్ వెతుకున్నారా..?

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath :  వచ్చే ఎన్నికల నాటికి సిట్టింగ్ సీటు వదిలేసుకోవాలని ఆ మంత్రి డిసైడ్ అయ్యారా? సేఫ్ జోన్ వెతుక్కుని అక్కడ రాజకీయ చక్రం తిప్పడం ప్రారంభించారా? ఎమ్మెల్యేపై కేడర్ తిరుగుబాటు వెనుక అసలు కారణం ఇదేనా? మారుతున్న సమీకరణాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకు ఆ మంత్రిగారి ఆలోచనల వెనుక అసలు సంగతేంటి? ఎమ్మెల్యే రియాక్షన్ ఏంటి?

ఎన్నికలకు చాలా ముందుగానే ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ కేంద్రంగా పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. ప్రస్తుతం అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్‌కు ఇటీవల కేబినెట్లో అవకాశం లభించింది. కీలకమైన భారీ పరిశ్రమలు, ఐటీ శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయన కంటే సీనియర్లు చాలామందే ఉన్నప్పటికీ వివిధ సమకీరణాలు ఆయన ఎంపికలో కలిసి వచ్చాయి. నాటి నుంచి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు అమర్నాథ్ పై గుర్రుగానే వున్నారు. అలాగని, హైకమాండ్ నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈ జాబితాలోకి ముందుగా వచ్చేది యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు. వయోభారం.. ఇతర కారణాలతో వచ్చేఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారం ఉంది. హైకమాండ్ స్పష్టంగా చెప్పేసిందని భోగట్టా. ఎమ్మెల్యే సైతం కుమారుడు, మాజీ డీసీసీ చైర్మన్ సుకుమార్ వర్మను కాబోయే అభ్యర్థిగా పరిచయం చేసుకుంటున్నారు. నియోజకవర్గ రాజకీయాల్లో సుకుమార్ వర్మ యాక్టివ్ అవుతున్నారు కూడా. ఇక్కడి నుంచే రాజకీయం మలుపు తిరిగింది.

వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి వదిలి పొరుగునే ఉన్న యలమంచిలిలో పోటీకి దిగాలని మంత్రి అమర్నాథ్ భావిస్తున్నారట. ఇటీవల అధినాయకత్వం ఎదుట తన మనసులో మాటను చెప్పి పరిశీలించమని కోరినట్టు సమాచారం. కాపు,గవర సామాజికవర్గం గెలుపు ఓటములను నిర్ధేశించే యలమంచిలిలో ప్రస్తుతం వైసీపీకి పట్టుంది. స్థానిక ఎన్నికల్లో మున్సిపాలిటీ సహా ఎంపీటీసీలను క్లీన్ స్వీప్ చేసేసింది. మంత్రిగా ఇటీవల యలమంచిలి నియోజకవర్గంలో అమర్నాథ్ కార్యకలాపాలు పెరిగాయి.

అనకాపల్లిలో అమర్నాథ్‌కు చిక్కులు లేకపోలేదు. ఇక్కడ కాపు సామాజికవర్గం ఓటింగ్ మెజార్టీ అయినప్పటికీ డిసైడింగ్ ఫ్యాక్టర్ గవర్లు. గత ఎన్నికల్లో అమర్నాథ్‌కు అన్ని వర్గాల మద్దతు లభించింది. మాజీమంత్రి దాడి వీరభద్రరావు పనిచేయడం, గవర సామాజిక వర్గానికి చెందిన భీశెట్టి సత్యవతికి ఎంపీగా అవకాశం కల్పించడం కలిసొచ్చింది. ఆ తర్వాత దాడి వర్గం, సత్యవతమ్మలతో మంత్రికి గ్యాప్ వచ్చింది. దానిని తగ్గించుకోవడానికి సత్యవతమ్మతో సయోధ్యకు వచ్చారు అమర్. ఇటీవల ప్రతీ సభలోనూ ఎంపీ తన తల్లిలాంటి వారని చెప్పుకోవడం ద్వారా సెంటిమెంట్ పండిస్తున్నారు. కాని దాడి వర్గంతో మంత్రికి ఉన్న దూరం తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ను దాడి కుమారుడు రత్నాకర్ ఆశిస్తున్నారు.

యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కన్నబాబు రాజుపై సొంత నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రాంబిల్లితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం చర్చగా మారింది. ఈ ఆరోపణలు, విమర్శలు వెనక మంత్రి అమర్‌నాథ్‌ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది యలమంచిలి నేతలతో మంత్రి టచ్‌లో ఉన్నారట. సమస్యలు, ఇబ్బందులు ఉంటే చెప్పాలంటూ అప్పుడప్పుడు మంత్రి పర్యటనలు చేస్తున్నారట. అందుకే మంత్రి అమర్‌నాథ్‌.. యలమంచిలి టికెట్‌ ఆశిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇక్కడ కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం, గవర కార్పొరేషన్ చైర్మన్ ఇదే ప్రాంతానికి చెందినవారు కావడంతోపాటు.. అమర్‌నాథ్‌కు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారట. కాని సిట్టింగ్‌ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాత్రం గుర్రుగా ఉన్నారట. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న యలమంచిలి సీటు మంత్రి అమర్నాథ్ కు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మరి.. మంత్రి అడుగులు ఎటు పడతాయో చూడాలి.

 

Exit mobile version