Off The Record: తెలంగాణలో గ్రామ సమరం ముగిసింది. పార్టీ గుర్తులతో సంబంధం లేకున్నా…. తాము బలపరిచిన ఎంత మంది అభ్యర్థులు గెలిచారో లెక్కలు చూసుకుని బలాబలాలను విశ్లేషించుకుంటున్నాయి అధికార, ప్రతిపక్షాలు. అయితే… ఈ రిజల్ట్స్‌ని బీఆర్‌ఎస్ ఓ కొత్త కోణంలో చూస్తోందట. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమకు అనుకూలమైన, మంచి ఫలితాలే వచ్చాయన్నది గులాబీ నేతల అభిప్రాయం. అధికార పార్టీకి వన్‌సైడెడ్‌గా ఉండాల్సిన ఫలితాల్లో తాము కూడా గౌరవప్రదమైన స్థానాలు సంపాదించామన్నది కారు పార్టీ ఫీలింగ్. అయితే… ఇక్కడే వాళ్ళకో భయం పట్టుకుందట. గెలిచిన సర్పంచ్‌లంతా తమతోనే ఉంటారా? లేక ఫిరాయిస్తారా అన్న అనుమానాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
READ ALSO: Off The Record: విశాఖలో గూగుల్ కు భూ కేటాయింపు కొత్త మలుపు తిరగబోతుందా?
అందుకే గెలిచిన వాళ్ళ గురించి జాగ్రత్తగా పట్టించుకుంటూ ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నారట. విజేతలందర్నీ హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు పిలిపించి ప్రత్యేక సన్మానాల ప్రోగ్రామ్ పెడుతున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే… జిల్లాలకు కూడా వెళ్లి తమ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ లను ప్రత్యేకంగా సన్మానిస్తున్నారు. అయితే… ఈ ప్రోగ్రామ్ వెనక పెద్ద స్కెచ్చే ఉందని చర్చించుకుంటున్నారు పార్టీలోని నాయకులు. సర్పంచ్‌లు ఏ పార్టీ మద్దతుతో గెలిచినా… అప్పుడు అధికార పార్టీకి జై కొట్టే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. పనులు, నిధులు, ప్రోటోకాల్, చెక్ పవర్… ఇలా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అందుకే సాధారణంగా పవర్‌లో ఉన్న పార్టీతో పెట్టుకోవాలని అనుకోరు. ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తమ మద్దతుతో గెలిచిన సర్పంచులు కూడా గోడదూకే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారట బీఆర్‌ఎస్ నాయకులు. అందుకే సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారానికంటే ముందే… వాళ్ళని పిలిచి, బుజ్జగించి నాలుగు మంచి మాటలు చెప్పి ఓ శాలువా కప్పి… గులాబీ గుభాళింపులు తగ్గనీయొద్దని చెవిలో ఊదుతున్నారట పార్టీ పెద్దలు.
ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లంతా ఒకేరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకంటే ముందుగానే తమ మద్దతుతో గెలిచిన అందర్నీ ఒకే వేదిక మీదికి తీసుకువచ్చి ప్రత్యేక సన్మాన ప్రోగ్రామ్ పెడుతోంది కారు పార్టీ అధిష్టానం. ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్‌రావు ఈ సన్మాన కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇక జిల్లాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్‌లు కూడా తమ మద్దతుతో గెలిచిన వాళ్లని పిలిపించి శాలువాలు కప్పి ఘన సత్కారాలు చేస్తున్నారు. ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికార పార్టీలోకి వెళ్ళినాసరే… వాళ్ళు మా వాళ్ళని చెప్పుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నది బీఆర్‌ఎస్ లెక్క. ఇక పనిలో పనిగా… అక్కడక్కడా స్వతంత్రంగా సర్పంచ్‌లను కూడా ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ… సన్మానం చేస్తున్నారు.
ఇంకోవైపు తెలంగాణలో చాలాచోట్ల కాంగ్రెస్‌కు ఏకగ్రీవం అయిన చోట ఉపసర్పంచ్‌లుగా బీఆర్ఎస్‌కు చెందిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఏకగ్రీవ ఉపసర్పంచ్‌లను సైతం పిలిపించుకొని సత్కారాలతో గౌరవిస్తున్నారట. ఒకవేళ జంపింగ్స్ ఉంటే… ఉప సర్పంచ్‌లు కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే వాళ్ళను కూడా మా వాళ్ళు అనిపించుకుంటున్నట్టు సమాచారం. ఈ చర్య ద్వారా… తాము పార్టీలో టాప్ టు బాటమ్ అందర్నీ గౌరవిస్తున్నామని చెప్పడంతోపాటు…రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఉపయోగపడేలా స్కెచ్ వేస్తోందట గులాబీ అధిష్టానం. కేవలం సన్మానాలతో సరిపెట్టకుండా… రాష్ట్ర ప్రభుత్వానికి మీరు భయపడాల్సిన అవసరం లేదని కూడా నూరిపోస్తున్నట్టు తెలిసింది. సర్పంచ్‌లకు ఏ ఎమ్మెల్యే, ఎంపీ నుంచి నిధులు రావని, అన్నీ డైరెక్ట్‌గా గ్రామపంచాయతీలకే నిధులు వస్తాయని, మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ అసలు పార్టీ మార్పు ఆలోచనే రాకుండా ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నారట కేటీఆర్. అయితే… ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన వాదన కూడా వినిపిస్తోంది. అసలు పార్టీ మారాలన్న ఆలోచన రాకుండా ఉండాలేగానీ…. ఒకసారి వచ్చాక… ఈ సత్కారాలు, హితబోధలు వాళ్ళని ఆపుతాయా అన్నది బేసిక్ క్వశ్చన్. బీఆర్‌ఎస్ అదిష్టానం ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.
READ ALSO: Off The Record: తెలంగాణలో మిత్రభేదం మొదలైందా? కాంగ్రెస్ సీపీఐ మధ్య ఏం జరుగుతుంది?
