Site icon NTV Telugu

CPI Narayana Apologies : ఆ కమ్యూనిస్ట్ నేతకి ఏమైంది..? మెగా ఫ్యాన్స్తో ఎందుకు పెట్టుకున్నాడు..?

Narayana Apoligies To Chiranjeevi

Narayana Apoligies To Chiranjeevi

CPI Narayana Apologies To Chiranjeevi : ఆ కామ్రేడ్‌ మళ్లీ ఏసేశారు…! రచ్చ రచ్చ అయ్యాక సారీ చెప్పేశారు కూడా. ఎందుకలా? ఆ కమ్యూనిస్ట్‌ నేతకు ఏమైంది. మెగా బ్రదర్స్‌పై కామెంట్స్‌ చేసి.. వాళ్ల ఫ్యాన్స్‌తో ఎందుకు పెట్టుకున్నారు? ఒకప్పుడు రాజకీయంగా అంటకాగి.. సన్నిహితంగా మెలిగిన వారిపై ఆ కమ్యూనిస్ట్ ఎందుకలా కామెంట్స్‌ చేశారు? లెట్స్‌ వాచ్‌..!

ఇదీ సంగతి. అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే సామెత అచ్చుగుద్దునట్టు ఈ ఉదంతానికి సరిపోతుంది. చిరంజీవిని రంగులు మార్చే ఊసరవెల్లి.. అని అంటూనే.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను ఓ ల్యాండ్‌మైన్‌గా అభివర్ణించారు CPI జాతీయ కార్యదర్శి నారాయణ. ఈ అంశంపై మెగా బ్రదర్‌ నాగబాబు ట్విటర్‌ వేదికగా కమ్యూనిస్ట్‌ నేతపై గట్టిగానే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత చిరంజీవి అభిమానులు స్వరం పెంచారు. ఇంతలో నారాయణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లడం.. ఆయన రాక గురించి తెలుసుకున్న చిరంజీవి ఫ్యాన్స్‌ రావులపాలెం దగ్గర అడ్డుకోవడం చక చకా జరిగిపోయింది. అప్పటికే నారాయణ క్షమాపణ చెప్పినా.. అభిమానులు వెనక్కి తగ్గలేదు. బాషా దోషంగా భావించాలని.. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు చిరంజీవి అభిమానులకు చెప్పారు నారాయణ.

సీపీఐ నారాయణకు ఇలాంటి వివాదాలు కొత్తకాదు. గతంలో గాంధీ జయంతి రోజున చికెన్‌ తినడంతో.. చికెన్‌ నారాయణగా పేరు పొందారు. ఇప్పటికీ కొందరు అదే పేరుతో నారాయణపై సెటైర్లు వేస్తారు కూడా. తాజా ఎపిసోడ్‌లో మరో గమ్మత్తు ఉంది. చిరంజీవితో సన్నిహితంగా ఉన్న సందర్భాలూ అనేకం ఉన్నాయి. కానీ.. అవి గుర్తుకు రాలేదో ఏమో.. ఒక్కసారిగా మాటల తూటాలు పేల్చి చేతులు కాల్చుకున్నారు.

ఇక పవన్‌ కల్యాణ్ విషయానికి వస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నారు. రాజకీయంగా పలు అంశాలపై కలిసి పోరాటం చేసిన చరిత్ర ఉంది. రాజధాని అమరావతితోపాటు అనేక అంశాలపై ఒకే స్వరం వినిపించారు. అలా మూడేళ్ల క్రితం అంటకాగిన నేతపై ఈ విధంగా నారాయణ మాటలతో చెలరేగిపోవడం చర్చగా మారింది. ఎన్నికల సమయంలో మిత్రులుగా ఉన్న నాయకులను.. పొత్తు విచ్ఛిన్నం కాగానే శత్రువులుగా చూడటం నారాయణకే చెల్లిందా? సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు.. కానీ.. ఆ మాటున వ్యక్తిగత విమర్శలు చేయొచ్చా? పొత్తు ఉంటే మిత్రులు.. పొత్తు నుంచి బయటకు మరోలా చూడాలా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండబోరనడానికి నారాయణ మాటలు తార్కాణమా? ఒక జాతీయ పార్టీకి జాతీయ నేతగా ఉన్న నారాయణ.. ఎందుకలా కామెంట్స్‌ చేశారు? ఇదే ప్రస్తుతం రాజకీయా వర్గాల్లో చర్చగా మారుతోంది. రాజకీయ నేతలకు వ్యూహాలు ఉంటాయి. మాటలు ఆచి తూచి వదులుతారు. మరి.. నారాయణకి ఏమైందన్నదే ప్రశ్న.

Exit mobile version