Site icon NTV Telugu

ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న మాజీ మంత్రి….?

రెండు దశాబ్దాలపాటు రాజకీయాల్లో చక్రం తిప్పితే ఏం లాభం..? ఒకే ఒక్క ఓటమితో పొలిటికల్ తెరపై నుంచి ఆ మాజీ మంత్రి గాయబ్‌. తిరిగి పుంజుకోవాలని.. లైమ్‌లైట్‌లోకి రావాలని ఆయన చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పుడేమో భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. ప్రస్తుతం ఉన్నచోటే ఉండాలో.. పాత పార్టీలోకి వెళ్లాలో లేక.. సింహాన్ని నమ్ముకోవాలో తెలియక సతమతం అవుతున్నారట. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి?

రాజకీయంగా ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్‌ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ నాయకుడు జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. చేతిలో పదవి ఉన్నన్నాళ్లూ ఓ వెలుగు వెలిగారు జూపల్లి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌లో జూపల్లి ఓడిపోయారు. పొలిటికల్ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. జూపల్లిపై గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి తర్వాత టీఆర్ఎస్‌లో చేరాక కొల్లాపూర్‌ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. అప్పటి వరకు నియోజకవర్గంలో ఆధిపత్యం చాటిన ఈ మాజీ మంత్రి ఉనికిని కాపాడుకునే పనిలో పడ్డారు. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారట.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టారా?

కొల్లాపూర్‌లో టీఆర్ఎస్‌ జూపల్లి, హర్షవర్ధన్‌రెడ్డి వర్గాలుగా చీలిపోయింది. పంచాయతీ, పరిషత్‌, మున్సిపల్ ఎన్నిలకల్లో ఆ వర్గపోరు ప్రభావం అధికారపార్టీపై పడింది. తన వర్గం ప్రయోజనాలను కాపాడటంలో మాజీ మంత్రి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో తన వర్గాన్ని ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి సింహం గుర్తుపై పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు జూపల్లి. తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ.. కేడర్‌లో పట్టు సడలకుండా చూసుకుంటున్నారు కూడా. ఈ క్రమంలోనే తన బలాన్ని చూసి.. టీఆర్ఎస్‌ పెద్దలు నామినేటెడ్‌ పదవో.. ఎమ్మెల్సీనో ఇస్తారని భావించారట. మూడేళ్లు అవుతున్నా.. అలాంటి ముచ్చటే లేదు. ఇక లాభం లేదని అనుకున్న ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టారట. మరోసారి అసెంబ్లీలో అడుగుపెడితే తప్ప రాజకీయ భవిష్యత్‌ ఉండబోదనే నిర్ణయానికి వచ్చారట.

కాంగ్రెస్‌లోకి వెళ్దామని అనుచరుల ఒత్తిడి..!

జూపల్లి టీఆర్ఎస్‌లోనే ఉంటారని చెబుతూనే.. కాంగ్రెస్‌, బీజేపీలు మాజీ మంత్రికి గాలం వేసినట్టు అనుచరులు లీకులు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ టికెట్‌ జూపల్లికే అని పైకి ధీమాగా ఉన్నప్పటికీ.. ఎక్కడో తేడా కొడుతోందట. బీజేపీలోకి వెళ్దామని అనుకుంటే.. DK అరుణతో ఉన్న రాజకీయ వైరం అడ్డు పడుతోందట. అందుకే కాషాయ గూటికి వెళ్లబోరని ప్రచారం జరుగుతోంది. ఇదే టైమ్‌లో మాజీ మంత్రి చూపు కాంగ్రెస్‌పై ఉందనే చర్చ నడుస్తోంది. గౌరవం లేనిచోట ఉండటం కంటే కాంగ్రెస్‌లో చేరితే భవిష్యత్‌ బాగుంటుందని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారట.

తిరుగుబాటు అభ్యర్థిగా సింహం గుర్తును నమ్ముకుంటారా?

టీఆర్ఎస్‌లో టికెట్‌ వచ్చే పరిస్థితులు లేకపోతే.. బీజేపీ, కాంగ్రెస్‌లలో చేరికకు ఆటంకాలు ఎదురైతే.. ప్రత్యామ్నాయాలు కూడా జూపల్లి ఆలోచిస్తున్నారట. మున్సిపల్‌ ఎన్నికల్లో అనుచరులను గెలిపించిన సింహం గుర్తునే నమ్ముకుని.. తిరుగుబాటు అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో దిగే యోచనలో ఉన్నట్టు జూపల్లి శిబిరం నుంచి వినిపిస్తున్న టాక్‌. ఎమ్మెల్యేగా గెలిస్తే అప్పటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందామని చర్చ నడుస్తోందట. మరి.. రాజకీయ భవిష్యత్‌కు ఈ మాజీ మంత్రి ఏ దారి ఎంచుకుంటారో చూడాలి.

Exit mobile version