గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి.. స్వల్ప తేడాతో ఓడిన ఆ నాయకుడు.. తాజాగా జంప్ కొట్టడం వెనక మాస్టార్ ప్లాన్ ఉందా? ఏకంగా సీఎం జిల్లాకు చెందిన నాయకులతో లాబీయింగ్ చేస్తున్నారా? ఆయన ఎవరికి ఎర్త్ పెడుతున్నారు? ఇంకెవరికి ఛార్జింగ్ ఇస్తున్నారు? ఇంతకీ ఎవరా నాయకుడు?
మంగళగిరి రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. అప్పట్లో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై టీడీపీ, వైసీపీల మధ్య ఉద్రికత్తలకు దారితీస్తే.. తాజాగా గంజి చిరంజీవి టీడీపీకి గుడ్‌బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చిరంజీవి.. 12 ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయనే టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నప్పటికీ.. 2019లో టికెట్ ఇవ్వలేదు. నారా లోకేష్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల చేతిలో 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు లోకేష్. ప్రస్తుతం మంగళగిరి టీడీపీ వ్యవహారాలను లోకేషే చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పారు కూడా. దీంతో టీడీపీలో తనకు రాజకీయ భవిష్యత్ లేదని భావించారో ఏమో గంజి చిరంజీవి సైకిల్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. అయితే ఇందులోనూ పెద్ద మాస్టార్ ప్లాన్ ఉందనే చర్చ నడుస్తోంది.
మంగళగిరిలో మరోసారి లోకేష్ ఓటమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది వైసీపీ. మాజీ ఎమ్మెల్యేలు కాండ్రు కమల, మురుగడు హనుమంతరావులు ఫ్యాన్ గాలి కిందకు వచ్చేశారు. ఇప్పుడు చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవి వంతు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ బీసీలకు టికెట్ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆ సమీకరణాల్లో భాగంగానే చిరంజీవి టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు అనుమానిస్తున్నారట. ఏకంగా సీఎం సొంత జిల్లాకు చెందిన ఓ నేత ద్వారా చిరంజీవి రాయబారం నడిపినట్టు ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే వైసీపీలోకి వస్తానని చిరంజీవి చెప్పడంతో.. ముందు కండువా కప్పుకోండి.. అన్నీ తర్వాత చూద్దాం అని సదరు అధికార పార్టీ నేత బదులిచ్చారట. దాంతో చిరంజీవి వైసీపీ కండువా కప్పుకోవడం లాంఛనమే అన్నది రాజకీయ వర్గాల మాట. అయితే నిజంగానే చిరంజీవికి మంగళగిరి టికెట్‌పై గట్టి హామీ లభించిందా? అదే నిజమైతే ఆర్కే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మంగళగిరిలో ఎమ్మెల్యేకు వ్యతిరేకత ఉందని అప్పుడే కొందరు ప్రచారం మొదలు పెట్టేశారు కూడా. అలాగే చిరంజీవి వెళ్లిపోవడంతో టీడీపీకి కలిగే నష్టంపైనా లెక్కలతో కుస్తీ పడుతున్నారట. మొత్తానికి ఒకరి రాజీనామా అధికార పార్టీలోనూ.. విపక్ష టీడీపీలోనూ పెద్ద చర్చకే దారితీసింది. మరి.. గంజి చిరంజీవి అడుగులు ఎటు పడతాయో చూడాలి.