Dr BR Ambedkar Konaseema District : ఆ జిల్లాలో మంత్రులు మధ్య అసలు పొసగడం లేదా? జూనియర్ మంత్రి డామినేషన్ చేస్తున్నారని సీనియర్ మంత్రి చికాకు పడుతున్నారా? ఎవరి వర్గాలను వారు ప్రోత్సహిస్తూ పొలిటికల్ హీట్ క్రియేట్ చేస్తున్నారా? పెత్తనం కోసం పాకులాడుతూ పరేషాన్ అవుతోంది ఎవరు?
అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఏపీ కేబినెట్‌లో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. పినిపె విశ్వరూప్ తొలి కేబినేట్‌లోనే ఛాన్స్ దక్కించుకోగా.. మార్పులు చేర్పులలో సైతం తన బెర్త్‌ను పదిలం చేసుకున్నారు. ఆఖరి నిమిషం వరకు విశ్వరూప్ పేరు ఊగిసలాడినా ఆయన సీటుకు ఢోకా లేకుండా పోయింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో చెల్లుబోయిన వేణు అనూహ్యంగా కేబినెట్లో స్థానం సంపాదించారు. ఆ తరువాత జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలోనూ వేణుది సేఫ్ ప్లేసే. ఇద్దరూ ఒకే జిల్లాకు.. ఒకే పార్టీకి చెందిన నాయకులే అయినా ఒకరంటే ఒకరికి పడటం లేదట. ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డెం అంటున్నారట.
జిల్లాలో ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నారట మంత్రులు. వ్యవహారాలు చక్కబెట్టేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదట. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా.. వెనక మాత్రం లోతుగానే గోతులు తీసుకుంటున్నారట. సీనియర్ మంత్రి అయిన తనను వేణు పరిగణనలోకి తీసుకోవడం లేదని విశ్వరూప్ గుర్రుగా ఉన్నారట. తనకు సమాచారం ఇవ్వకుండా జిల్లా స్థాయి సమావేశాలు.. వరదలపై రివ్యూలు చేయడంపై విశ్వరూప్ ప్రశ్నిస్తున్నారు. దానికి వేణు వర్గం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోందట. ఆయన పనిచేయరు.. పనిచేసేవాళ్లను చేయనీయకపోతే ఎలా అని విశ్వరూప్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారట. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తే.. అక్కడ మంత్రి వేణు ఓవర్ చేశారని మంత్రి విశ్వరూప్ గుర్రుగా ఉన్నారట.
అమలాపురం అల్లర్లు తర్వాత విశ్వరూప్ జిల్లాలో పెద్దగా కనిపించడం లేదు. వచ్చినా నియోజకవర్గం దాటి బయటకు వెళ్లడం లేదు. జిల్లా వైసీపీ ప్లీనరీ అమలాపురంలో నిర్వహించే విషయంలోను ఆయన ఎక్కడ బయట పడలేదు. చివరికి తన సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేశారు వేణు. ఆ కార్యక్రమంపైనా మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయట. మున్సిపల్ ఎన్నికల్లో అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కడుపూడి చిట్టబ్బాయి కోడల్ని ఎంపిక చేసింది వైసీపీ అధిష్ఠానం. అయితే నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ వస్తుందని విశ్వరూప్ ఆమెను ఓడించారని ప్రచారం జరిగింది. దానిపై వైసీపీ హైకమాండ్‌కు వేణు ఫిర్యాదు చేశారట. ఆ తర్వాత పార్టీ ఆమెకి నామినేటెడ్ పదవి ఇచ్చింది. దానినీ అడ్డుకునేందుకు విశ్వరూప్ ప్రయత్నించారనేది వేణు వర్గం ఆరోపణ.
కుడుపూడి చిట్టబ్బాయి, మంత్రి వేణు ఒకటే సామాజికవర్గం. ఆ కోణంలో వేసిన ఎత్తుగడలు కూడా మంత్రుల మధ్య దూరం తెచ్చినట్టు టాక్. అమలాపురం అల్లర్లలో వైసీపీకి చెందిన తన సామాజికవర్గం వారికి వేణు అండగా ఉంటున్నారనేది విశ్వరూప్ వర్గం ఆరోపణ. అలాగే జిల్లాలో ఒకరు చెప్పిన పనులు మరొకరు అడ్డుకోవడానికి మంత్రులు ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఎవరి రాజకీయాలు వారు ప్లే చేస్తూ తలనొప్పులు తెస్తున్నారని జిల్లాలో అధికారులు.. ప్రజాప్రతినిధులు వాపోతున్నారట. మరి మంత్రుల మధ్య చిటపటలకు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో చూడాలి.