Site icon NTV Telugu

Patnam Mahender Reddy : పట్నం మహేందర్ రెడ్డి దంపతుల చుట్టూ వివాదం

Mahindaer Reddy

Mahindaer Reddy

Controversy around Patnam Mahender Reddy couple

 

ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపికట్టుది మరోదారి అన్నట్టుగా ఉంది అక్కడ టీఆర్‌ఎస్‌ పంచాయితీ. తాజా రగడపై రెండు వర్గాలను పిలిచి పార్టీ పెద్దలు క్లాస్ తీసుకున్నారు. మరి.. సమస్య కొలిక్కి వచ్చినట్టేనా? ఆ ఫ్యామిలీ చుట్టూనే ఎందుకు చర్చ.. రచ్చ అవుతోంది? ఎవరా నాయకులు?

రాజకీయాల్లో ఇదో రకమైన ఉడుంపట్టు. అధికారపార్టీలో పెద్ద పదవుల్లో ఉన్నా.. ఏదో వెలితి. అసెంబ్లీకి పోటీ చేయాలి.. గెలిచి పట్టుసాధించాలి. ఈ అంశాల చుట్టూనే గత మూడున్నరేళ్లుగా సాగుతున్న తాండూరు రాజకీయ రచ్చ ఇప్పుడు వికారాబాద్‌కు పాకింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద దుమారమే రేపుతోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి దంపతుల చుట్టూ రేగుతున్న వివాదమే దానికి కారణం. తాజాగా పార్టీ పెద్దల దగ్గర పంచాయితీ జరగడంతో సమస్య కొలిక్కి వస్తుందా రాదా అనే చర్చ సాగుతోంది.

తాండూరులో ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి మహేందర్‌రెడ్డికి పడటం లేదు. 2018 ఎన్నికల్లో ఇద్దరూ ఒకరిపై ఒకరు పోటీ చేశారు. పట్నం టీఆర్ఎస్‌ నుంచి.. పైలెట్‌ కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉండగా.. ఆ ఎన్నికల్లో పట్నం ఓడిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పైలెట్‌ టీఆర్‌ఎస్‌లోకి రావడం.. అది పట్నానికి రుచించకపోవడంతో వర్గపోరు రాజుకుంది. అనేక విధాలుగా ఆ పోరు బుసలు కొడుతోంది. ఇటీవల అది తారాస్థాయికి చేరింది కూడా. తాజాగా వికారాబాద్‌ రగడలో సునీతా మహేందర్‌రెడ్డి పేరు వినిపించడంతోపాటు రెండు రోజులపాటు రచ్చ రచ్చ అయింది.

సునీతా మహేందర్‌రెడ్డిని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ వర్గం అడ్డుకోవడంతో అందరి దృష్టీ ఇక్కడి ఆధిపత్య పోరాటంపై పడింది. ఈ ఘర్షణలపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా.. తెరవెనక ఏదో కథ ఉందని అధికార పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయట. పట్నం జంట అధికారపార్టీకి గుడ్‌బై చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా తమకు అవకాశం దొరికే చోటుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు చెవులు కొరుక్కుటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో అయితే ఈ చర్చ మరీ ఎక్కువగా ఉందట.

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీటు కోసం ఇప్పటి నుంచే నాయకులు జాగ్రత్త పడుతున్నారు. గెలిచే అవకాశం ఉన్న పార్టీలు.. ఎక్కడ ఛాన్స్‌ ఉంటుందో భేరీజు వేసుకుని కండువాలు మార్చేస్తున్నారు. ఇతర పార్టీలతో పట్నం మహేందర్‌రెడ్డి కూడా టచ్‌లో ఉన్నారో లేదో కానీ.. విషయం తెలుసుకున్న తర్వాత ఆకర్షణ వల విసరడానికి అడ్వాన్స్‌ అవుతున్నాయి పార్టీలు. తాజా గొడవపై టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు. ఆ సమయంలోనూ రెండు వర్గాలు ఎవరి వాదన వారు వినిపించినట్టు సమాచారం. పార్టీకి నష్టం చేసేలా ఎవరి చర్యలు ఉండకూడదని కేటీఆర్‌ హెచ్చరించినట్టు తెలుస్తోంది. కలిసి పనిచేయాలని సూచించారట. మరి.. పార్టీ పెద్దలు చెప్పినట్టు పట్నం ఫ్యామిలీ.. ఆయన వ్యతిరేకులు నడుచుకుంటారో లేదో చూడాలి.

 

Exit mobile version