Ongole Bar online tenders : మద్యం టెండర్లు అంటేనే సిండికేట్లు చక్రం తిప్పుతాయి. బార్ లైసెన్సుల విషయంలోనూ బలమైన లాబీయింగ్ పనిచేస్తుంది. ఆ జిల్లాలో అదే జరిగింది. కమీషన్ల కిక్కు స్ట్రాంగ్‌గానే ఉందట. కాకపోతే మా సంగతేంటి అని కొత్త వాళ్లు సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతోందట. అదేంటో.. ఎక్కడో.. ఈ స్టోరీలో చూద్దాం.
ఎక్సైజ్ అధికారులు టెండర్లు పిలిచారు. ఒంగోలు నగరంలోనే 15 బార్స్ ఉంటే.. జిల్లాలో మరో పది ఉన్నాయి. జిల్లాలోని బార్స్ లైసెన్స్‌లను చేజిక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. ఆన్‌లైన్ ఆక్షన్ కోట్ల రూపాయల వరకు వెళ్లింది. గతంలోకంటే ఆదాయం రెట్టింపు సమకూరడంతో ఎక్సైజ్ అధికారులు ఫుల్ హ్యాపీ. ఒంగోలు నగరంలోని 15 బార్స్ లైసెన్సుల దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్. ప్రభుత్వం నిర్దేశించిన కనీస ధరకు అటూఇటూగానే టెండర్లు వేశారు. అదీ ఒక బార్‌కు ఒక దరఖాస్తే వచ్చింది. మొత్తంగా తక్కువ ధరకే ఒంగోలులోని 15 బార్స్‌ను వ్యాపారులు దక్కించుకున్నారు. ఈ విషయంలో పెద్దస్థాయిలో మాయాజాలం జరిగిందట. దానిపైనే ప్రస్తుతం హాట్ టాపిక్.
టెండర్లు అన్నీ ఆన్‌లైన్‌లో చేపట్టారు. అంతా పారదర్శకంగా జరుగుతుందని ప్రకటించినా.. ఒంగోలులో స్పందన చూశాక రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. ఒక బార్ కోసం ఎంతకు టెండర్ వేశారనేది ఎక్సైజ్ అధికారులకు తెలుస్తుందని చెబుతున్నారు. ఆ విధంగా లీకులు ఇవ్వడం వల్లే సిండికేట్ చక్రం తిప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశావహులను రానివ్వకుండా జాగ్రత్త పడ్డారట. సిండికేట్‌లోని ఓ వైసీపీ నేత చాలా కీలకంగా పనిచేశారట. అందుకే గతంలో ఒంగోలులో బార్స్‌ను నిర్వహించిన వ్యాపారుల్లో 95 శాతం మంది తిరిగి లైసెన్సులు దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక బార్‌కు ఒకరే టెండర్ వేయడంపై ఎక్సైజ్ అధికారులు స్పందించడం లేదు. అంతా రూల్ ప్రకారమే జరిగిందని చెబుతున్నారు. దర్శి, పొదిలి, చీమకుర్తి వంటి రూరల్ ప్రాంతాల్లో కోట్లకు వెళ్లిన టెండర్లు.. ఒంగోలు నగరంలో ఎందుకు డీలా పడ్డాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఒంగోలులోని బార్స్‌లో రెండు భాగాలుగా వైసీపీ.. ఒక భాగం టీడీపీ నేతలకు అని ముందే ఒప్పందం జరిగిందట. ఆ విధంగానే టెండర్లు వేశారట. ఇంకెవరూ పోటీకి రాకుండా సిండికేట్‌లోని వైసీపీ, టీడీపీ నేతలు సమన్వయం చేసినట్టు తెలుస్తోంది. ఇక కమీషన్ల విషయానికి వస్తే.. బేసిక్ ప్రైస్‌కు లైసెన్స్ పొందిన వ్యాపారులు ఒక్కో బార్‌కు 40 లక్షలు చొప్పున కమీషన్ ఇవ్వాలని.. ఆ మొత్తంలో 80 శాతం నేతలకు.. 20 శాతం ఎక్సైజ్ సిబ్బందికి ఇవ్వాలనే ఒప్పందాలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. వ్యాపారుల నుంచి ఆ మొత్తాన్ని రెండురోజుల్లో వసూలు బాధ్యత ఎక్సైజ్ అధికారులపై పెట్టడంతో.. అది తమ పనికాదని వాళ్లు పక్కకు తప్పుకొన్నట్టు సిండికేట్ వర్గాలు చెబుతున్నాయి.
లైసెన్స్ పొందిన వ్యాపారులకు కొత్త చిక్కొచ్చి పడిందట. పైవాళ్లంతా వాటాలు పంచుకున్నారు సరే.. ఫీల్డ్‌లో ఉండే మా సంగతి ఏంటి అని కొందరు మున్సిపల్ కార్పొరేటర్లు ప్రశ్నలు సంధిస్తున్నారట. మా ఏరియాల్లో వ్యాపారాలు చేసుకునే వారి మంచి చెడ్డలు మేమే చూడాలి.. అక్కడేదైనా గొడవ జరిగితే పరిష్కరించాలి.. అందుకే నెలనెలా తమకూ మామూళ్లు ఇవ్వాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారట. ఎప్పుడూ లేనిది ఈ కొత్త పితలాటకం ఏంటని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నట్టు సమాచారం. కీలక నేతలకు ఇచ్చే 40 లక్షల కమీషన్‌కు తోడు కార్పొరేటర్లకు ట్యాక్స్ కట్టాలంటే వ్యాపారాలు చేసుకోలేమని లైసెన్స్ పొందిన వాళ్లు వాపోతున్నారట. ఇలా అయితే వ్యాపారాలు చేయలేమని సిండికేట్ ప్రతినిధుల దగ్గర కుండబద్దలు కొట్టేస్తున్నారట. ఈ సమస్యపై ఒంగోలులో కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. మొత్తానికి టెండర్లలో మాయాజాలం.. కమీషన్ల కిక్కు కోసం అంతా ఆర్రులు చాచడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.
