Site icon NTV Telugu

Off The Record: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తలనొప్పిగా మారబోతోందా?

Muncipal

Muncipal

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో పాత పంచాయితీలు కొత్తగా రేగబోతున్నాయా? పార్టీ పెద్దలు మున్సిపల్‌ బామ్‌ రాసుకోక తప్పదా? ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాల్లోనే సమస్య తీవ్రంగా ఉండబోతోందా? ఏవా అసెంబ్లీ సెగ్మెంట్స్‌? అక్కడ మాత్రమే ఎందుకు మోత మోగుతోంది?

Read Also: Off The Record: రసవత్తరంగా మారుతున్న చేవెళ్ళ కాంగ్రెస్ రాజకీయం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నిర్వహణ కోసం ఓవైపు అధికార యంత్రాంగం సిద్ధమవుతుండగా… మరోవైపు పొలిటికల్‌ హీట్‌ కూడా పెరిగిపోతోంది. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ అయితే.. ఎప్పటినుంచో కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన సమస్యలు మళ్ళీ తలెత్తకుండా చూసే పనిలో పడింది పార్టీ నాయకత్వం. కానీ… కొత్త, పాత వివాదాలను ఎలా సెట్‌ చేయాలన్నది బిగ్‌ టాస్క్‌. కొత్త నేతలకు ప్రాధాన్యత ఇస్తే పాతవాళ్ళని బుజ్జగించడం ఎలా..? అంతా కొత్త నాయకుల వెంట వచ్చిన వాళ్లకే టికెట్లు ఇస్తే… పాత లీడర్స్‌ పంచాయితీ తేల్చేది ఎవరన్న ప్రశ్నలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గాల్లో వాళ్లకు, వాళ్ళ చేతిలో ఓడిన పాత కాంగ్రెస్‌ నాయకులకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు వర్గాల మధ్య రాజీ కోసం పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నా అంత ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదంటున్నారు.

Read Also: Health Tips: ఈ చర్మ లక్షణాలను విస్మరించవద్దు, అవి మధుమేహానికి సంకేతం కావచ్చు

పటాన్ చెరు, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, చేవెళ్ల, బాన్సువాడ, గద్వాల,జగిత్యాల, భద్రాచలం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నది పార్టీ వర్గాల టాక్‌. పటాన్ చెరు నియోజకవర్గాన్నే తీసుకుంటే… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన మీదే బీఆర్ఎస్‌ తరపున గెలిచిన గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ కండునవా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్‌ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇక పటాన్ చెరు నియోజకవర్గంలోని కొంత భాగం జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. అలాగే… ఐదు మున్సిపాలిటీలు, వంద మందికి పైగా కౌన్సిలర్స్‌ కూడా ఈ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్నారు. కానీ…. లీడర్‌ ఎవరన్నది క్యాడర్‌కు మాత్రం అర్ధం కావడం లేదు. రేపు మున్సిపల్‌ ఎన్నికల్లో బీ ఫామ్స్‌ ఎవరికి వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఇక జగిత్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ సీనియర్ నేత ఎమ్మెల్యే టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు భద్రాచలంలోనూ అదే పరిస్థితి. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును మాజీ ఎమ్మెల్యే, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య వ్యతిరేకిస్తున్నారు.

Read Also: Varanasi Release Date: క్రేజీ అప్‌డేట్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

నియోజకవర్గంలో తనకు తెలియకుండానే ఎమ్మెల్యే తన వర్గానికి, పాత బీఆర్ఎస్ క్యాడర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని పొదెం వాదన. అటు బాన్సువాడలో పోచారం వర్సెస్ఏనుగు రవీందర్ రెడ్డి అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి పెత్తనాన్నిఏనుగు రవీందర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. గద్వాల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిన సరితా తిరుపతయ్య ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. చేవెళ్లలో కాలేయాదయ్య వర్సెస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీం భరత్ అన్నట్లుగా రాజకీయం ఉంది. స్టేషన్ ఘన్ పూర్‌లో కడియం శ్రీహరి, ఇందిర మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమతో నడిచిన క్యాడర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని పది నియోజకవర్గాల్లో ఓడిన నేతలు అంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాలు మేము మోస్తే అధికారం వచ్చిన తర్వాత పెత్తనం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందన్నది సదరు నేతల ఆవేదన. ఇదే అంశాన్ని పీసీసీ, అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆయా నియోజకవర్గాల నేతలు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పాత కొత్త పంచాయితీకి ఫుల్ స్టాప్ పెట్టేలా ఇప్పటికైనా పీసీసీ పెద్దలు ఫోకస్ పెడతారా..? లేక గాలికి వదిలేస్తారా..? అన్నది పెద్ద క్వశ్చన్‌ మార్క్‌. మున్సిపల్‌ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం ఉండేలా పెద్దలు చొరవ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నాయకులు. స్క్రీనింగ్ కమిటీ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందన్నది చూడాలి.

Exit mobile version