Site icon NTV Telugu

ఖమ్మం టీఆర్ఎస్‌లో క్రాస్‌ ఓటింగ్‌ ప్రకంపనలు..!

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఆ ఎమ్మెల్యేలకు పట్టు సడలిందా? ఎమ్మెల్యేల మాటలను వినే పరిస్థితి లేదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ ద్వారా.. ఆ నియోజకవర్గాల్లోని డొల్లతనం బయటపడిందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు?

ఎమ్మెల్యేలకు లోకల్‌ లీడర్లపై పట్టు సడలిందా?

ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ ప్రకంపనలు టీఆర్ఎస్‌ వర్గాల్లో కొనసాగుతున్నాయి. ఎవరికి వారుగా పోస్టుమార్టం చేస్తున్నారు. అందరి ఫోకస్‌ కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలపై ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే క్రాస్ ఓటింగ్‌ జరిగిందా లేక.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఎమ్మెల్యేలకు పట్టు సడలిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్‌ మాట వినలేదా?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాగానే టీఆర్ఎస్‌లోని ఒక నేత క్రాస్‌ ఓటింగ్‌కు కారణమని ప్రచారం జరిగింది. ఇప్పటికీ కొందరికి ఆయనపైనే అనుమానాలు ఉన్నాయట. కానీ.. నిత్యం ఎమ్మెల్యేతో టచ్‌లో ఉన్న స్థానిక సంస్థల్లోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం రెవిన్యూ డివిజన్ల పరిధిలో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్నది అందరూ చెప్పే మాట. మధిరలో జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజ్‌ ఉన్నప్పటికీ ఆయన మాట వినలేదు. వైరాలో క్రాస్ ఓటింగ్‌కు ఫలానా వారు కారణమని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇక్కడ ఎమ్మెల్యే రాములు నాయక్‌ స్పష్టంగా చెప్పినప్పటికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తాము చేయాల్సింది చేసేశారు.

కొత్తగూడెంలో వనమాకు సహకరించని స్థానిక నాయకులు?

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ నుంచి గెలిచి.. టీఆర్ఎస్‌లోకి రావడంతో.. ఆయనకు స్థానిక నేతలు సహకరించడం లేదనే వాదన ఉంది. ఆ ప్రభావమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించిందని చెబుతున్నారు. పార్టీలోని కొందరు నాయకులకు కొత్తగూడెంలో బలమైన వర్గాలు ఉన్నాయి. ఎమ్మెల్యేతో వారికి గ్యాప్‌ ఉంది. వనమాను ఇరకాటంలో పెట్టేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను వారు అనుకూలంగా మలుచుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

అశ్వరావుపేటలో ఎమ్మెల్యే మెచ్చాకు ఇంకా పట్టు చిక్కలేదు?
శల్య సారథ్యం చేసిన వాళ్లను గుర్తించారా?

అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీని వీటి ఈ మధ్యే టీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకు స్థానికంగా ఇంకా టీఆర్ఎస్‌పై పట్టు చిక్కలేదట. దానిని ప్రత్యర్థులు క్యాష్‌ చేసుకున్నారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మధిర, వైరా, కొత్తగూడెం, అశ్వరావుపేట నుంచే టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారపార్టీ ఇప్పటికే గుర్తించిందని..శల్య సారథ్యం చేసిన సొంత పార్టీ నాయకులను పసిగట్టారని చెబుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్‌ పూడ్చడం ఒక సమస్య అయితే.. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాళ్లపై చర్యలు తీసుకోవడం ఇంకో సవాల్‌. మరి.. ఈ విషయాల్లో అధికారపార్టీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో చూడాలి.


Exit mobile version