Site icon NTV Telugu

ఆ మాజీ మంత్రికి ఇంటా బయటా వ్యతిరేక పవనాలు..?

Litejpg

Litejpg

గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు.. పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. టీడీపీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందనగా యాక్టివ్‌ పాలిటిక్స్‌ ప్రారంభించారు ఈ మాజీ మంత్రి. కానీ.. ఆయన వేస్తున్న అడుగులకు.. క్రియాశీలకంగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీలోని ప్రత్యర్థులు చెక్‌ పెడుతున్నారు. దీంతో గంటా ప్రతీ కదలిక ఆసక్తిగా మారుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర నుంచి బాదుడే.. బాదుడు నిరసన టూర్‌ చేపట్టారు. విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్లారు గంటా. అక్కడ మిగిలిన నాయకులతో సమానంగానే గంటాను చంద్రబాబు పలకరించడం చర్చగా మారింది. దీంతో గంటాను చంద్రబాబు లైట్ తీసుకున్నారనే కొత్త చర్చ సాగర తీరాన్ని వేడెక్కిస్తోంది.

చంద్రబాబుతో గంటా సంబంధాలు బలహీనంగా ఉన్నాయనే చర్చ టీడీపీ సీనియర్లలో ఉంది. దానికి అనుగుణంగానే భీమిలిలో చంద్రబాబు నిర్వహించిన రచ్చబండకు గంటా వెళ్లలేదు. బాబు అక్కడ ఉండగానే హైదరాబాద్‌ వెళ్లిపోయారు ఈ మాజీ మంత్రి. టీడీపీ ఆఫీసులో జరిగిన సమీక్షకూ డుమ్మా కొట్టేశారు. మొత్తానికి ఎయిర్‌పోర్ట్‌ ఎపిసోడ్‌ తర్వాత గంటా గాయబ్‌. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు మాజీ మంత్రి. వైసీపీ, బీజేపీ, జనసేనల్లోకి వెళ్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది.

అసెంబ్లీ సమావేశాలు, పార్టీ ముఖ్య కార్యక్రమాలు, కీలకమైన మీటింగులకు డుమ్మాకొడుతూ వచ్చారు గంటా. దీనికితోడు మాజీ మంత్రి వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు టీడీపీని ఇరుకున పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ సర్కార్‌ మూడు రాజధానుల విధానాన్ని టీడీపీ వ్యతిరేకిస్తే.. ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా విశాఖను స్వాగతించారు గంటా. విశాఖ ఉక్కు కోసం ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామా పార్టీలో చర్చకు దారితీసింది. హైకమాండ్‌ను సంప్రదించకుండా తీసుకున్న రాజీనామా నిర్ణయంపై అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన మరికొన్ని పరిణామాలు టీడీపీ అధిష్ఠానంతో గ్యాప్‌నకు కారణమయ్యాయి. అవి అలా పెరిగి.. పూడ్చలేనంత దూరం వచ్చేసిందట.

గంటా విషయంలో చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతుండగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో ఇద్దరూ దిగిన ఫొటో వైరల్‌ అయింది. ఆ తర్వాత గంటా వైజాగ్‌ టీడీపీ ఆఫీసుకు రావడం.. జాయినింగ్స్‌ను ప్రారంభించడంతో మాజీ మంత్రి మళ్లీ యాక్టివ్‌ అయ్యారని అనుకున్నారు. కానీ.. వైజాగ్‌ టూర్‌లో చంద్రబాబు రియాక్షన్‌ మరోలా ఉండటంతో ప్రశ్నగా మారింది. దీనికితోడు యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేయాలని అనుకుంటున్న గంటా ప్రయత్నాలకు మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వర్గం బ్రేకులు వేస్తోంది. ఏం జరుగుతున్నా.. ఎలాంటి చర్చ నడుస్తున్నా గంటా మాత్రం పెదవి విప్పడం లేదు. మరి.. తాజా పరిణామాలపై మాజీ మంత్రి అంతరంగం ఏంటో.. ఏ చేస్తారో చూడాలి.

 

 

 

Exit mobile version