NTV Telugu Site icon

సీఎం జగన్ క్యాబినెట్ లో చోటు దక్కకపోవడంతో ఆ ఎమ్మెల్యే కనిపించకుండా పోయారా?

Gayab

Gayab

రాజకీయాలలో నల్లపురెడ్ల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి నెంబర్-2గా కొనసాగారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే. 2009లో టీడీపీ నుంచి గెలిచిన ప్రసన్నకుమార్‌రెడ్డి అనూహ్యంగా వైఎస్‌ఆర్‌ వైపు చేరారు. వైఎస్‌ హఠాన్మరణంతో జగన్‌కు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కూడా. 2012లో జరిగిన కోవూరు ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు ప్రసన్నకుమార్‌రెడ్డి. నాడు వైసీపీ తరఫున వైఎస్‌ విజయమ్మ తర్వాత రెండో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ పార్టీలో అంత సీనియారిటీ ఆయనది.

2014లో ఎన్నికల్లో ఓడినా 2019 ఎన్నికల్లో గెలిచారు ప్రసన్నకుమార్‌రెడ్డి. అప్పట్లోనే సీఎం జగన్ కేబినెట్‌లో చోటు లభిస్తుందని ఎంతగానో ఆశించారు. అనూహ్యంగా జిల్లా నుంచి వేరేవాళ్లకు అవకాశం దక్కింది. మూడేళ్ల తర్వాత చేపట్టిన కేబినెట పునర్‌ వ్యవస్థీకరణలో తప్పకుండా మంత్రిని చేస్తారని అనుకున్నా.. నిరాశ తప్పలేదు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం రోజునే మాజీ మంత్రితో ప్రసన్నకుమార్‌రెడ్డి భేటీ కావడం కలకలం రేపింది. కొత్త మంత్రికి వ్యతిరేకంగా ఆ మాజీ మంత్రితో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. కొత్త మంత్రి నెల్లూరుకు వచ్చే తేదీ ఖరారు అయినవెంటనే కోవూరులో ఉండకుండా హైదరాబాద్‌ వెళ్లిపోయారు ప్రసన్న. కొత్త మంత్రి కాకాణి కోవూరు మీద నుంచే నెల్లూరు వచ్చారు. కానీ.. కోవూరుకు చెందిన నాయకులు ఎవరూ కొత్త మినిస్టర్‌కు స్వాగతం పలికేందుకు రాలేదు. ప్రసన్న సూచనల మేరకే ఎవరూ రాలేదని ప్రచారం జరుగుతోంది.

కోవూరుకు ముందున్న కావలిలో మంత్రి కాకాణికి భారీ స్వాగతం పలికారు అక్కడి ఎమ్మెల్యే. ఒక్క కోవూరు, నెల్లూరు సిటీ తప్ప ఆ దారిన ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వ్యవసాయ మంత్రికి స్వాగతం లభించింది. మంత్రి పదవి రాకపోవడానికి ఎవరు కారణం అనుకున్నారో ఏమో.. ప్రసన్న అలకపాన్పు ఎక్కారు. అందరికంటే ముందు.. వైసీపీ పెట్టక ముందు నుంచే వైఎస్‌ మాట ప్రకారం టీడీపీ నుంచి బయటకు వచ్చిన తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ప్రసన్న అవమానకరంగా ఫీలవుతున్నారట.

మంత్రి కాకాణిని వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రితో ప్రసన్న కలిసి పని చేస్తారని MLA వర్గీయులు చెబుతున్నారు. కొత్త మంత్రి మాత్రం జిల్లాలోని నేతందరినీ కలిసి తనకు సహకరించాలని కోరుతున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డికి సమీప బంధువైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ నేతలందరి మధ్య సమన్వయం సాధించేందుకే ఆయనకు జిల్లా అధ్యక్షుడి బాధ్యత అప్పగించినట్టు తెలుస్తోంది. మరి.. వేమిరెడ్డి సూచనలతో ప్రసన్న మెత్తబడతారా? కొత్త మంత్రికి సహకరిస్తారా అనేది కాలమే చెప్పాలి.
Watch Here : https://youtu.be/UF2v5E8AWak