Devarkadra BJP Politics : ఆ నియోజకవర్గంలోని బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదు. మొదట్లో ఒకటి.. రెండుగా ఉన్న వర్గాలు.. ఇప్పుడు మరింత పెరిగి నాలుగు స్తంభాలాటగా మారిపోయింది. ఇది ఇక్కడితో ఆగుతుందో.. మరింత పెరుగుతుందో కమలనాథులకే అంతుచిక్కడం లేదట. ఈ పరిస్థితికి కారణం ఎవరు? అక్కడేం జరుగుతోంది? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? లెట్స్ వాచ్..!
దేవరకద్ర. తెలంగాణలో బీజేపీ దూకుడుడికి భిన్నంగా ఇక్కడ రాజకీయాలు సాగుతున్నాయి. నేతలు ఎక్కవయ్యే ఏమో.. ఎవరికీ పడటం లేదు. నాలుగు శిబిరాలు వచ్చేశాయి. వారిని సమన్వయం చేసేవాళ్లే కనిపించడం లేదు. కలిసి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. బీజేపీలో మొదటి నుంచి ఉన్న ఎగ్గని నర్సింహులు.. సుదర్శన్‌రెడ్డిలు చెరో వర్గంగా ఉంటే.. మాజీ మంత్రి డీకే అరుణతోపాటు బీజేపీలో చేరిన పవన్ కుమార్‌రెడ్డి, అడ్డాకుల మండలానికి చెందిన దేవరకద్ర బాలన్నలది మరో రెండు వర్గాలు. అంతా యమునా తీరే. ఎవరికి వారు కుంపట్లు రాజేస్తున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఎగ్గని నర్సింహులే ప్రస్తుతం దేవరకద్ర బీజేపీ ఇంఛార్జ్. కానీ.. పవన్ కుమార్‌రెడ్డి ఆ బాధ్యతలను హైజాక్ చేశారా అనే అనుమానాలు కేడర్‌లో ఉన్నాయట. ఆ మధ్య తెలంగాణలో నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలకు బీజేపీ నిర్ణయించింది. నియోజకవర్గం బాధ్యతలను మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అప్పగించడంతో గత నెల 21నే బైక్ ర్యాలీకి ప్లాన్ చేశారు. అంతా ఆ తేదీకి ఫిక్స్ అయిన తర్వాత పవన్ కుమార్‌రెడ్డి చెప్పారని 25కు మార్చారట. దాంతో పార్టీలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది.
ప్రజా గోస.. బీజేపీ భరోసా పేరుతో బైకులు తీయాలని చూస్తే.. ఆ మేరకు ఏర్పాట్లు చేయలేదట. రైతులు, వృద్ధులు, నిరుద్యోగులతో మాట్లాడేందకు ప్లానింగ్ చేయాలని చెబితే.. ఆ బాధ్యత తీసుకున్నవాళ్లే లేరట. దాంతో కార్యక్రమంపై బీజేపీ వర్గాలే పెదవి విరుస్తున్నట్టు టాక్. వెయ్యి బైక్‌లతో ర్యాలీకి నిర్ణయిస్తే.. వంద బైక్‌లను కూడా సిద్ధం చేయలేదట. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర నేతలు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
రాష్ట్రంలో బలోపేతం కావాలని బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెడితే.. దేవరకద్రలో మాత్రం నలుగురు నేతలు తలోదిక్కు చూస్తున్నారు. మండలాల వారీగా విడిపోయి తమకేం పట్టనట్టుగా ఉంటున్నారట. నియోజకవర్గ బీజేపీ నాయకుల తీరుతో విసుగెత్తిన పార్టీ నేతలు.. లోకల్ లీడర్స్‌కు గట్టిగానే తలంటారట. ఈసారి పక్కాగా ఏర్పాట్లు చేయకపోతే దేవరకద్రలో అడుగు పెట్టేదే లేదని స్పష్టం చేశారట. ఆ వార్నింగ్స్ పనిచేశాయో ఏమో.. లోకల్ బీజేపీ నేతల్లో కొంత కదలిక కనిపిస్తోంది. ముందుగా నేతల మధ్య ఐక్యతకు సమావేశాలు నిర్వహిస్తున్నారట. మరి.. చివరి వరకు కమలనాథులు ఇలాగే ఉంటారో.. పాత అంశాలు.. ఆధిపత్యపోరు గుర్తొచ్చి మళ్లీ ఎడముఖం పెడముఖంగా ఉంటారో చూడాలి.
