NTV Telugu Site icon

Alla Ramakrishna Reddy : ఆ మార్పు ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందా..?

Alla Rama Krishna Reddy

Alla Rama Krishna Reddy

Alla Ramakrishna Reddy : ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి కంటే రెండోసారి గెలుపు సంచలనం సృష్టించింది. ఇప్పుడు మాత్రం నియోజకవర్గంలో సామాజికవర్గం లెక్కలు మారుతున్నాయి. ఆ మార్పు ఎమ్మెల్యేకు కొత్త చిక్కులు తెచ్చిపెడతాయా? పెరిగిన అసమ్మతి నేతల స్వరం ప్రమాద ఘంటిక మోగిస్తోందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? లెట్స్‌ వాచ్‌..!

ఆళ్ల రామకృష్ణారెడ్డి. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే. రెండు దఫాలుగా ఈ నియోజకవర్గంలో వైసీపీదే గెలుపు. కేవలం ఆ విజయంతో సరిపెట్టకుండా మంగళగిరిపై పూర్తిస్థాయిలో పట్టుబిగించేందుకు అధికార పార్టీ మూడేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఆపరేషన్‌ ఆకర్షకు అనేక మంది కీలక నేతలు చిక్కారు కూడా. మంగళగిరిలో చేనేత సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. గెలుపోటముల్లో వారిదే కీలకపాత్ర. అందుకే ఆ సామాజికవర్గం పై ఎక్కువ ఫోకస్‌ పెట్టింది వైసీపీ. గతంలో మంగళగిరి ఎమ్మెల్యేలుగా ఉన్న మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల వైసీపీ గూటికి వచ్చేశారు. తాజాగా 2014లో ఆళ్లకు గట్టి పోటీ ఇచ్చిన గంజి చిరంజీవి సైతం అధికార పార్టీకి జైకొట్టేశారు. ఇదే వర్గానికి చెందిన మరో కీలక నేత చిల్లపల్లి మోహన్‌రావు కూడా వైసీపీలోనే ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ చేరికలు మంగళగిరిలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే ఆళ్ల సీటుకు ఎసరు పెట్టొచ్చన్నది ఆ ప్రచారంలో భాగం.

మంగళగిరిలో వైసీపీ బీసీలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో.. వచ్చే ఎన్నికల్లో ఆ వర్గానికే టికెట్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరి వాదన. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయాలనే ఆలోచనతోనే మురుగుడు హనుమంతరావు వైసీపీలో చేరారనే ప్రచారం ఉంది. ఒకవేళ తనకు పోటీ చేసే అవకాశం లేకపోతే ఆయన వియ్యపురాలు కాండ్రు కమలకు ఛాన్స్‌ ఇస్తారని లెక్కలేస్తున్నారట. ఇప్పుడు గంజి చిరంజీవి చేరడంతో పోటీకి సిద్ధంగా ఉన్న బీసీ నేతల సంఖ్య పెరిగినట్టు అభిప్రాయ పడుతున్నారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్లకు .. సొంత పార్టీలోని ఓ వర్గం నుంచి అసమ్మతి ఉందని ప్రచారం సాగుతోంది. తాడేపల్లి మండలానికి చెందిన ఆ సామాజికవర్గం నేతలు ఎమ్మెల్యేతో తీవ్రంగానే విభేదిస్తున్నారట. ఆ మధ్య యూ వన్‌ రిజర్వ్‌ జోన్‌ నిబంధన తొలగించాలని తాడేపల్లిలో రైతులు 149 రోజులు దీక్షలు చేశారు. గతంలో ఈ సమస్య పరిష్కారానికి మద్దతు తెలియజేసిన ఆర్కే.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారట. పైగా తాడేపల్లికి చెందిన ఇద్దరు వైసీపీ నేతలు రైతుల సమస్యను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. ఆపై రైతులు ఆందోళన విరమించారు. ఎమ్మెల్యే ఆర్కేతో విభేదాలు ఉండటంతో.. కొందరు వైసీపీ నేతలు నేరుగా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉండి తమకు కావాల్సిన పనులు చేయించుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికే టికెట్‌ ఇస్తే..ఆ వర్గం ఆయనకు సహకరిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయట.

ఓవైపు బీసీ నేతలు.. మరోవైపు అసమ్మతి నేతల ప్రభావంతో వచ్చే ఎన్నికల్లో ఆర్కేకు మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం రాదనే చర్చ పార్టీ వర్గాల్లో నే ఉందట. దానిని ఆర్కే వర్గం కొట్టి పారేస్తోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డే మరోసారి పోటీ చేస్తారని.. ఆయన్ను కాదని మరొకరికి టికెట్‌ ఇవ్వరని ఎమ్మెల్యే శిబిరం గట్టిగా వాదిస్తోంది. కానీ.. మంగళగిరిలోని వైసీపీ నేతలు మాత్రం ఎవరికి వారుగా టికెట్‌పై ధీమాగా ఉన్నారు. మరి.. ఎన్నికల నాటికి మంగళగిరి వైసీపీ రాజకీయాలు ఎలాంటి టర్న్‌ తీసుకుంటాయో చూడాలి.