BJP Telangana Organizational General Secretary : బీజేపీలో అది కీలక పోస్ట్. అధ్యక్షుడు తర్వాత చాలా పవర్ ఫుల్ పదవి. ఇప్పటి వరకు ఆ పోస్ట్‌లో ఉన్న నేతను సడెన్‌గా పంపించేశారు. మరి కొత్తగా వచ్చేది ఎవరు? తెలంగాణకు సుపరిచితమైన వ్యక్తినే తీసుకొస్తారా.. లేక ఇతర రాష్ట్రాల నుంచి డంప్ చేస్తారా?
బిజెపి తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శి గా ఉన్న మంత్రి శ్రీనివాస్ ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం పంజాబ్, చండీఘర్‌లకు పంపించింది. మంత్రి శ్రీనివాస్ ప్లేస్‌లో కొత్తగా ఎవరిని నియమించలేదు. ఎవరు వస్తారనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి సంకేతాలు లేవట. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులుగా ఆర్‌ఎస్‌ఎస్‌లో ఫుల్‌టైమర్స్‌గా పని చేసేవారిని నియమిస్తారు. అందుకే తెలంగాణకు వచ్చే ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకుల్లో ఎవరికి ఛాన్స్ ఉంటుందనేదానిపై ఆరా తీస్తున్నారట.
ఎన్నికలకు సమయం ఎక్కువగా లేక పోవడం… పార్టీ లో సంస్థాగత ప్రధాన కార్యదర్శి కీలకం కావడంతో వచ్చే వారు ఎవరు అనే దానిపై ఆసక్తి పెరుగుతోంది. కొత్త వారు వస్తే తక్కువ టైమ్‌లో పార్టీ గురించి తెలుసుకోవడం.. పట్టు సాధించడం ఇబ్బంది అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శులుగా వేరే రాష్ట్రాల్లో కొనసాగుతున్న వారిలో ఒకరిని తెలంగాణకు పంపోచ్చు అని పార్టీ వర్గాలు లెక్కలేస్తున్నాయి.
యూపీలో రెండు ఎన్నికల్లో బిజెపిని గెలిపించడంలో కీలక పాత్ర వహించిన సంస్థాగత ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తెలంగాణకు వస్తారని అనుకుంటున్నారు. ఆయన అమిత్ షా కి సన్నిహితుడు అనే టాక్ ఉంది. ప్రస్తుతం తెలంగాణ పై అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే ఆయన తనకు నమ్మకస్తుడైన వ్యక్తిని తెలంగాణకు పంపుతారని టాక్. ఒకవేళ సునీల్ బన్సల్ వస్తే.. ఆయనకు సహా సంఘటన కార్యదర్శిగా రాష్ట్రానికి చెందిన RSS ప్రచారక్ ను పెడతారని పార్టీ వర్గాలు లెక్కలేస్తున్నాయి.
ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న తరుణ్‌చుగ్‌ను కూడా మార్చొచ్చని చర్చ నడుస్తోంది. ఆయన స్థానంలో కొత్త ఇంఛార్జ్ వస్తారట. అప్పుడు కొత్త నేతల సారథ్యంలో బీజేపీ పనిలో స్పీడ్ పెరుగుతుందని కాషాయ శిబిరం భావిస్తోంది. మరి.. బీజేపీ కేంద్ర నాయకత్వం ఏం చేస్తుందో చూడాలి.