Site icon NTV Telugu

ఒక్కప్పుడు ఆ ఫ్యామిలీదే పెత్తనం…వారసులు ఆ స్పీడ్ అందుకోలేకపోయారా..?

Dky

Dky

డీకే ఆదికేశవులు…మాజీ ఎంపీ .. టీటీడీ మాజీ ఛైర్మన్‌. చిత్తూరు జిల్లాలో వ్యాపార పరంగా, రాజకీయంగాను పెద్ద కుటుంబం. ఆర్థికంగానూ బలమైన ఫ్యామిలీ. చిత్తూరుతోపాటు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో డీకే కుటుంబానికి పట్టు ఉండేది. 2004లో టిడిపి తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసిన ఆదికేశవులు.. తర్వాత కాంగ్రెస్‌లో చేరి TTD ఛైర్మన్‌ అయ్యారు. డీకే శ్రీనివాసులు 2009లో పీఆర్పీ తరపున రాజంపేట లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత డీకే కుటుంబం మరోసారి టీడీపీకి చేరువైంది. 2014లో ఆదికేశవుల సతీమణి సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై డీకే ఫ్యామిలీ మరోసారి సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. సత్యప్రభ మృతి చెందిన తర్వాత డీకే కుటుంబం గురించి రాజకీయ చర్చే లేదు.

మరో రెండేళ్ల తర్వాత ఏపీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో డీకే ఫ్యామిలీ మరోసారి యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రావడానికి ఉత్సాహంగా ఉంది. డీకే ఆదికేశవుల తనయుడు డీకే శ్రీనివాసులు అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి శ్రీనివాసులు ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో బలిజ ఓటర్లు ఎక్కువ. శ్రీనివాసులు కూడా అదే సామాజికవర్గం కావడంతో ఈజీగా గెలవొచ్చని లెక్కలేస్తున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి డీకే తనయుడికి వైసీపీ, టీడీపీ నుంచి ఆఫర్లు వెళ్లినట్టు తెలుస్తోంది. గత ఏడాది సీఎం జగన్‌ తిరుమల వచ్చినప్పుడు పద్మావతి అతిథి గృహం దగ్గర శ్రీనివాసులు ఆయనతో భేటీ అయ్యారు. రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి ఆయన్ను సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. దాంతో ఆయన వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది.

చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్‌ అనే ధీమాతో ఉన్నారు ఆరణి. మరికొందరు వైసీపీ నేతలు కూడా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ లెక్కలు చూశాక.. టీడీపీ నేతలు గేర్‌ మార్చేశారట. వైసీపీలో టికెట్‌ వస్తుందో లేదో తెలియదు.. అక్కడికి ఎందుకు.. టీడీపీలోకి వస్తే టికెట్‌ గ్యారెంటీ.. గెలుపు గ్యారెంటీ అని డీకే శ్రీనివాసులకు నూరిపోస్తున్నారట. అంతేకాదు.. పసుపు కండువా కప్పుకొంటే మరోసారి డీకే ఫ్యామిలీకి జిల్లాలో పూర్తి పట్టు వస్తుందని చెబుతున్నారట. దీంతో వైసీపీలోకి వెళ్లాలో.. టీడీపీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలో శ్రీనివాసులు తేల్చుకోలేకపోతున్నారట.

 

Exit mobile version