Site icon NTV Telugu

ఏపీకి రమ్మని సీఎం కేసీఆర్‌ను పిలిచిందెవరు?

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఏపీ, తెలంగాణలో పొలిటికల్‌ సెగలు.. పొగలు కక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్‌ ప్లీనరీ నుంచి కీలక కామెంట్స్‌ చేశారు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌. ఏపీ పిలుస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇంతకీ కేసీఆర్‌ను ఏపీ నుంచి ఎవరు పిలిచారు? ప్లీనరీలో చేసిన కామెంట్స్‌ వెనక ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడ ఉందా? పొలిటికల్‌ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్‌ వాచ్‌..!

ఏపీ పిలుస్తోందన్న కేసీఆర్‌ మాటల వెనక చాణక్యం?

దళితబంధు పథకం బ్యాక్‌ గ్రౌండ్‌లోనే గులాబీ దళపతి ఈ కామెంట్‌ చేశారా? లేక ఇంకేదైనా బలమైన కారణం ఉందా? ఏపీ పిలుస్తున్నట్టుగా సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసిన తర్వాత వినిపిస్తున్న ప్రశ్నలివే. ఏపీలో పార్టీ పెడితే.. గెలిపించుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేలమంది కోరుతున్నట్టు చెప్పారు కేసీఆర్‌. ఈ మాటలు టీఆర్ఎస్‌ శ్రేణులను ఉత్సాహ పర్చాయి. ఈలలు వేశారు. తప్పట్లు కొట్టారు. కానీ.. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ చిత్రం గమనిస్తున్నవాళ్లు మాత్రం.. కేసీఆర్‌ మాటల వెనక చాణక్యం ఉందని లెక్కలేస్తున్నారు.

షర్మిల పార్టీ బ్యాక్‌ డ్రాప్‌లోనే కామెంట్‌ చేశారా?

ఏపీలో సీఎం జగన్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య సఖ్యత బాగానే ఉంది. పలు సందర్భాలలో ఏపీకి వెళ్లి వచ్చారు కేసీఆర్‌. ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్‌ కార్యకలాపాలు లేవు. తెలంగాణలో వైసీపీ ఉనికిలో లేదు. కాకపోతే వైఎస్‌ షర్మిల తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ తదితరులపై పదునైన విమర్శలు చేస్తున్నారు షర్మిల. వీటిపై టీఆర్ఎస్‌ నేతలు నేరుగా స్పందించకపోయినా.. పరోక్ష కౌంటర్లయితే పడ్డాయి. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ చేసిన తాజా కామెంట్స్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు విశ్లేషకులు. ఏపీ పిలుస్తోంది అన్న మాటలో చాలో చాలా బలం ఉందని.. అంత తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదని అనుకుంటున్నారు.

గతంలో భీమవరంలో పోటీ చేస్తే ఈజీగా గెలుస్తానన్న కేటీఆర్‌..!

2016 GHMC ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్‌ సైతం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. TRSను తెలుగు రాష్ట్రాల సమితిగా మారుస్తామని.. తాను భీమవరం నుంచి పోటీ చేసి ఈజీగా గెలుస్తానని కేటీఆర్‌ అన్నారు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత గులాబీ దళపతి కేసీఆర్‌ ఒక పాచిక విసిరారు. కాకపోతే ఆయన ప్రస్తావించిన సందర్భంగా.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేడిగా ఉన్న సమయంలో వదిలిన బాణం కావడంతో.. ఆయన ఎవరిపై గురిపెట్టారు అన్నది ప్రశ్నగా మారింది. అలాగే కేసీఆర్‌ను ఏపీకి రమ్మని పిలిచింది ఎవరు? ఇప్పుడే ఎందుకు ఆ మాట ప్రస్తావించారు? ఆయన మనసులో ఏముంది? అనేది గులాబీ దళపతే బయటపెట్టాలి. అప్పటి వరకు ఈ అంశంపై విశ్లేషణలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది.

Exit mobile version