Site icon NTV Telugu

అన్నవరం ఆలయంలో కొత్త రగడ !

అన్నవరం ఆలయంలో రెండు దశాబ్దాలుగా ఆయన చెప్పిందే వేదమట. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నా.. ఆయన మాటకు తిరుగే లేదట. రిటైరైన మరుసటిరోజే కొత్త పదవి చేపట్టి.. పెత్తనం చేయడానికి వస్తున్నారని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ రత్నగిరి కొండపై ఈ కొత్త రగడ ఏంటి?

వ్రత పురోహితులకు కామేశ్వరరావు చెప్పిందే వేదం

ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఉద్యోగులతోపాటు.. అర్చకులు.. పురోహితులు.. సిద్ధాంతులు.. ఇలా ఎంతో మంది.. ఎన్నో విభాగాలు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలోనూ ఇలాంటి వ్యవస్థలే ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణస్వామి వ్రతాలకు ప్రసిద్ధి. అందువల్ల ఇక్కడ ప్రత్యేకంగా వ్రత పురోహితులు అనే వ్యవస్థ ఉంటుంది. వ్రత పురోహితుల సంఖ్య దాదాపు 250 పైమాటే. వీరిలో ఒకరు నాగభట్ల కామేశ్వరరావు. వ్రత పురోహితులకు ఆయన ఎంత చెబితే అంతట. గత 20 ఏళ్లుగా ఆయన చెప్పిందే వేదం.. శాసనమని టాక్‌. కామేశ్వరరావుకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదట. రత్నగిరికి కొత్తగా ఏ అధికారి వచ్చినా మచ్చిక చేసుకోవడంలో నేర్పరిగా ఆయనకు పేరుందట. ఆయనపై ఆరోపణలు కూడా అదేస్థాయిలో ఉన్నాయని చెబుతారు.

read also : తెలంగాణలో కేసీఆర్ ను కనుమరుగు చేస్తాం : బండి సంజయ్

అన్నవరం వైదిక సలహాదారుగా కామేశ్వరరావు?
సస్పెండ్‌ చేస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకుని కొనసాగుతున్నారా?

జూన్‌ 30తో కామేశ్వరరావు రిటైర్‌ అవుతుండటంతో ఆయనంటే గిట్టని వారు సంతోషించారు. కానీ.. ఏం జరిగిందో ఏమో.. అన్నవరం ఆలయంలో వైదిక సలహాదారుగా కొత్త పోస్టులో మరో ఐదేళ్లపాటు పదవీయోగం పొందినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో పాలకవర్గాలు.. అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచారన్నది ఉద్యోగ వర్గాలు చేసే ఆరోపణ. ఈ సందర్భంగా గతంలో కామేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలను తవ్వి తీస్తున్నారు. కామేశ్వరరావుపై 2010లో వచ్చిన ఆరోపణలపై అప్పటి అన్నవరం ఈవో రామచంద్రమోహన్‌ విచారణ చేసి సస్పెండ్‌ చేశారు. ఆయన గుత్తాధిపత్యానికి చెక్‌ పెట్టి వ్రతపురోహితులకు స్వేచ్ఛ ఇచ్చారని ఆలయ వర్గాలు ఇప్పటికీ చెప్పుకొంటాయి. అయితే తనను సస్పెండ్‌ చేసే అధికారం ఈవోకు లేదని నాడు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారట కామేశ్వరరావు. ఇక లాభం లేదనుకొని కొందరు పురోహితులు ఆయనపై లోకాయుక్తతోపాటు మానవహక్కుల కమిషన్‌లోనూ పిటిషన్లు వేశారని చెబుతారు.

రిటైర్‌ అయిన మరుసటి రోజే కొత్త పోస్టు?
దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. రిటైర్‌ అయ్యాక ఏ విధంగా వైదిక సలహాదారుగా నియమిస్తారన్నది అన్నవరం ఆలయంలో ఓ వర్గం వేసే ప్రశ్న. గడిచిన పాలకమండలి సమావేశంలో కామేశ్వరరావును వైదిక సలహాదారుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పుపడుతున్నారట. వైదిక సలహాదారు అంటే.. ఆ రంగంలో నిష్ణాతులై ఉండాలన్నది వారి వాదన. ఆరోపణలు.. కోర్టు కేసులు పెండింగ్‌ ఉన్నప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పదవి కట్టబెట్టడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారట. కొన్ని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు సైతం ఈ అంశంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారట. మొత్తానికి ఎవరి వాదనలో ఎంత పస ఉందో కానీ.. అన్నవరం సత్యనారాయణ స్వామి కొలువైన రత్నగిరి కొండపై కొత్త రగడ కలకలం రేపుతోంది.

Exit mobile version