Site icon NTV Telugu

ఓరుగల్లు టీఆర్‌ఎస్‌లో ముదిరిన ఆధిపత్యపోరు..!

అసలే ఓరుగల్లు. అక్కడ అధికారపార్టీ నేతలంతా పోరుకు కాలుదువ్వేవాళ్లే. ఒకరిపొడ ఇంకొకరికి గిట్టదు. ఇందుకు పండగలను వాడేసుకున్నారు. మా తీరు ఇంతే అని ఇంకోసారి రుజువు చేశారు. పార్టీలో చర్చగా మారారు. వారెవరో.. ఏంటో ఇప్పుడు చూద్దాం.

బతుకమ్మ, దసరా ఉత్సవాల్లోనూ ఆధిపత్యపోరే..!

బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, ఎంపీ మాలోతు కవిత మధ్య.. వరంగల్‌లో ఎమ్మెల్యేలు, మేయర్‌ మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న గొడవలు కళ్లకు కట్టాయి. తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు పండగలను ఓ రేంజ్‌లో వాడేసుకున్నారు నాయకులు. ఫ్లెక్సీలు కట్టడం దగ్గర మొదలుపెట్టి.. రావణ వధ వరకు నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ తమ ముద్ర కనిపించేలా వ్యూహరచన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనలే అధికార పార్టీలో చర్చగా మారాయి.

ఫ్లెక్సీల చించివేతపై శంకర్‌నాయక్‌, మాలోతు కవిత వర్గాల ఘర్షణ..!

మహబూబాబాద్‌లో సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎంపీ మాలోతు కవిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అనుచరులు వాటిని పీకిపడేశారు. రెండు వర్గాల మధ్య ఈ ఎపిసోడ్‌ తోపులాటకు దారితీసింది. ఉద్రిక్తతకు కారణమైంది. పోలీసులు ఎంట్రీ తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు వెనక్కి తగ్గాయి. మొదటి నుంచీ శంకర్‌నాయక్‌, కవిత మధ్య ఆధిపత్యపోరు ఉంది. ఒకరి పొడ ఇంకొకరికి గిట్టదు. అది సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఫ్లెక్సీల చించివేత రూపంలో బయటపడింది.

వరంగల్‌లో మేయర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే నరేందర్‌..!

ఇక గ్రేటర్‌ వరంగల్‌ టీఆర్ఎస్‌లో నేతల మధ్య విభేదాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. తమ మధ్య ఎంతో అన్యోన్యత ఉన్నట్టు కార్యక్రమాల్లో నటిస్తారు. స్టేజీ దిగగానే కత్తులు నూరుకుంటారు నాయకులు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీరుపై అధిష్ఠానానికి ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, నన్నపపేని నరేందర్‌, చీఫ్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌లు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. మేయర్‌ గుండు సుధారాణి, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు అస్సలు పడటం లేదట. ఎమ్మెల్యేలు వచ్చే వీలులేకుండా చూసి.. మంత్రిని పిలిచి దసరా ఉత్సవాలను కానిచ్చేశారట సుధారాణి. ఉత్సవాలకు నిధుల విడుదల.. కార్యక్రమాల నిర్వహణలోనూ ఆధిపత్యపోరు ప్రభావం కనిపించిందట. మేయర్‌ వెళ్లిన చోటుకు ఎమ్మెల్యే నరేందర్‌ వెళ్లలేదట.

నేతల తీరుపై గులాబీ కేడర్‌లో ఆందోళన..!

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య దసరా ఉత్సవాల్లో లిమిటెడ్‌గానే కనిపించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, సీనియర్‌ నేత రెడ్యానాయక్‌ల మధ్య దసరా పండగ ఆధిపత్యపోరును రాజేసింది. మంత్రులను పిలిచినా.. మంత్రుల దగ్గరకు వెళ్లిన తనకు ప్రాధాన్యం తక్కదని భావించారో ఏమో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సైతం అందరికీ దూరం పాటించారు. కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్యలది ఇదే తంతు. టీఆర్ఎస్‌ పరంగా పార్టీ పదవులు.. ప్రభుత్వంలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీకి కసరత్తు జరుగుతున్న సమయంలో కీలక నాయకుల తీరు కేడర్‌కు మింగుడు పడటం లేదట. తమకొచ్చే అవకాశాలు ఎక్కడ చేజారిపోతాయోనని ఆందోళన చెందుతున్నారట. తాజా గొడవలు సైతం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లాయట. మరి.. సమస్యల సర్దుబాటుకు వారే మంత్రం వేస్తారో చూడాలి.

Exit mobile version